AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు కాదు పిడుగులు..! గ్రామీణ పాఠశాలలో సాహిత్య స్ఫూర్తి.. సర్కార్ బడిలో వికసించిన ‘గునుగు పూలు’..!

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షరాల పరిమళం వెదజల్లింది. విద్యార్థుల కలం నుంచి జారిన పద్యాలు, కవితలు ‘గునుగుపూలు’గా వికసించి పుస్తకరూపం దాల్చాయి. గ్రామీణ పాఠశాలలోనే సాహిత్య స్ఫూర్తి ఇలా పరిమళించడం విశేషంగా మారింది. విద్యార్థులలో సాహిత్యాభిరుచిని పెంపొందించాలనే లక్ష్యంతో తెలుగు ఉపాధ్యాయులు ఆలోచనలకు బీజాలు నాటారు.

పిల్లలు కాదు పిడుగులు..! గ్రామీణ పాఠశాలలో సాహిత్య స్ఫూర్తి.. సర్కార్ బడిలో వికసించిన ‘గునుగు పూలు’..!
Literary Inspiration In Rural School Students Copy
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 5:48 PM

Share

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షరాల పరిమళం వెదజల్లింది. విద్యార్థుల కలం నుంచి జారిన పద్యాలు, కవితలు ‘గునుగుపూలు’గా వికసించి పుస్తకరూపం దాల్చాయి. గ్రామీణ పాఠశాలలోనే సాహిత్య స్ఫూర్తి ఇలా పరిమళించడం విశేషంగా మారింది. విద్యార్థులలో సాహిత్యాభిరుచిని పెంపొందించాలనే లక్ష్యంతో తెలుగు ఉపాధ్యాయులు ఆలోచనలకు బీజాలు నాటారు. ఆ మార్గదర్శకత్వం ఫలితంగా ఈ సాహిత్య సృజన సాధ్యమైంది.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు తమ ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చారు. “అమ్మ”, “నాన్న”, “గురువు”, “తెలుగు భాష”, “స్నేహం”, “చెట్టు”, “సైనికులు”, “రైతు”, “పుస్తకం”, “చదువు” వంటి విభిన్న శీర్షికలపై పద్యాలు, కవితలు రచించారు. చిన్న వయసులోనే లోతైన భావాలను సులభమైన పదాల్లో వ్యక్తపరిచిన తీరు సాహిత్యాభిమానులను ఆకట్టుకుంటోంది. దాతల సహకారంతో విద్యార్థుల రచనలను సంకలనం చేసి “గునుగుపూలు” పేరుతో పుస్తకంగా ముద్రించారు.

పాఠశాలలో నిర్వహించిన పుస్తకావిష్కరణ మహోత్సవం గ్రామంలో సాహిత్య వాతావరణాన్ని సృష్టించింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు అరుదుగా కనిపిస్తాయని, ఇది ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల రచనలతో రూపొందిన “గునుగుపూలు” పుస్తకం కేవలం అక్షరాల సమాహారం మాత్రమే కాదు.. అది వారి భావవ్యక్తీకరణ ప్రపంచానికి ప్రతిబింబం. ఈ ప్రయత్నం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా, తెలుగు భాషపై మమకారాన్ని మరింత బలపరుస్తుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గ్రామీణ బడిలో వికసించిన ఈ ‘గునుగుపూలు’ పరిమళం మరెన్నో పాఠశాలల్లో సాహిత్య స్ఫూర్తి నింపాలని ఆశిద్దాం..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us