ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ దూకుడు.. మొత్తం 70 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేజ్రీవాల్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించింది. నాలుగోసారి అధికారం దక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా ఆయన పావులు కదుపుతున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ దూకుడు.. మొత్తం 70 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేజ్రీవాల్‌
Aap Fourth List
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 15, 2024 | 9:07 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధుల ఎంపికను ఆప్‌ పూర్తి చేసింది. మొత్తం 70 స్థానాల్లో అభ్యర్దులను ప్రకటించారు కేజ్రీవాల్‌. తుదిజాబితాలో 38 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచి బరి లోకి దిగారు. కల్కాజీ నుంచి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. బీజేపీ , కాంగ్రెస్‌ కంటే వేగంగా అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసిన కేజ్రీవాల్‌ ప్రచారంపై దృష్టి పెట్టారు. ఆదివారం పార్టీ తన నాలుగో జాబితాను విడుదల చేశారు. ఇందులో 38 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారు. అంతకుముందు, ఆమ్ ఆద్మీ పార్టీ 3 జాబితాలను విడుదల చేసింది. అందులో 32 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

వచ్చే ఏడాది ఫిభ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. కాంగ్రెస్‌తో ముందస్తు ఎన్నికల పొత్తుకు అవకాశం లేదని కేజ్రీవాల్‌ తేల్చిచెప్పారు. సొంత బలంతోనే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీలో ఆప్‌ , బీజేపీ , కాంగ్రెస్‌ మధ్య అన్ని స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ బరిలో ఉన్న న్యూఢిల్లీ సీటులో పోటీ రసవత్తరంగా మారింది. కేజ్రీవాల్‌పై సందీప్‌ దీక్షిత్‌ను కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ప్రకటించింది. మాజీ ఎంపీ ప్రవేశ్‌ సాహెబ్‌ సింగ్‌ వర్మను బరిలోకి దింపాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అతిషి కల్కా జీ నుంచి ఎన్నికల రంగంలోకి దిగారు. దీంతో పాటు గ్రేటర్ కైలాష్ నుంచి సౌరభ్ భరద్వాజ్, బాబర్‌పూర్ నుంచి గోపాల్ రాయ్, మాల్వియా నగర్ నుంచి సోమనాథ్ భారతి, మతియా మహల్ నుంచి షోయబ్, రాజేంద్ర నగర్ నుంచి దుర్గేష్ పాఠక్ పోటీ చేయనున్నారు.

ఇక ఆదివారం పార్టీలో చేరిన రమేష్ పెహల్వాన్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా టిక్కెట్ ఇచ్చింది. కస్తూర్బా నగర్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ టికెట్‌ను రద్దు చేసి ఆయన స్థానంలో రమేష్‌ పెహల్వాన్‌ను అభ్యర్థిగా నిలిపింది. ఉత్తమ్ నగర్ స్థానం నుంచి నరేష్ బల్యాన్ భార్య పూజా నరేష్ బల్యాన్ కు టికెట్ కేటాయించారు. ప్రస్తుతం నరేష్ బల్యాన్ జైలులో ఉన్నాడు. ఢిల్లీ పోలీసులు నరేష్ బల్యాన్‌ను ఎంసీఓసీఏ కింద అరెస్టు చేశారు. మొత్తానికి 17 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల టిక్కెట్లను రద్దు చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోహింగ్యాల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఢిల్లీలో కావాలనే కేంద్రం రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు సీఎం ఆతిషి. రోహింగ్యాల వ్యవహారంలో కేంద్రం కఠినంగా వ్యవహరించాలని హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఆమె లేఖ రాశారు. అయితే కావాలనే కేంద్రంపై ఆప్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ కౌంటరిచ్చింది. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య 4000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 3000 కిలోమీటర్ల వరకు కంచె ఉంది. 1000 కిలోమీటర్లకు అసలు ఫెన్సింగ్‌ లేదు. కాని రోహింగ్యాలు అన్ని వైపుల నుంచి భారత్‌ లోకి చొరబడుతున్నారు. కంచె దూకి చాలా మంది చొరబడుతున్నప్పటికి కేంద్రం పట్టించుకోవడం లేదని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోహింగ్యాల చొరబాటుపై ఆప్‌ , బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..