Delhi Election: కొరుకుడుపడని కొయ్యగా మారిన దేశ రాజధాని.. ఈసారైనా కమలనాథుల కల నెరవేరేనా..?

వచ్చే ఏడాది ప్రారంభంలో 70 స్థానాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మూడు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.

Delhi Election: కొరుకుడుపడని కొయ్యగా మారిన దేశ రాజధాని.. ఈసారైనా కమలనాథుల కల నెరవేరేనా..?
Bjp Rss To Delhi Poll
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Dec 16, 2024 | 4:51 PM

భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మూడు దశాబ్దాలుగా అధికారం ఆ పార్టీకి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కలిసి పోటీ చేసినా సరే క్లీన్ స్వీప్ చేసిన కమలదళం అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి చతికిలపడుతోంది. చివరిసారిగా 1993లో గెలుపొందిన ఆ పార్టీ, మళ్లీ ఇప్పటి వరకు అధికారం చేజిక్కించుకోలేకపోయింది.

మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో కమలదళం ఉంది. బీజేపీకి సైంద్ధాంతిక మాతృసంస్థ ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)’ కూడా రంగంలోకి దిగి బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు గెలిచి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ను ఈ సారి ఎలాగైనా నిలువరించాలి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఓటుబ్యాంకును కాపాడుకోవడంతో పాటు సామాజిక సమీకరణాలు, భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోంది.

మరోవైపు బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, సంఘ్ పరివార్ ఢిల్లీలోని ప్రతి ఇంటినీ చుట్టేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా, మహారాష్ట్రలో అనూహ్య విజయం సాధించిన కమలదళం ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది దశాబ్దాలుగా అందకుండా పోతున్న అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించక ముందే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తిచేసింది. త్వరలోనే మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

పకడ్బందీగా అభ్యర్థుల ఎంపిక

ఏ పార్టీకైనా తమ సొంత బలానికి తోడు అభ్యర్థుల బలం కూడా తోడైతేనే విజయం వరిస్తుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థుల కోసం గాలం వేస్తుంటాయి. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసింది. క్షేత్రస్థాయిలో బలమైన ముద్ర, ఓటర్లలో ఆదరణ కలిగిన నేతలకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే వరుసగా 2 పర్యాయాలు ఓడిపోయిన నేతలకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదు. మరోవైపు మీనాక్షి లేఖి, పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరి వంటి నగరవ్యాప్త ప్రభావం కలిగిన సీనియర్ నేతలను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి వ్యతిరేకంగా ఎన్నికల వాతావరణాన్ని తయారుచేయగలరని అధినాయకత్వం భావిస్తోంది. ఎన్నికల ప్రచారంలో వారికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. వారితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాష్ట్ర మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు జాట్ సామాజికవర్గంలో గట్టి పట్టుంది. ఆయనను నజఫ్‌గఢ్ నుంచి బరిలోకి దించే అవకాశాలున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా కుమారుడు హరీష్ ఖురానాను మోతీనగర్ నుంచి పోటీ చేయించవచ్చు.

మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు కొత్త ముఖాలను పరిచయం చేయడం కోసం సగం స్థానాలను కొత్తవారికి కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే కనీసం 35 స్థానాల్లో కొత్త అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశాలున్నాయి. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో “చావో రేవో” అన్నట్టుగా శ్రమించిన కమలదళం.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అంతకంటే సీరియస్‌గా తీసుకుని పోరాడాలని చూస్తోంది.

కోర్ ఓట్‌బ్యాంకు విస్తృతికి వ్యూహం

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 30 శాతాన్ని మించిన ఓటుబ్యాంకు ప్రతిసారీ ఉంటోంది. నగరంలోని వ్యాపారవర్గాలు బీజేపీకి ఎల్లవేళలా మద్ధతుగా నిలుస్తున్నారు. వారితో పాటు విద్యాధిక వర్గాలు, కొన్ని సామాజికవర్గాలు బీజేపీకి బలమైన ఓటుబ్యాంకుగా నిలిచాయి. అయితే ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 50 శాతాన్ని మించి ఓటుబ్యాంకు కైవసం చేసుకుంటున్నప్పుడు ఈ బలం సరిపోదు. అందుకే ఈసారి ఓటుబ్యాంకును విస్తరించుకోవడంపై కమలనాథులు దృష్టి పెట్టారు. తమ ఓటుబ్యాంకు చేజారకుండా కాపాడుకోవడం ఒకెత్తయితే.. కొత్త ఓటుబ్యాంకును సృష్టించుకోవడం మరో ఎత్తు. కొత్త ఓటుబ్యాంకు తయారు చేసుకోవాలి అంటే ప్రత్యర్థి ఓటుబ్యాంకును చెదరగొట్టి తమవైపు ఆకట్టుకోవాలి.

ఢిల్లీలోని మురికివాడల్లో నివసించే పేద, నిరుపేద ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని 1,194 బస్తీలు, మురికివాడల్లో రాత్రి పూట పార్టీ నేతలు గడిపేలా కార్యక్రమాలు రూపొందించారు. ఇప్పటికే పలువురు నేతలు బస్తీ నిద్రలు చేస్తున్నారు. తద్వారా బస్తీ ప్రజల సమస్యలు తెలుసుకుని, వారికి భరోసా కల్పించవచ్చని భావిస్తున్నారు. ఉచిత పథకాలకు ఆకర్షితులై ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తున్నవారిలో ఇలాంటి బస్తీ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని పార్టీ నాయకత్వం గ్రహించింది. అందుకే బస్తీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వివిధ రకాల ప్రచార కార్యక్రమాలను రూపొందించుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరించి చెప్పడంతో పాటు వారి అవసరాలకు తగ్గ హామీలను మేనిఫెస్టోలో చేర్చేందుకు ప్రయత్నిస్తోంది.

తెరవెనుక సంఘ్ వ్యూహాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) హర్యానా, మహారాష్ట్రలో మాదిరిగా తెరవెనుక అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్ ఢిల్లీలోనే మకాం పెట్టి అనేక సమావేశాలు నిర్వహించారు. బీజేపీ – ఆరెస్సెస్ మధ్య మెరుగైన సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ స్థాయికి తగ్గ నేత ప్రస్తుతం ఢిల్లీ బీజేపీలో లేరని ఆరెస్సెస్‌కు కూడా తెలుసు. అయితే వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఆప్ సర్కారుపై ప్రజల్లో ఏర్పడ్డ వ్యతిరేకతను కేజ్రీవాల్‌పై అస్త్రంగా మలచుకోవాలని చూస్తోంది.

ప్రజలకు పరిమిత యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఉచిత నల్లా నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రజాకర్షక ఉచిత పథకాలతో ఓటర్లను ఆకట్టుకుంటూ రెండు పర్యాయాలు అధికారం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ, రోడ్లు, మురుగునీటి నిర్వహణ, తాగునీటి సరఫరా విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసు ద్వారా కేజ్రీవాల్‌పై ఇంతకాలం ఉన్న ‘నీతి-నిజాయితీ’ ముద్ర కూడా చెరిగిపోయింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం పునర్ వైభవం కోసం శ్రమిస్తోంది. ఢిల్లీలో ఆప్ ఎదుగుదల కాంగ్రెస్ పార్టీనే తీవ్రంగా దెబ్బతీసింది. ఆ పార్టీ ఓటుబ్యాంకు పూర్తిగా చెల్లాచెదురైపోయింది. ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఆప్‌తో కలిసి పోటీ చేయడం లేదు. తద్వారా మైనారిటీలు, మరికొన్ని వర్గాల ఓట్లను కాంగ్రెస్ చీల్చడం కూడా బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుంటే అధికారం చేజిక్కించుకోవడం కష్టమేమమీ కాదని కమలదళం అంచనా వేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?