Rajasthan: జైపూర్ కోచింగ్ సెంటర్‌లో గ్యాస్ లీక్.. అపస్మారక స్థితిలో 10మంది స్టూడెంట్స్.. మేజర్ యాక్షన్ ఏమిటంటే
నీట్ కు కోచింగ్ అంటే అందరి దృష్టి రాజస్తాన్ లోకి కోటా వంటి ప్రాంతాలపై పడుతుంది. రాజస్తాన్ లోని అనేక ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. తాజాగా జైపూర్‌లోని ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్‌లో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ లీక్ కావడంతో 10 మంది విద్యార్థులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో అధికారులు కోచింగ్ సెంటర్‌కు సీలు వేశారు. విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్యాస్ లీక్ అయింది. దీంతో చాలా మంది విద్యార్థులు అపస్మారక స్థితికి చేరుకున్నారు.ఈ విషయం ప్రభుత్వం దృష్టికి చేరుకోవడంతో వెంటనే రంగంలోకి దిగిన గ్రేటర్ మేయర్ సౌమ్య గుర్జార్ చర్యలు తీసుకున్నారు. ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్ భవనానికి సీలు వేశారు. ప్రమాదం ఎలా జరిగిందో కార్పొరేషన్ బృందం ఆరా తీస్తోంది. కోచింగ్ సెంటర్ నిర్వహణలో అనేక లోపాలున్నట్లు కార్పొరేషన్ బృందం గుర్తించింది.
గోపాల్‌పురా ప్రాంతంలోని రిద్ధి సిద్ధిలో ఉంది ఈ కోచింగ్ సెంటర్. ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్‌లో అకస్మాత్తుగా కొంతమంది విద్యార్థులు తరగతి గదిలోనే స్పృహతప్పి పడిపోవడంతో కలకలం రేగింది. తరగతి గదిలో దుర్వాసన వ్యాపించడంతో 10 మందికి పైగా విద్యార్థుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. విద్యార్థుల పరిస్థితి చూసి వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. విద్యార్థులను తరగతి గది నుంచి బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో పిల్లలు కోచింగ్ క్లాస్‌లో కూర్చుని చదువుకుంటున్నారు. అకస్మాత్తుగా ఏసీ లోపల నుంచి గ్యాస్ లీక్ అయి.. దుర్వాసనతో ఉన్న వాయువు గదిలో వ్యాపించింది. ఈ దుర్వాసనతో విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది. దీంతో కోచింగ్ యాజమాన్యం వెంటనే 108కి సమాచారం అందించింది. 108 అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులందరినీ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అందరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇతర పిల్లలు కూడా తరగతి గదిలో కూర్చున్నారు, వారిలో 10 మంది ఆరోగ్యం క్షీణించింది. తరగతులు జరుగుతున్న సమయంలో స్టూడెంట్స్ కు ఈ పరిస్థితి ఎదురైంది. విద్యార్థులు ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోవడంతో అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఈ విషయం తెలిసి కోచింగ్ సెంటర్ వెలుపల భారీగా జనం గుమిగూడారు. విద్యార్థులు నడిచే స్టేజ్ లో కూడా లేకపోవడంతో అంబులెన్స్ వద్దకు వారిని ఎత్తుకుని చేర్చినట్లు తెలుస్తోంది.
విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిన మేయర్
ప్రమాద వార్త తెలియగానే జైపూర్ గ్రేటర్ మేయర్ సౌమ్య గుర్జార్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..