Bengal Assembly Polls: బెంగాల్‌లో పోల్ టెన్షన్.. ఎర్ర సామ్రాజ్యానికి దీదీ చెక్.. తాజాగా పెరిగిన బీజేపీ దూకుడు

మరో రెండు నెలల్లో ఎన్నికలను ఎదర్కోబోతున్న బెంగాల్ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే వుంటాయి. స్వాతంత్య్రానంతరం తొలసారి 1952లో ఎన్నికలు జరగ్గా.. ఆఖరు సారి 2016లో జరిగిన ఎన్నికల దాకా బెంగాల్ రాజకీయాలు క్యూరియాసిటీ రేకెత్తిస్తూనే వుంటాయి.

Bengal Assembly Polls: బెంగాల్‌లో పోల్ టెన్షన్.. ఎర్ర సామ్రాజ్యానికి దీదీ చెక్.. తాజాగా పెరిగిన బీజేపీ దూకుడు
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 24, 2021 | 7:27 PM

Bengal Assembly Elections heat started: దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్రంలో రెండో విడత నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో జరగనున్న ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. మరో మూడేళ్ళ తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఓ దిశనిస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును ఖరారు చేసే కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ఇందుకోసం బుధవారం (ఫిబ్రవరి 24న) కీలక సమావేశాన్ని నిర్వహించింది. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి మొదటి వారంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో కీలక రాష్ట్రాల రాజకీయ పరిస్థితిపై విశ్లేషణలు ఊపందుకున్నాయి.

ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాలలో వైశాల్యం ప్రకారం చూసినా.. రాజకీయ చైతన్యం ఆధారంగా చూసినా బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు కీలకంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో మొన్నటి దాకా బీజేపీ ఉనికి నామమాత్రమే. కానీ బెంగాల్‌లో గత అయిదేళ్ళుగాను.. తమిళనాట కరుణానిధి, జయలలితల మరణం తర్వాతా బీజేపీ ఉనికి పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా బెంగాల్‌లో సీపీఎం ప్రస్థానం ఎండయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌ను ఢీకొనే సత్తా ఉన్న ఉన్న ఏకైక పార్టీగా బీజేపీ ఎదిగింది. సుదీర్ఘ కాలం పాటు బెంగాల్‌ను పాలించి.. అన్ని విభాగాలలోను వామపక్ష భావజాలాన్ని నింపిన సీపీఎం ఇపుడు ఉనికే లేని పార్టీగా మారిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి సరేసరి.

1952లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు

తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా వీధిపోరాటాలు సహా దేనని వదలకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈనేపధ్యంలో బెంగాల్ రాజకీయాల గత చరిత్ర, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు ఎన్నో కనిపిస్తాయి. 1952 మార్చి 31వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. మొత్తం 238 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్, యునైటెడ్ సోషలిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (సీపీఐ, సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్ మార్క్సిస్ట్ గ్రూప్) కూటమి, పీపుల్స్ యునైటెడ్ సోషలిస్ట్ ఫ్రంట్ (సోషలిస్ట్ పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్-రుయ్ కర్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) ప్రధానంగా పోటీ పడ్డాయి. 150 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ నేత బిదన్ చంద్రరాయ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత 1957 మే 8వ తేదీన రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలు జరిగాయి. యునైటెడ్ లెఫ్ట్ ఎలక్షన్ కమిటీ (సీపీఐ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) కూటమి, యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ (సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, బోల్షివిక్ పార్టీ ఆఫ్ ఇండియా, రిపబ్లికన్ పార్టీ, డెమెక్రటిక్ వాన్ గార్డ్స్), యునైటెడ్ డెమోక్రాటిక్ పీపుల్స్ ఫ్రంట్ (భారతీయ జనసంఘ్, హిందూ మహాసభ, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) కూటమి, కాంగ్రెస్ (సొంతంగా) ఎన్నికల బరిలో నిలిచాయి. అయితే, సింగిల్‌గా 152 స్థానాలు గెలిచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎంగా బిదన్ చంద్రరాయ్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు.

