AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాష్ట్రమంతా ఒక లెక్క.. అక్కడొక లెక్క.. ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం తర్వాతే వైన్స్‌లు ఓపెన్!

సాధారణంగా మండలాల్లో వైన్‌ షాపులు ఊర్లోనే ఉంటాయి. అవి కూడా ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఓపెన్ అవుతాయి. కానీ ఇక్కడో నియోజకవర్గంలో మాత్రం.. వైన్‌షాపులు ఊరిబయటే ఉండాలి.. అంతేకాదు అవి కూడా ఉదయం 10 గంటలకు తెరుస్తాం అంటే కుదరదు.. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే ఓపెన్ చేయాలి, ఇవే కాదు.. ఆ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో బెల్ట్‌ షాప్‌లు ఉండకూడదు ఇవి అక్కడి రూల్స్.. ఇంతకూ ఈ రూల్స్ అన్ని ఏ నియోజవర్గంలో ఉన్నాయనేగా మీ డౌట్‌ అయితే తెలుసుకుందాం పదండి.

Telangana: రాష్ట్రమంతా ఒక లెక్క.. అక్కడొక లెక్క.. ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం తర్వాతే వైన్స్‌లు ఓపెన్!
Tg News
Anand T
|

Updated on: Dec 05, 2025 | 11:46 AM

Share

ఊర్లలో వైన్‌షాపులు ఉండడం.. అవి పొద్దునే ఓపెన్ చేయడం వల్ల చాలా మంది పొద్దు పొద్దున్నే తాగడం మొదలు పెడుతున్నారు. దీనిపై దృష్టి పెట్టిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గం మొత్తంలో వైన్‌షాపులు, ఊరు బయట ఉండాలని, అవి కూడా మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఓపెన్ చేయాలని కొత్త రూల్స్ పెట్టారు. ఈ రూల్సన్ని నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అమలు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం పాడుకావొద్దనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా నియోజకవర్గంలోని అందరి వైన్‌షాపు యజమానులతో మాట్లాడి ఇందుకు ఒప్పించారు.

అయితే ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి వచ్చిన సందర్భంలో నియోజవర్గాల్లోని చాలా గ్రామాల్లో ప్రజలు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు పెరిగిపోవడంతో ఇంట్లోని మగాళ్లు పనులకు వెళ్లకుండా తాగుబోతులుగా మారుతున్నారని.. వీటి వల్ల యువత భవిషత్తు కూడా పాడవుతుందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని వైన్స్ షాపు యజమానులతో మాట్లాడి ఈ ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రామాల్లో బెల్ట్‌ షాపులు లేకుండా చేయించారు. రూల్స్‌ను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మితే వారిపై కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే షాపులన్ని ఊరిబయటే ఉండాలని, అవి కూడా మధ్యాహ్నం తర్వాతే ఓపెన్ చేసేలా అమలు చేస్తున్నారు.

గ్రామాల్లో బెల్ట్‌ షాపులను లేకుండా చేయడం, మద్యం దుకాణా సమయాల్లో మార్పులు తీసుకురావడం వల్ల ప్రజలు మద్యానికి బానిస కారని తాను ఆశిస్తున్నట్టు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ చర్యల వల్ల పొద్దు పొద్దున్నే మద్యం తాగే వారి సంఖ్య తగ్గుతుందని, అలాగే యువత కూడా వీటికి ప్రభావితం కారని అంటున్నారు. అవసరమైన రాబోయే రోజుల్లో ఈ సమయాలను రాత్రి 6 నుంచి 10 వరకు మాత్రమే ఉండేలా ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకొస్తే బాగుంటుందని.. కొందరు స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.