AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం పద్దతి.. సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆషామాషీగా IAS కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల కలెక్టర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండడం లేదన్నారు.

ఇదేం పద్దతి.. సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Cm Revanth Reddy Collectors Conference, Hyderabad
Balaraju Goud
|

Updated on: Mar 03, 2026 | 11:48 PM

Share

రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆషామాషీగా IAS కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల కలెక్టర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండడం లేదన్నారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా హైదరాబాద్‌ వస్తున్నారంటూ పలు జిల్లాల పేర్లు ప్రస్తావించి మరీ సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దని ఆదేశించారు.

ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులేనని, కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారని పలువురిని సీఎం రేవంత్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావన్నారు. కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామాలవారీగా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు,లబ్ధిదారుల వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించాలని కోరారు.

ఐదు దశల్లో 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌‌ చేపట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. మార్చి నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాలు ఉంటాయి. ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. మే 2న నియోజకవర్గ స్థాయిలో.. మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

శాఖల వారీగా 10 థీమ్‌లతో 99 రోజుల పాటు కార్యక్రమాలు ఉండబోతున్నాయి. పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్ – అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత – క్రీడలు, మహిళలు, పర్యావరణం, అనే పది థీమ్‌లతో కార్యక్రమాలు చేపట్టబోతోంది రేవంత్ సర్కార్. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ కూడా రూపొందిస్తోంది ప్రభుత్వం.

ప్రతి పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారు. రవాణా శాఖ డేటా ఆన్ లైన్ పూర్తి చేయడంతో పాటు డ్రైవర్లకు కంటి పరీక్షల శిబిరాలు నిర్వహించాలన్నారు. రోడ్ల గుంతలపై వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం సేకరణ, ఓఆర్ఆర్ వెంట చెత్త డంపింగ్‌పై కఠిన చర్యలు, మధ్యాహ్న భోజన బిల్లులు సమయానికి చెల్లింపు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, స్టూడెంట్ హాస్టళ్ల నమోదు తప్పనిసరి, పాఠశాలల్లో డ్రగ్స్‌పై కఠిన నిఘా, ప్రతి కార్పొరేట్ పాఠశాలలో సైకాలజిస్ట్ నియామకం వంటి కార్యక్రమాలపై మరింత ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలంటూ సీఎం ఆదేశించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడటం, సంక్షేమ పథకాల లబ్ధిని గ్రామ సభల్లో ప్రజలకు వివరించడం, విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ ఆసుపత్రులకు మెడికల్ కాలేజీలను అనుసంధానం చేసి మెరుగైన వైద్యసేవలు అందించడం వంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టాలన్నారు.

ఇక, భూసార పరీక్షలు పూర్తి చేసి రైతులకు సమాచారం అందించడమే కాకుండా.. యూరియా యాప్‌లో మార్పులు చేయాలన్నారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పంటల వైవిధ్యంపై జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగంపైనా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us