60వ దశకంలో రాజకీయంగా పెను మార్పులు

1962, మే 8వ తేదీన బెంగాల్ అసెంబ్లీలోని 252 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ (సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) కూటమితో కాంగ్రెస్ పార్టీ సింగిల్‌ పోటీ పడింది. కాంగ్రెస్ పార్టీ విజయపరంపర మూడోసారి కొనసాగింది. 157 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ప్రఫుల్ల చంద్రసేన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి దాకా ఉమ్మడిగా వున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)లో చీలిక వచ్చింది. 1964 అక్టోబర్ 31- నవంబర్ 7 మధ్య సీపీఐలో చీలిక రాగా మార్క్సిస్టులు వేరు కుంపటి పెట్టుకున్నారు. సీపీఎం (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా – మార్క్సిస్టు) పార్టీ ఏర్పాటైంది.

రాష్ట్రపతి పాలనకు బీజం

ఆ తర్వాత 1967 ఫిబ్రవరి 25న బెంగాల్ అసెంబ్లీలో పెరిగిన సీట్లతో కలుపుకుని మొత్తం 280 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బంగ్లా కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ ముఖర్జీ నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఈ కూటమిలో పీపుల్స్ యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ (సీపీఐ, బంగ్లా కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, బోల్షివిక్ పార్టీ ఆఫ్ ఇండియా), యునైటెడ్ లెఫ్ట్ ప్రంట్( సీపీఎం, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, సోషలిస్ట్ యూనిటి సెంటర్ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) కూటములు భాగస్వామ్యమయ్యాయి.

1967 ఎన్నికల ద్వారా బెంగాల్‌లో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. 1967 మార్చ్ 1న యునైటెడ్ ఫ్రంట్ లో భాగమైన బంగ్లా కాంగ్రెస్‌కు చెందిన అజోయ్ కుమార్ ముఖర్జీ సీఎంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ ఆయన అయిదేళ్ళ పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేకపోయారు. ఆ తర్వాత 1967 నవంబర్ 21న ప్రఫుల్ల చంద్ర ఘోష్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 1968 ఫిబ్రవరి 19 వరకు కొనసాగారు. రాష్ట్రంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేశారు. దాంతో 1968 ఫిబ్రవరి 20 నుంచి 1969 ఫిబ్రవరి 25 వరకు బెంగాల్‌లో రాష్టపతి పాలన విధించారు.

1969లో బెంగాల్ రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 280 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. యునైటెడ్ ఫ్రంట్ 214 స్థానాలు సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1969 ఫిబ్రవరి 25న యునైటెడ్ ఫ్రంట్ కూటమి పార్టీ తరపున బంగ్లా కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ ముఖర్జీ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత బెంగాల్ రాష్ట్రాన్ని భూ సంస్కరణలు, నక్సలైట్ ఉద్యమం కుదిపేశాయి. 1969 ఏప్రిల్ 22న కమ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పేర నక్సలైట్లు సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. 1969 జూన్‌లో సంకీర్ణ ప్రభుత్వంలోని సీపీఐ, సీపీఎంల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ విభేదాలు అలాగే కొనసాగగా.. 1970 మార్చి 16న అజోయ్ కుమార్ ముఖర్జీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

దాంతో 1970 మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వం రద్దైంది. 1970 జులై 30 నుంచి 1971 ఏప్రిల్ 2 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగింది. 1971 మార్చిలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో హింస చెలరేగగా.. ముగ్గురు అభ్యర్థులు హత్య గావించబడ్డారు. సీపీఎం, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సుదీంద్రనాత్ కుమార్ గ్రూప్), బిప్లోబి బంగ్లా కాంగ్రెస్, బోల్షివిక్ పార్టీ ఆఫ్ ఇండియా (నేపాల్ బట్టాచార్య), వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలతో కూడిన యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ ఒకవైపు.. సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, సోషలిస్ట్ యూనిటి సెంటర్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా గూర్ఖా లీగ్, బోల్షివిక్ పార్టీ ఆఫ్ ఇండియా (బరాడా ముకుత్ మోని గ్రూప్), ఆర్ సీపీఐ(ఆనంది దాస్ గ్రూప్), సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ(రెబల్) వంటి ఎనిమిది పార్టీలతో కూడిన యునైటెడ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుఎల్డీఎఫ్) బరిలో ప్రధాన అలయెన్సులుగా నిలిచాయి.

