ఐటీ – టెక్నాలజీ రంగంలో గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా 2003లో మీడియా రంగంలోకి అడుగుపెట్టాను. ఈటీవీలో ట్రైనీ రిపోర్టర్ గా మొదలైన ప్రయాణంలో 2004 సార్వత్రిక ఎన్నికల కవరేజ్ తర్వాత క్రైమ్ రిపోర్టింగ్ చేపట్టాను. అక్కడే క్రైమ్ బ్యూరో ఇంఛార్జిగా పదోన్నతి పొంది, ఆ తర్వాత 2007లో NTV లో చేరాను. అక్కడ హైదరాబాద్ క్రైమ్ బ్యూరోతో పాటు విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర రీజనల్ హెడ్ గా పనిచేశాను. ఈ మధ్యలోనే జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. 2010లో టీవీ9లో క్రైమ్ బ్యూరో హెడ్‌గా ప్రయాణం మొదలుపెట్టి 2012లో ఢిల్లీ బ్యూరోకి మారాను. 2014 నుంచి సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ర్యాంక్‌లో ‘ఢిల్లీ బ్యూరో హెడ్’గా బాధ్యతలు చేపట్టి 2023 నుంచి ‘అసోసియేట్ ఎడిటర్’గా కొనసాగుతున్నాను. 2013లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో జపాన్, థాయిలాండ్ దేశాల పర్యటనతో మొదలుపెట్టి అదే ఏడాది ఉత్తరాఖండ్ ను కుదిపేసిన కేదార్‌నాథ్ జలప్రళయం, 2015లో నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం, కాశ్మీర్ లోయ, ఈశాన్య రాష్ట్రాల్లో చోటుచేసుకునే హింసాత్మక ఘటనలు, హిమాలయ రాష్ట్రాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు సహా 2022లో మొదలైన “ఉక్రెయిన్ – రష్యా యుద్ధం” కవరేజ్ వరకు నిత్యం వివిధ రాష్ట్రాలు, దేశాలు పర్యటిస్తూ గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాను.