Viral Video: తాగుబోతు రకూన్.. అర్ధరాత్రి మద్యం షాపులో దూరి పీకల దాకా తాగేసి రచ్చ రంబోలా..! వీడియో
Drunk raccoon found passed out on liquor store floor after breaking in: తాజాగా ఓ రకూన్ అనుకోకుండా ఓ మద్యం దుకాణంలోకి ప్రవేశించి నానారచ్చ చేసింది. షాపులో మద్యం బాటిళ్లను ధ్వసం చేసి.. కింద ఒలికిపోయిన మద్యం రుచి చూసింది. తెగ నచ్చేసిందేమో.. అక్కడే మరికొన్ని బాటిళ్లు పగలగొట్టి మరికాస్త సేవించింది. ఆ తర్వాత..

అడవుల్లో కనిపించే రకరకాల జంతువుల్లో రకూన్ (Raccoon) అనే జంతువులు కూడా కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో ఇవి తరచూ జనావాసాల్లోకి వచ్చి నానాభీబత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ రకూన్ అనుకోకుండా ఓ మద్యం దుకాణంలోకి ప్రవేశించి నానారచ్చ చేసింది. షాపులో మద్యం బాటిళ్లను ధ్వసం చేసి.. కింద ఒలికిపోయిన మద్యం రుచి చూసింది. తెగ నచ్చేసిందేమో.. అక్కడే మరికొన్ని బాటిళ్లు పగలగొట్టి మరికాస్త సేవించింది. ఆ తర్వాత మత్తులో జోగుతూ పక్కనే ఉన్న ఓ బాత్రూంలో హాయిగా నిద్రపోయింది. ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
వర్జీనియాలోని ఆష్లాండ్‌లోని ఓ మద్యం షాపు సీలింగ్ టైల్ గుండా ఓ రకూన్ అర్ధరాత్రి వేళ షాపులోకి ప్రవేశించింది. ఆ సమయంలో షాపు మూసి ఉండటంతో అది లోపల ఉన్న బాటిళ్లను అనుకోకుండా పగలగొట్టింది. కింద ఒలికిపోయిన మద్యాన్ని రుచి చూసిన రకూన్.. షెల్ప్‌లలోని స్కాచ్, విస్కీ బాటిళ్లను ధ్వంసం చేసింది. కింద పడిపోయిన మద్యం ఇష్టం వచ్చినట్లు తాగింది. ఆనక మత్తులో జోగుతూ పక్కనే ఉన్న బాత్రూమ్‌లో స్పృహ కోల్పోయి పడిపోయింది. మర్నాడు షాపు ఓపెన్ చేసిన యజమాని మద్యాం బాటిళ్లు పగిలిపోయి ఉండటం చూసి ఖంగుతిన్నాడు. ఆనక షాపంతా వెదికిన సదరు వ్యక్తికి బాత్రూమ్‌లో మత్తులో జోగుతున్న రకూన్ కనిపించింది.
New video shows a raccoon who broke into a Virginia liquor store rummaging through the aisles during a drunken escapade. The nocturnal menace was later seen passed out on the store’s bathroom floor. pic.twitter.com/WyJ5Pibs0F
— CBS News (@CBSNews) December 3, 2025
వెంటనే స్థానిక జంతు నియంత్రణ అధికారులకు సమాచారం అందించాడు. జంతు నియంత్రణ అధికారి సమంత మార్టిన్ అక్కడికి చేరుకుని దాన్ని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. మద్యం సేవించి స్పృహ కోల్పియినట్లు ఆమె తెలిపింది. కొన్ని గంటల నిద్ర తర్వాత అది మత్తునుంచి కోలుకుందని, ఆ తర్వాత దానిని అడవిలో వదిలిపెట్టినట్లు హనోవర్ కౌంటీ యానిమల్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ వెల్లడించింది. రకూన్‌కు ఎటువంటి గాయాలు కాలేదని, కొన్ని గంటల నిద్ర తర్వాత దాన్ని అడవిలోకి వదిలేసినట్లు తెలిపింది. బహుశా హ్యాంగోవర్ వల్ల అది కొన్ని గంటలపాటు మత్తులో లేవలేకపోయి ఉంటుందని పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. ఈ వీడియోలో రక్కూన్ ఓ టాయిలెట్ దగ్గర నిద్రపోతూ ఉండటం చూడొచ్చు. మద్యం తాగిన తర్వాత కదలలేక పాపం అక్కడే కునుకేసినట్లు తెలుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇంతకీ మీరేమంటారు..?
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి.