సీపీఐ నేతృత్వంలోని యుఎల్డీఎఫ్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న కూటమిగా ఆవిర్భావించగా.. ఎన్నికల అనంతరం బంగ్లా కాంగ్రెస్ కూడా వారితో జతకట్టింది. దాంతో మాజీ ముఖ్యమంత్రి అజోయ్ కుమార్ ముఖర్జీ మరోసారి 1971 ఏప్రిల్ రెండో తేదీన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రెండు నెలల్లోనే అంటే 1971 జూన్ 28న అజోయ్ కుమార్ ముఖర్జీ రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో మరోసారి బెంగాల్ రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళింది. 1971 జూన్ 29 నుంచి 1972 మార్చి 20 వరకు రాష్ట్రంలో రాష్టపతి పాలన కొనసాగింది.

1972 మార్చి 11న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్(ఆర్), సీపీఐ నేతృత్వంలో కూటమి ఏర్పాటైంది. ఈ కూటమికి ప్రొగ్రెస్సివ్ డెమోక్రటిక్ అలయన్స్(పీడీఏ) అని పేరు పెట్టుకున్నారు. మరోపక్క సీపీఎం నేతృత్వంలోని (రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సోషలిస్ట్ యూనిటి సెంటర్, రివల్యూషనరి కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, బిప్లొబి బంగ్లా కాంగ్రెస్, కొంత మంది స్వతంత్రులు) కూటమిగా పోటీ చేశారు. పోలింగ్‌కు ముందు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్‌తో సీట్లను పంచుకుంది సీపీఎం పార్టీ. మూడో ఫ్రంట్ గా వెస్ట్ బెంగాల్ డెమోక్రటిక్ కూటమి (కాంగ్రెస్-ఒ, బంగ్లా కాంగ్రెస్-సుశీల్ కుమార్ దారా గ్రూప్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ అవామీ లీగ్) పోటీకి దిగింది. కాంగ్రెస్(ఆర్)-సీపీఐ కూటమి ఎన్నికల్లో విజయం సాధించగా.. 1972 మార్చి 20న కాంగ్రెస్ నేత సిద్ధార్ధశంకర్ రే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అతర్వాత అయిదేళ్ళ సుస్థిర పాలన కొనసాగగా.. 1977 ఏప్రిల్ 30 నుంచి 1977 జూన్ 20 వరకు రాష్ట్రంలో మరోసారి రాష్ట్రపతి పాలన విధించారు.

జ్యోతిబసు శకం ఆరంభం

1977 జూన్ 14న బెంగాల్ అసెంబ్లీకి మరోసారి ఎన్నికలు జరిగాయి. పెరిగిన సీట్లతో కలిపి మొత్తం 294 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ (ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, బిప్లియో బంగ్లా కాంగ్రెస్)తో కాంగ్రెస్-ఆర్, జనతా పార్టీలు తలపడ్డాయి. లెఫ్ట్ ఫ్రంట్ 231 స్థానాల్లో బంపర్ విజయం సాధించింది. సీపీఎం దిగ్గజ నేత జ్యోతి బసు తొలిసారి బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. 1977 జూన్ 21న సీపీఎం నేత జ్యోతి బసు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల తర్వాత సీపీఎం పార్టీ బెంగాల్‌ను ఏకచ్ఛాద్రిపత్యంగా పాలించింది. ఆ తర్వాత 34 ఏళ్ల పాటు జ్యోతిబసు పరిపాలన అప్రతిహతంగా కొనసాగింది. 1982 ఏప్రిల్- మే నెలల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. సీపీఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్‌లో సీపీఐ కూడా వచ్చి చేరింది. వెస్ట్ బెంగాల్ సోషలిస్ట్ పార్టీ, డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీలు, కాంగ్రెస్(ఐ), కాంగ్రెస్(ఎస్) కూటమిగా పోటీ చేశాయి. 1982 అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్(ఎస్), కాంగ్రెస్(ఐ)లో విలీనమైంది.

