Watch Video: ఆరేళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి.. రోడ్డుపై తెగి పడిన చెవి! వీడియో వైరల్
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. పిల్లాడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. బాదిత బాలుడి చెవి తెగిపోయేదాక ఆ కుక్క వదల్లేదు. దీంతో బాలుడి చెవి రోడ్డుపై పడిపోయింది. ఈ దారుణ ఘటన ఆదివారం సాయంత్రం 5.38 గంటల సమయంలో ఢిల్లీలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి..

న్యూఢిల్లీ, నవంబర్ 25: ఢిల్లీలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో విజయ్ ఎన్‌క్లేవ్‌లోని తన ఇంటి సమీపంలో ఆరేళ్ల బాలుడు బాల్‌తో ఆడుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే బాలుడి పొరుగింటిలో రాజేశ్ పాల్(50) అనే టైలర్ పెంపుడు కుక్క ఉంది. పిట్‌బుల్ జాతికి చెందిన ఆ కుక్క అకస్మాత్తుగా ఇంటి నుంచి బయటకు వచ్చి, రోడ్డుపై ఆడుకుంటున్న పిల్లాడిపై ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క యజమాని ఇంటికి చెందిన ఓ మహిళ దానిని నియంత్రించలేకపోవడం వీడియోలో చూడొచ్చు. దీంతో కుక్క బాలుడిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి బాలుడిని కాపాడేందుక పరుగున వచ్చి కాపాడేందుకు యత్నించాడు. అయితే మహిళతోపాటు ఆ వ్యక్తి ఎంతగా ప్రయత్నించినా బాలుడిని కుక్క వదలలేదు. ఈ క్రమంలో కుక్క బాలుడి కుడి చెవి తెగిపోయేలా కరిచింది.
కుక్క దాడిలో బాలుడి చెవి పూర్తిగా తెగిపోయి రోడ్డుపై పడిపోయింది. బాలుడి దంతాలు విరిగిపోయాయి. ముఖం నిండా గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే కుక్కను బందించి తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే స్థానికంగా ఉన్న రోహిణిలోని బీఎస్ఏ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడి నుంచి సఫ్దార్‌జంగ్ దవాఖానకు తరలించారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కుక్క యజమాని రాజేశ్‌పాల్‌పై కేసు నమోదు చేశాడు. అదే కుక్క ఇప్పటికే ఆ ప్రాంతంలోని మరో నలుగురు పిల్లలపై దాడి చేసిందని కూడా పిర్యాదులో అతను చెప్పాడు. దీంతో పోలీసులు హత్యాయత్నం కింద రాజేశ్ పాల్‌ని అరెస్టు చేశారు.
Pitbull attacks 6-year-old in Delhi’s Prem Nagar, bites off the child’s ear. The owner of the dog has been arrested.
The incident took place on Sunday evening, when the child was playing outside his house. pic.twitter.com/jl1LKmndY8
— Vani Mehrotra (@vani_mehrotra) November 24, 2025
రాజేశ్ పాల్ కుమారుడు సచిన్ పాల్ ఓ హత్య కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సచిన్ పాల్ సుమారు ఏడాదిన్నర క్రితం ఆ కుక్కను పెంచుకునేందుకు ఇంటికి తెచ్చాడు. కాగా ఢిల్లీలోని పలు ప్రాంతాలలో కుక్కల దాడులు కొనసాగుతున్నాయి. కొన్ని నెలల క్రితం జంతు హక్కుల కార్యకర్తల నిరసనల నేపథ్యంలో సుప్రీంకోర్టు వీధి కుక్కలపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.



