TG Govt Jobs 2026: నిరుద్యోగులకు ఎగిరిగంతేసే వార్త.. తెలంగాణలో వచ్చే జూన్ నాటికి లక్ష ఉద్యోగాలు!
రెండేళ్లలో 61,379 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. రాబోయే ఆరు నెలల్లో మరో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అందులో పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని..

హైదరాబాద్, డిసెంబర్ 5: రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పరిపాలన డిసెంబర్ 7తో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించిన నివేదికను రేవంత్ సర్కార్ విడుదల చేసింది. ఈ రెండేళ్లలో 61,379 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. రాబోయే ఆరు నెలల్లో మరో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అందులో పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర నియామకాలు, ఉద్యోగ మేళాలు, సకాలంలో నియామక పత్రాలు జారీ చేస్తూ నిరుద్యోగ యువతలో ఆశను తిరిగి నింపిందని నివేదిక పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 13 కొలువుల వేడుకల్లో పాల్గొని, వేలాది మంది అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు.
తెలంగాణలో రెండేళ్లలో 61,379 నియామకాలను పూర్తి చేయడం ద్వారా దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించిందని, మరో 8,632 పోస్టులు చివరి దశలో ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 70,011 పోస్టులను పూర్తి చేసిందని నివేదిక పేర్కొంది. విద్య, వైద్య, ఆరోగ్యం, పోలీసింగ్, ఇంధన సంస్థలు, ప్రధాన పరిపాలనా సేవలు వంటి కీలక రంగాలలో నియామకాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పునరుద్ధరణ అనేది ప్రారంభ జోక్యం. ఈ ప్రభుత్వం సంస్థను పునర్నిర్మించడం, పెండింగ్‌లో ఉన్న పరీక్షలను క్లియర్ చేయడం, యేళ్ల తరబడి నిష్క్రియాత్మకంగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి వయో పరిమితులను సడలించడం వంటి కీలక ఘట్టాలు రేవంత్ సర్కార్ చేపట్టినట్లు నివేదిక తెలిపింది.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 నియామకాలను విజయవంతంగా నిర్వహించడం సైతం ఓ మైలురాయిగా నివేదిక పేర్కొంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలపై తలెత్తిన వరుస వివాదాలతో గ్రూప్ 1 పరీక్షలు కొరకరాని కొయ్యలా మారాయి. మొత్తం 562 గ్రూప్ 1 పోస్టులకు తిరిగి నోటిఫై చేసి, షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి, సెప్టెంబర్ 27న నియామక పత్రాలు అందజేశారు. ఇక గ్రూప్ 2 ఫలితాలు కూడా సెప్టెంబర్ 28న ప్రకటించారు. ఆ తర్వాత 782 మంది అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం 1,365 పోస్టులకుగానూ గ్రూప్ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతోంది. మరో 8,143 మంది అభ్యర్థులకు గ్రూప్ 4 నియామక పత్రాలు జారీ చేయనున్నారు.
విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరంలో మెగా డీఎస్సీ నిర్వహించి 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పటికే పోస్టుల్లో 10,006 మంది అభ్యర్థులు చేరారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 8,400 నియామకాలు చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులకు తాత్కాలిక నియామకాల ద్వారా మద్దతు లభించింది. ఇక పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా అన్ని అడ్డంకులను తొలగించి 16,067 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య రంగంలో, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్పెషలిస్ట్ కేడర్‌లతో సహా 8,666 పోస్టులను భర్తీ చేశారు. మరో 7,267 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి నాటికి ఇవి కూడా పూర్తవుతాయని నివేదిక వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