1982లో ఎన్నికల్లో బెంగాల్లో తొలిసారిగా బీజేపీ కూడా పోటీ చేసింది. 1980లో డార్జిలింగ్ హిల్స్‌లో గూర్ఖాలాండ్ ఉద్యమం మొదలైంది. ప్రత్యేక రాష్ట్రంగా డార్జీలింగ్‌ను ప్రకటించాలన్న డిమాండ్ బలపడింది. గూర్ఖా నేషనల్ ఫ్రంట్(సుభాష్ ఘీషింగ్) సారథ్యంలో ‘‘నో స్టేట్ నో వోట్’’ నినాదం గట్టిగా వినిపించింది. అయితే ఈ నినాదం ప్రభావం పెద్దగా కనిపించలేదు. దాంతో లెఫ్ట్ ఫ్రంట్ 238 స్థానాల్లో గెలుపొందగా జ్యోతి బసు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

1987 ఏప్రిల్ 10న జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోను జ్యోతిబసు సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఘన విజయం సాధించింది. లెఫ్ట్ ఫ్రంట్‌తో కాంగ్రెస్ పార్టీ నేరుగా ఢీకొన్ని ఫలితం లేకపోయింది. రాజీవ్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ నాతున్ బంగ్లా (సరి కొత్త బెంగాల్) అన్న నినాదంతో ఎన్నికలను ఎదుర్కొన్నా పెద్దగా సానుకూల ఫలితాలను రాబట్టలేకపోయింది. లెఫ్ట్ ఫ్రంట్ సీట్ల ఏకంగా 251కి పెరిగాయి. తర్వాతి ఎన్నికలకు 1992 ఫిబ్రవరి వరకు గడువు ఉన్నప్పటికి జ్యోతిబసు వ్యూహాత్మకంగా 1991లో వచ్చిన పార్లమెంటు ఎన్నికలతో కలిసి ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. 1991 ఏప్రిల్ 24న జరిగిన శాసనసభ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని (జార్ఖండ్ పార్టీ, జీఎన్ ఎల్ ఎఫ్, యూసీపీఐ) కూటమి, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ జరిగింది. లెఫ్ట్ ఫ్రంట్ కూటమి 245 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. ఈ ఎన్నికల సందర్భంగానే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. కానీ.. ఆయన మే 21న తమిళనాడులో హత్యకు గురవడానికి ముందే బెంగాల్ అసెంబ్లీ పోలింగ్ ముగిసింది.

రెబల్ నేతగా మమతా బెనర్జీ

ఆ తర్వాత 1996 మే 13 బెంగాల్ అసెంబ్లీ మరో విడత ఎన్నికలు జరిగాయి. లెఫ్ట్ ఫ్రంట్‌లో భాగమైన ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలో చీలిక వచ్చింది. ఫార్వార్డ్ బ్లాక్(సోషలిస్ట్) ఆవిర్భావించింది. జనతా దళ్‌కు లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు ప్రకటించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. జాతీయ యూత్ కాంగ్రెస్ నేతగా వున్న మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో రెబల్ నేతగా మారారు. కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా మధ్య పొత్తు కుదిరింది. అయితేనేం బెంగాల్ వామపక్ష ప్రభంజనాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువరించలేకపోయింది. లెఫ్ట్ ఫ్రంట్ 203 స్థానాల్లో విజయం సాధించగా.. జ్యోతిబసు సీఎంగా ఐదో సారి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత బెంగాల్ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1996 ఎన్నికల నాటికే కాంగ్రెస్ పార్టీలో రెబల్ నేతగా మారిన మమతా బెనర్జీ.. 1998 జనవరి 1న ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు మమతా బెనర్జీ. ఆ తర్వాత కమ్యునిస్ట్ వ్యతిరేక నేతగా రాష్ట్రంలో కీలక భూమిక నిర్వహించారు.

1999 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొన్నారు మమతా బెనర్జీ. 8 లోక్ సభ నియోజకవర్గాల్లో ఏఐటీసీ విజయం సాధించగా.. బీజేపీకి 2 సీట్లు దక్కాయి. లెఫ్ట్ ఫ్రంట్ (సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బీ) ఖాతాలో 28 సీట్లు వచ్చాయి. 2000 నవంబర్ 5న అనారోగ్య కారణాలతో సీఎం పదవికి జ్యోతిబసు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో 2000 నవంబర్ 6న సీపీఎంకు చెందిన బుద్ధదేబ్ భట్టాచార్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2001 మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. రాజకీయ ఎత్తుగడలు మారిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేరువైంది. ఈ లెఫ్ట్ ఫ్రంట్-యూపీఏ కూటమి (కాంగ్రెస్, తృణమూల్, జీఎన్ఎల్ఎఫ్, ఎన్సీపీ, పీడీఎస్)లతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే పోటీ పడింది. లెఫ్ట్ ఫ్రంట్ 196 స్థానాలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బుద్దదేవ్ భట్టాచార్య మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 60 స్థానాల్లో గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ తొలిసారి ప్రతిపక్ష హోదా పొందింది.

తిరిగి 2006లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ యూపీఏను వీడి.. ఎన్డీయేతో జతకట్టింది. ఎన్డీఏ కూటమిలో జేకేపీ(ఎన్), జేడీ(యు) ఏఐటీసీ, బీజేపీ పార్టీలుండగా.. యూపీఏ కూటమిలో కాంగ్రెస్, జీఎన్ఎల్ ఎఫ్, జేఎంఎం, ఎల్ జేపీ, పీడీఎస్, బీఎస్ పీ, ఐపీఎఫ్బీలున్నాయి ఆనాటి ఎన్నికల్లో. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ (ఏఐఎఫ్బీ, ఆర్ఎస్పీ, సీపీఐ, డబ్ల్యుఎస్పీ, ఆర్జేడీ, డీఎస్పీ-పీసీ, ఎన్సీపీ) 233 సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2006 మే 18న సీఎంగా బుద్దదేబ్ భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేశారు. 2011లో జరిగిన శాసన సభ ఎన్నికలల్లో సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన లెఫ్ట్ ఫ్రంట్ విజయపరంపరకు తెరపడింది. ఎన్డీఏను వదిలి మళ్లీ యూపీఏ కూటమిలో చేరిన తృణమూల్ కాంగ్రెస్… తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిట్టింగ్ సీఎంగా బరిలోకి దిగిన బుద్ధదేబ్ భట్టాచార్య జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు.

లెఫ్ట్ పాలనకు చరమ గీతం

1977 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వచ్చిన లెఫ్ట్ ఫ్రంట్‌కు తొలిసారి ఓటమి రుచి చూపించిన మమతాబెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏఐటీసీ- కాంగ్రెస్ కూటమి 228 స్థానాల్లో గెలుపొందింది. 2011 మే 20న తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్- సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కూటమితో కలిసి మహాజోత్ (సెక్యులర్ డెమోక్రటిక్ అలయన్స్) ఏర్పాటైంది. 2016 ఏప్రిల్ 4-మే 5 మధ్య 294 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీకి దిగింది. ఏఐటీసీ 211 స్థానాల్లో విజయం సాధించింది. మహాజోత్ కూటమికి 44 స్థానాలు రాగా, ఎన్డీఏకు కేవలం 6 స్థానాలు దక్కాయి. 2016 మే 26.. మమతా బెనర్జీ రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ALSO READ: డొనాల్డ్ ట్రంప్ బాటలోనే బైడెన్.. ‘ఆ‘ విధానం మరింత తీవ్రం.. భారత్‌కు లాభమా? నష్టమా?

ALSO READ: తెలంగాణకు కరోనా సెకెండ్ వేవ్ ముప్పు.. న్యూ వెరైటీ N440K ఎఫెక్ట్..