Putin India Tour: పుతిన్ భారత్ పర్యటన.. డిసెంబర్ 4-5న ఢిల్లీలో భారత్-రష్యా శిఖరాగ్ర సదస్సు
Putin India Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో అధికారిక పర్యటన నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక అంశాలపై సమగ్ర చర్చలు జరగనున్నాయని..

Putin India Tour: యావత్ ప్రపంచం దృష్టి ఇప్పుడు భారత్‌పైనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా సహా NATO కూటమిలోని అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండ్రోజుల పాటు భారత్‌లో పర్యటించమే ఇందుకు కారణం. ముఖ్యంగా అమెరికాతో పాటు పొరుగునే ఉన్న పాకిస్తాన్ కూడా ఈ పర్యటనను నిశితంగా గమనిస్తోంది. భారతదేశానికి చిరకాల మిత్రదేశంగా ఉన్న రష్యా.. దశాబ్దాలుగా భారత్‌కు ఆయుధాలు, రక్షణ పరికరాలను అందించడమే కాదు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందజేస్తూ వచ్చింది. అనునిత్యం ఆ దేశంతో భారత్ ఎన్నో రంగాల్లో ఒప్పందాలు చేసుకుంటూ ఉంది. పుతిన్ తాజా పర్యటనతో భారత్-రష్యా మధ్య ఏయే రంగాల్లో ఎలాంటి ఒప్పందాలు, MoUలు జరుగుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో అధికారిక పర్యటన నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక అంశాలపై సమగ్ర చర్చలు జరగనున్నాయని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరీ ఉషకోవ్ డిసెంబర్ 3న జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.
గోప్యంగా రాజకీయ చర్చలు:
ఈ ఏడాది ఇద్దరు నాయకులు సెప్టెంబర్ 1న చైనాలోని తియాంజిన్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత కూడా 5 పర్యాయాలు టెలిఫోన్‌లో మాట్లాడుకున్నారు. అంతేకాక మాస్కోలో రష్యా అధ్యక్షుడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రెండుసార్లు విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్‌లను కలుసుకున్నారు.
విశేష అండ్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం:
డిసెంబర్ 21న రష్యా-భారత్ సంబంధాల్లో ‘విశేష, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’పై చేసిన సంయుక్త ప్రకటనకు 15 ఏళ్లు పూర్తవుతున్నాయి. రాజకీయ, భద్రత, ఆర్థిక, రవాణా-లాజిస్టిక్స్, విజ్ఞాన శాస్త్రం-సాంకేతికత, విద్య-సంస్కృతి రంగాల్లో సహకారం వేగంగా విస్తరిస్తోందని ఉషకోవ్ పేర్కొన్నారు.
పర్యటనలో ముఖ్య అంశాలు:
– డిసెంబర్ 4న పుతిన్-మోదీ మధ్య అనధికారిక భేటీ
– డిసెంబర్ 5న అధికారిక చర్చలు
– భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రత్యేక భేటీ
– రష్యా-భారత్ వ్యాపార వేదిక సందర్శన
– ఢిల్లీలో RT India టెలివిజన్ ఛానెల్ ప్రారంభోత్సవం (పుతిన్, RT చీఫ్ మార్గరిటా సిమోన్యాన్ హాజరు)
– సంయుక్త ప్రకటన విడుదల, 2030 వరకు వ్యూహాత్మక ఆర్థిక సహకార కార్యక్రమం ఆమోదం
వాణిజ్యం-ఆర్థిక రంగాల్లో వృద్ధి:
2024లో ద్వైపాక్షిక వాణిజ్యం 12 శాతం పెరిగి 63.6 బిలియన్ డాలర్లకు చేరింది. పారిశ్రామిక సహకారం, ఆధునిక సాంకేతికతలు, రవాణా, శాంతియుత అంతరిక్ష పరిశోధన, గనులు, ఆరోగ్యం, కార్మిక వలస కార్యక్రమాలు వంటి అనేక పెద్ద ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి.
పర్యాటక రంగం:
2024లో 80 వేలకు పైగా రష్యన్లు భారత్‌ను సందర్శించగా, 40 వేలకు పైగా భారతీయులు రష్యాకు వెళ్లారు. ఈ రంగంలో ఇంకా ఎక్కువ సామర్థ్యం ఉందని ఉషకోవ్ అన్నారు.
25కు పైగా ఒప్పందాలు:
పర్యటనలో 10 ఒప్పందాలు ప్రభుత్వాల మధ్య (G-G) జరుగుతాయి. 15కు పైగా వాణిజ్య-వాణిజ్యేతర సంస్థల మధ్య ఒప్పందాలు కుదురనున్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
– 2030 వరకు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం
– రష్యా ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’లో చేరిక
– తాత్కాలిక ఉపాధి & చట్టవిరుద్ధ వలసల నిరోధంపై ఒప్పందాలు
– మాదకద్రవ్యాల ముప్పుకు వ్యతిరేకంగా సంయుక్త చర్యల ప్రణాళిక
– వైద్య విద్య-విజ్ఞాన రంగంలో సహకారం
– ధ్రువ ప్రాంత నౌకాశ్రయ నిపుణుల శిక్షణపై MoU
– ఆహార భద్రతలో రోస్‌పోట్రెబ్‌నాడ్‌జోర్ – FSSAI ఒప్పందం
– ద్రవ రాకెట్ ఇంజన్ ఉత్పత్తిలో రోస్‌కాస్మోస్-భారత అంతరిక్ష శాఖ MoU
అంతర్జాతీయ అంశాలపై చర్చ
ఐక్యరాజ్యసమితి, SCO, G20, BRICSలో సహకారం, 2026లో భారత్ అధ్యక్షత వహించే BRICS అంశాలపై కూడా నాయకులు పరస్పరం చర్చించుకుని అభిప్రాయాలు పంచుకోనున్నారు. పుతిన్‌తో పాటు ఏడుగురు మంత్రులు (రక్షణ మంత్రి బెలౌసోవ్, ఆర్థిక మంత్రి సిలువానోవ్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నబియుల్లినా తదితరులు), పెద్ద వ్యాపార బృందం ఢిల్లీకి రానున్నారు.
ఈ పర్యటన ద్వారా రష్యా-భారత్ విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని, రెండు దేశాలూ అంతర్జాతీయ వేదికలపై సన్నిహిత సహకారాన్ని కొనసాగించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




