Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలెక్సీ నావెల్నీ కేసులో రష్యాపై ఆంక్షల విధింపునకు యోచిస్తున్న జోబైడెన్ ప్రభుత్వం

రష్యాలో ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ కి జరిగిన విష ప్రయోగం, ఆయనకు అక్కడి ప్రభుత్వం జైలుశిక్ష విధించడం వంటివాటిపై అమెరికాలో అధ్యక్షుడు జోబైడెన్..

అలెక్సీ నావెల్నీ కేసులో రష్యాపై ఆంక్షల విధింపునకు యోచిస్తున్న జోబైడెన్ ప్రభుత్వం
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 24, 2021 | 5:35 PM

రష్యాలో ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ కి జరిగిన విష ప్రయోగం, ఆయనకు అక్కడి ప్రభుత్వం జైలుశిక్ష విధించడం వంటివాటిపై అమెరికాలో అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించడానికి సమాయత్తమవుతోంది. నావెల్నీ కి రక్షణ కల్పించడంలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, రష్యా ప్రభుత్వం అతని పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించినట్టు భావిస్తున్నామని బైడెన్ ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. మరికొద్ది వారాల్లో ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని సీఎన్ ఎన్ వెల్లడించింది. యూరోపియన్ యూనియన్ దేశాలతో సంప్రదించి ఏ విధమైన ఆంక్షలు విధించాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారని ఈ సంస్థ పేర్కొంది. రష్యా పట్ల గతంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానానికి, ప్రస్తుతం బైడెన్ సర్కార్ పాటిస్తున్న విధానానికి చాలా తేడా ఉంది.

నావెల్నీ కి విషప్రయోగం జరిగినప్పటికీ ట్రంప్ ఉదాసీనంగా వ్యవహరించారని, రష్యాపై ఆంక్షల జోలికి పోలేదని సీఎన్ ఎన్  వర్గాలు గుర్తు చేశాయి. ఇప్పుడు ఈ కేసులో తీసుకోవలసిన చర్యలను సమన్వయ పరచేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ను కోరినట్టు ఈయూ ప్రతినిధి జోసెఫ్ బోరెల్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులోనావెల్నీపై విష ప్రయోగం జరిగింది. ఆయన తాగుతున్న కాఫీలో ప్రాణాపాయ ద్రవాన్ని కలిపి ఇచ్సినట్టు వార్తలు వచ్చాయి.స్పృహ కోల్పోయిన ఆయనను వెంటనే జర్మనీకి తరలించారు. దాదాపు కోమాలోకి వెళ్లిన ఆయన ఆ తరువాత క్రమంగా కోలుకున్నారు. అయితే ఇటీవలే జర్మనీ నుంచి వచ్చిన నావేల్నీని మాస్కో విమానాశ్రయంలో రష్యన్ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ మాస్కోతో బాటు రష్యాలోని అనేక నగరాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వెయ్యిమందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రెమ్లిన్ ప్రభుత్వాన్ని పడగొడతామని పేర్కొన్న వారు ..అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ని ఒక సందర్భంలో ‘దొంగ’ అని కూడా దుయ్యబట్టారు. ఈ నియంత ప్రభుత్వం గద్దె దిగాలని నినాదాలు చేశారు. ఇప్పుడు అమెరికాలో బైడెన్ ప్రభుత్వం కూడా వారి నిరసనలను పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది.