ఈ మోనో రైల్ చూశారా.. ఆకాశం అంచులను తాకుతూ వెళ్తుంది.. ఎక్కడంటే..!
భారతదేశ సరిహద్దుల్లో భౌగోళికంగా అత్యంత క్లిష్టమైనవి హిమాలయాలే. హిమాలయాలు భారతదేశానికి పొరుగున ఉన్న పాకిస్తాన్, టిబెట్, మయన్మార్ వంటి దేశాల్లోనూ విస్తరించి హద్దులు పంచుకుంటున్నాయి. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో, అత్యంత శీతల వాతావరణంలో ఉన్న ఈ హిమగిరులపై సరిహద్దులు గస్తీ కాయడాన్ని మించిన క్లిష్టమైన పని మరొకటి లేదు.

భారతదేశ సరిహద్దుల్లో భౌగోళికంగా అత్యంత క్లిష్టమైనవి హిమాలయాలే. హిమాలయాలు భారతదేశానికి పొరుగున ఉన్న పాకిస్తాన్, టిబెట్, మయన్మార్ వంటి దేశాల్లోనూ విస్తరించి హద్దులు పంచుకుంటున్నాయి. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో, అత్యంత శీతల వాతావరణంలో ఉన్న ఈ హిమగిరులపై సరిహద్దులు గస్తీ కాయడాన్ని మించిన క్లిష్టమైన పని మరొకటి లేదు. అలాంటి ప్రాంతాల్లో ఉండే సైనికులకు అవసరమైన రేషన్, ఇతర సరంజామా సరఫరా చేయడం చాలా కష్టంగా మారుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రోజులు, వారాల తరబడి సరఫరా లైన్లు తెగిపోతుంటాయి. యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు శత్రు దేశంతో పాటు ప్రతికూల వాతావరణం సైతం మరో శత్రువుగా మారుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అనేక ఆవిష్కరణలు మన ముందుకు తీసుకొస్తున్నారు.
అందులో భాగంగా టిబెట్ (చైనా) సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్‌లో కమెంగ్ హిమాలయాల్లో హై ఆల్టిట్యూడ్ మోనో రైల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. సాధారణంగా మెట్రో, మోనో రైల్ వంటివి పట్టణ ప్రజా రవాణా వ్యవస్థల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. భారతదేశంలో ముంబైలో ఇలాంటి మోనో రైలు వ్యవస్థను మనం చూడవచ్చు. సాధారణ రైల్వే, మెట్రో రైల్ వ్యవస్థలకు భిన్నంగా మోనో రైల్ సింగిల్ వీల్ ట్రాక్ మీద నడుస్తుంది. అయితే పట్టణాల్లో ఉపయోగించే ఈ వ్యవస్థను భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నడకమార్గం తప్ప మరో దారే లేని ఎత్తైన హిమగిరుల్లో ఏర్పాటు చేశారు. సముద్రమట్టానికి 16,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కమెంగ్ హిమాలయ శ్రేణుల్లో ఏర్పాటు చేసిన మోనో రైల్ సిస్టమ్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంటోంది.
దీన్ని ప్రస్తుతం భారత సైన్యంలోని గజరాత్ కోర్ కమాండ్ ఉపయోగిస్తోంది. ఒక రన్‌లో 300 కేజీల వరకు సరుకును మోసుకెళ్లేలా దీన్ని రూపొందించారు. తద్వారా సైన్యానికి అవసరమైన రేషన్, ఆయుధ సామగ్రి, ఇంధనం, ఇంజనీరింగ్ ఎక్విప్‌మెంట్ తదితర పరికరాలను సులభంగా ఫార్వార్డ్ పోస్టులకు చేర్చడం సాధ్యపడుతుంది. సాధారణ పరిస్థితుల్లో వీటిని మనుషులే మోసుకెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో మంచులో జారిపడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా వాటిని పగటి సమయంలో, అనుకూల వాతావరణంలో మాత్రమే సరఫరా చేయగలం. ఇప్పుడు హై-ఆల్టిట్యూట్ మోనోరైల్ అందుబాటులోకి రావడంతో పగలు, రాత్రి తేడా లేకుండా.. మంచు, వర్షం ఉన్నా సరే సరకు రవాణాకు ఇబ్బంది ఉండదు. వీటన్నింటికీ మించి ఫార్వార్డ్ పోస్టులో ఉన్నవారు గాయపడినప్పుడు లేదా చనిపోయినవారి మృతదేహాలను తరలించడం మరింత సులభంగా మారనుంది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో హెలీకాప్టర్లను వినియోగిస్తున్నప్పటికీ హై-ఆల్టిట్యూట్ ప్రాంతాల్లో వాటిని ఎగరేయడం సాధ్యపడదు. పైగా ప్రతికూల వాతావరణం హెలీకాప్టర్లకు మరింత ప్రమాదకరం. అందుకే హెలీకాప్టర్లు సైతం పనిచేయలేని ప్రాంతాల్లో ఉన్న భారత సైన్యానికి ఏది సరఫరా చేయాలన్నా ఇప్పుడు ఇబ్బంది ఉండదు.
ప్రస్తుతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలోనే తయారైన ఈ ఆవిష్కరణ భారత సైన్యం ఆపరేషన్ రెడీనెస్‌ను మెరుగుపరుస్తోంది. అలాగే ఏవైనా మిషన్లు, ఆపరేషన్లు చేపట్టినప్పుడు సప్లై-చైన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా సైన్యం పూర్తిగా శత్రువుపై ఫోకస్ పెట్టేందుకు ఆస్కారం కల్గిస్తోంది. మొత్తంగా ఈ ఆవిష్కరణ భారత సైన్యంలో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది.
వీడియో చూడండి..
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




