American Senate: డొనాల్డ్ ట్రంప్ బాటలోనే బైడెన్.. ‘ఆ‘ విధానం మరింత తీవ్రం.. భారత్‌కు లాభమా? నష్టమా?

తాను తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానానికే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓకే అంటున్నారా? ఎస్.. తాజాగా అమెరికన్ సెనేట్ ముందుకొచ్చిన తీర్మానాలు ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. అయితే.. ఆ విధానాన్ని మరింత తీవ్రంగా బైడెన్ అమలు చేయనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

American Senate: డొనాల్డ్ ట్రంప్ బాటలోనే బైడెన్.. ‘ఆ‘ విధానం మరింత తీవ్రం.. భారత్‌కు లాభమా? నష్టమా?
Follow us

|

Updated on: Feb 24, 2021 | 4:59 PM

Biden to follow trump foot steps: డొనాల్డ్ ట్రంప్‌తో అమీతుమీ జరిగిన ఎన్నికల పోరులో విజేతగా నిలిచి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బైడెన్.. గత ప్రభుత్వ విధానాల్లో కొన్నింటిని రద్దు చేస్తూ వస్తున్నారు. సహజంగానే తాము గతంలో వ్యతిరేకించిన విధానాలను కొత్త పాలకులు రద్దు చేయడం జరుగుతుంది. కానీ.. ఓ విషయంలో మాత్రం బైడెన్… మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలనే కొనసాగించబోతున్నట్లు సంకేతాలందుతున్నాయి. ముఖ్యంగా విదేశాంగ విధానంలో డొనాల్డ్ ట్రంప్ టేకప్ చేసిన విధానాన్నే బైడెన్ కొనసాగించబోతున్నారు. కాకపోతే మరింత తీవ్రంగా ముందడుగు వేయబోతున్నట్లు తాజాగా అమెరికన్ సెనేట్ ముందుకొచ్చిన తీర్మానాలు స్పష్టం చేస్తున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా వున్నప్పుడు చైనాను ప్రధాన శత్రువుగా చూసే వారు. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం మొదలైన తర్వాత ట్రంప్ చైనా పట్ల తీవ్రమైన విధానాలను అవలంభించారు. కరోనా వైరస్ కారణంగా అమెరికా తీవ్రంగా ఎఫెక్టవడం.. లక్షలాది మంది మృత్యువాత పడడం కూడా ట్రంప్‌కు చైనా పట్ల ఆగ్రహం మరింత తీవ్రమైంది. ఒక దశలో చైనా పట్ల మెతక వైఖరి అవలంభిస్తుందన్న కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)పై కూడా కఠిన వైఖరి అవలంభించారు. కొన్ని సందర్భాలలో ఘాటైన విమర్శలు చేశారు. ట్రంప్ వైదొలగిన తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బైడెన్ చైనా పట్ల ఎలాంటి విధానాన్ని అవలంభిస్తారన్న చర్చ జరిగింది. ట్రంప్ అంతటి తీవ్ర స్థాయిలో చైనా పట్ల బైడెన్ ధోరణి వుండబోదన్న అంఛనాలు కూడా వినిపించాయి. కానీ ప్రస్తుతం అలాంటి ఊహాగానాలకు తెర దించుతూ చైనా పట్ల అమెరికా ధోరణిలో ఏ మాత్రం మార్పుండదని తెలుస్తోంది. చైనాను కార్నర్ చేసే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్దమవుతున్న సంకేతాలు తాజాగా వెల్లడయ్యాయి.

