MH 370: 10 ఏళ్లు, 239 ప్రయాణీకులు.. ఆ విమానం ఎక్కడ.? ఆచూకీ కోసం మళ్లీ సెర్చింగ్
239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన బోయింగ్-777 విమానం... పేరు MH370... టేకాఫ్ ఐన 38 నిమిషాల తర్వాత మాయమైంది. ఆకాశంలో ఎగురుతుండగానే సడన్‌గా అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోవడం వరకే తెలుసు. ఆ తర్వాత ఏమైందన్నదే మిస్టరీ. ఆ మలేషియా విమానం ఏమైంది? కూలిపోయిందా?

విమానాలు టేకాఫ్ అవుతాయ్. డెస్టినేషన్ దగ్గర సేఫ్‌గా ల్యాండౌతాయి. దురదృష్టవశాత్తూ కొన్ని మధ్యలోనే కూలిపోతాయి. ఇంతవరకూ ఓకే. ఆకాశంలోనే ఏదైనా విమానం సడన్‌గా అదృశ్యమైతే! విమాన శకలాలు గానీ, ప్యాసింజర్ల ఆనవాళ్లు కానీ అస్సలు కనిపించకుండా పోతే! 2014 మార్చి 8న అదే జరిగింది. వరల్డ్స్ గ్రేటెస్ట్ ఏవియేషన్ మిస్టరీ… MH370. పార్ట్-టు షురూ కాబోతోంది. మిస్టరీ అంతుచూస్తామంటూ మళ్లీ నడుంకట్టింది మలేషియన్ సర్కార్. ఆఖరి క్షణాల్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తోంది.
239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన బోయింగ్-777 విమానం… పేరు MH370… టేకాఫ్ ఐన 38 నిమిషాల తర్వాత మాయమైంది. ఆకాశంలో ఎగురుతుండగానే సడన్‌గా అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోవడం వరకే తెలుసు. ఆ తర్వాత ఏమైందన్నదే మిస్టరీ. ఆ మలేషియా విమానం ఏమైంది? కూలిపోయిందా? లేక ఎవరైనా కూల్చివేశారా? అంతకుమించి జరగరాని అద్భుతం ఏదైనా జరిగిందా? ఇటీవలే ఎంహెచ్370 పేరుతో ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ప్రమాదవశాత్తూ జరిగిందా? ఏదైనా కుట్ర దాగి ఉందా? ఆఖరి క్షణాల్లో ప్రయాణికుల మానసిక స్థితి ఏంటి? అన్ని అంశాలనూ కళ్లకు కట్టింది MH370 వెబ్‌సిరీస్.
ఈ 11 ఏళ్లలో ఈ చిక్కుముడిని విప్పడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. సిగ్నల్స్ తెగిపోగానే మిలిటరీ రాడార్లు రంగంలో దిగాయి. ఓ గంట పాటు విమానం ఆనవాళ్లు కనిపించాయి. కానీ, ATC చూపిన మార్గంలో కాకుండా అండమాన్ సముద్రాన్ని దాటేసి మాలే ద్వీపం మీదుగా ఎటో వెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత దాని జాడే లేదు. పైలెట్లు ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చివేసి, సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారని ఓ కథనం ఉంది. మితిమీరిన వేగం కారణంగా అదుపుతప్పి డైవ్ చేస్తూ, హిందూమహాసముద్రంలో సేఫ్ ల్యాండింగ్‌కు ట్రై చేసినట్లు మరికొన్ని క్లూస్ చెబుతున్నాయి. కానీ, ఇవేవీ నమ్మదగిన స్థాయిలో లేవు. ఆస్ట్రేలియా, మలేషియా, చైనా సహా అనేక దేశాలు వేల కోట్లు ఖర్చు చేసి, వీరలెవల్లో సెర్చాపరేషన్లు చేశాయి. బుర్రలు బద్దలవడమే తప్ప ఇంచంత ఆచూకీ దొరకలేదు. MH370 మిస్టరీలో ఏలియన్స్ థియరీ కూడా ఉంది. గ్రహాంతరవాసులు ఎటాక్ చేసి విమానాన్ని అట్నుంచటే ఎత్తుకెళ్లాయా అనే పరమ సందేహాలు కూడా పుట్టేశాయి.
హఠాత్తుగా కనిపించకుండా పోయిన MH370 విమానానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఒక గుండ్రటి వస్తువు విమానం చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు కనిపించింది. కానీ, అది ఎడిట్ చేసిన ఫేక్ వీడియో అని సైబర్ ఎక్స్‌పర్ట్స్ తేల్చేశారు. దీనిపై ఎలోన్ మస్క్ కూడా రియాక్టయ్యారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన దాదాపు 6 వేల శాటిలైట్లు స్పేస్‌లో ఉన్నాయని, వీటిలో ఏ ఒక్కటీ ఏలియెన్స్‌ను ఫేస్ చేసిన దాఖలా లేదని చెప్పారు. సో, MH370 అదృశ్యంలో గ్రహాంతరవాసుల పాత్ర లేదన్నది క్లియర్. 26 దేశాలకు చెందిన 60 నౌకలు, 50 విమానాలు కలిసి లక్షల చదరపు మైళ్లలో హిందూ మహా సముద్రాన్ని జల్లెడ పట్టినా శకలాల జాడ దొరకలేదు. అన్వేషణ ఇంతటితో ఆపేద్దాం అంటూ ఎనిమిదేళ్ల కిందట చైనా, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. ఇప్పుడు మళ్లీ మలేషియన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. విమాన శకలాల కోసం మళ్లీ వెతుకులాట మొదలెట్టింది. నిజానికి ఈ ఏడాది మార్చిలోనే సెర్చ్ మొదలుపెట్టినా, వాతావరణం అనుకూలించక ఆపేశారు. ఇదే ఆఖరి ప్రయత్నం అంటూ, 55 రోజుల సెర్చాపరేషన్ డిజైన్ చేశారు. ఇందుకోసం ఓషన్ ఇన్‌ఫినిటీ అనే సంస్థతో 70 మిలియన్ డాలర్లతో డీల్ కుదుర్చుకుంది మలేషియా సర్కార్. నాటి విమాన ప్రమాద మృతుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. బాధిత కుటుంబాలకు స్వాంతన చేకూర్చడం కోసం ఎంతదూరమైనా వెళతామంటోంది మలేషియా ప్రభుత్వం.