వివిధ రంగాల్లో చైనా నుంచి ఎదురవుతున్న పోటీని అధిగమించాల్సిన అవసరం ఉందని బైడెన్ భావిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని అమెరికాలో సెనేట్‌ మెజారిటీ నాయకుడు చుక్‌ షుమర్‌ తెలిపారు. తద్వారా అమెరికా పౌరుల ఉపాధిని రక్షించడంతో పాటు కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఆ దిశగా అనుసరించాల్సిన కొన్ని వ్యూహాలను ఆయన ప్రతిపాదించారు. వీటిని సెనేట్‌లోని ప్రధాన కమిటీలకు తెలియజేశారు. అందుకనుగుణంగా చట్టబద్ధమైన ప్యాకేజీలను రూపొందించాలని కోరారు. భారత్‌ వంటి మిత్రదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఈ మేరకు వచ్చే స్ప్రింగ్‌ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టి ఓటింగ్‌ నిర్వహించాలని కోరారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టడంతోపాటు నాటో దేశాలలో పెట్టుబడులు పెట్టి… చైనాకు ధీటైన వాణిజ్య వాతావరణాన్ని సృష్టించాలని బైడెన్ భావిస్తున్నారు. సమాంతర ఆర్థిక వ్యవస్థను తయారు చేయడంతోపాటు రక్షణ రంగంలోను ధీటైన దేశాలను పెంచాలని బైడెన్ తలపెట్టినట్లు తాజా ప్రతిపాదనలు చాటుతున్నాయి. ఇందుకోసం త్రిముఖ వ్యూహంతో బైడెన్ కార్యాచరణ ప్రారంభించారన్న విశ్లేషణలు అమెరికన్ మీడియాలో కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే ప్రతిపాదనను సెనేట్ మెజారిటీ నాయకుడు చుక్ షుమర్ కూడా వ్యక్తం చేశారు. అమెరికా ఆవిష్కరణల్లో వేగం పెంచడం ఈ త్రిముఖ వ్యూహంలో ప్రధానమైనదిగా చెబుతున్నారు.

చైనాకు ధీటుగా కనిపిస్తున్న దేశాల్లోని పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి చైనాను ధీటుగా ఢీకొట్టేనా అమెరికాలో పోటీ తత్వాన్ని పెంచాలని బైడెన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇది సరిగ్గా భారత్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ పథకాలను గుర్తు చేస్తోందని విదేశాంగ విధాన కర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. భారత్‌, ఆగ్నేయాసియా, నాటో వంటి వ్యూహాత్మక, మిత్ర దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని బైడెన్ ప్రతిపాదిస్తున్నారు. అమెరికా ఉపాధిపై దెబ్బకొట్టిన చైనా మోసపూరిత విధానాలను బయటి ప్రపంచానికి తెలియజేసేలా చట్టాలు ఉండాలంటూ షుమర్‌ చేసిన ప్రతిపాదనకు బైడెన్ సానుకూలంగా వున్నట్లు తెలుస్తోంది.

కీలక పరిశ్రమల్లో పెట్టుబడులతో పాటు అమెరికా సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం వుందని వైట్ హౌస్ థింక్ ట్యాంక్ భావిస్తున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా సెమీకండక్టర్ ఉత్పత్తి పరిశ్రమ బలహీనంగా ఉందని సెనేటర్లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, భద్రతకు ప్రమాదం పొంచి ఉందన్నది వారి ఆందోళన. సెమీకండక్టర్ల కోసం విదేశాలపై ఆధారపడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని అమెరికా రక్షణ రంగ నిఫుణులు అధ్యక్షుడు బైడెన్‌కు సూచిస్తున్నారు. చిప్స్ తయారీలోను చైనాను అధిగమించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. లేదంటే విపరీత పరిణామాలు ఎదురవుతాయన్న హెచ్చరికల మేరకు కొత్త విదేశాంగ విధాన రూపకల్పనలో బైడెన్ టీమ్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

భారత్ పట్ల ట్రంప్ ఎంత సానుకూలంగా మాట్లాడిన హెచ్1బీ వీసాల విషయం ఆయన ప్రభుత్వం తెచ్చిన మార్పుల కారణంగా భారతీయులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ వీసాల విషయంలో బైడెన్ ప్రభుత్వం స్పష్టమైన మార్పులను తీసుకువస్తోంది. అదే సమయంలో చైనాకు ధీటుటా భారతీయ పరిశ్రమలు ఎదిగేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులకు అమెరికా ముందుకు రాబోతున్నట్లు తాజాగా సెనేట్ ముందుకొచ్చిన తీర్మానాల ఆధారంగా తెలుస్తోంది. విశాలమైన భూభాగం, చైనాకు ధీటుగా మ్యాన్ పవర్ వున్న భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తున్న బైడెన్ దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.

ALSO READ: తెలంగాణకు కరోనా సెకెండ్ వేవ్ ముప్పు.. న్యూ వెరైటీ N440K ఎఫెక్ట్..