AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!

హైదరాబాద్ రాజసం, నిజాం నవాబుల కాలం నాటి అపారమైన సంపద చుట్టూ అల్లుకున్న ఒక భారీ మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిజాం నగల పేరిట ఏకంగా రూ. 50.8 కోట్ల మేర సాగిన ఈ చీటింగ్ ఉదంతం భాగ్యనగరంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్న సుకేష్ గుప్తా పేరు మరోసారి తెరపైకి రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా 'గోల్డ్ మాల్'.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
Nizam's Jewelry (file)
Vijay Saatha
| Edited By: |

Updated on: Apr 15, 2026 | 8:50 PM

Share

హైదరాబాద్ రాజసం, నిజాం నవాబుల కాలం నాటి అపారమైన సంపద చుట్టూ అల్లుకున్న ఒక భారీ మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిజాం నగల పేరిట ఏకంగా రూ. 50.8 కోట్ల మేర సాగిన ఈ చీటింగ్ ఉదంతం భాగ్యనగరంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్న సుకేష్ గుప్తా పేరు మరోసారి తెరపైకి రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేష్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడింది. నిజాం కాలం నాటి ఐదు అత్యంత విలువైన ఆభరణాల పెట్టెలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, వాటిని విడిపించి విక్రయిస్తే భారీ లాభాలు వస్తాయని నిందితులు రాజేష్‌ను నమ్మించారు. ఈ వ్యవహారంలో తనకు కూడా వాటా ఇస్తామని ఆశ చూపారు. ప్రధాన నిందితుడు జాకిర్ ఉస్మాన్ తోపాటు బషీర్‌బాగ్‌కు చెందిన ప్రముఖ జువెల్లర్ షోరూమ్ యాజమాని సుకేష్ గుప్తా ఈ కుట్రలో కీలక వ్యక్తులుగా పోలీసులు భావిస్తున్నారు.

2016లోనే ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. నగల పెట్టెల విడుదల కోసం నిధులు అవసరమని చెప్పి రాజేష్ అగర్వాల్ నుండి నిందితులు విడతల వారీగా రూ. 50.8 కోట్లు వసూలు చేశారు. అయితే, ఆ సొమ్మును ఆభరణాల విముక్తి కోసం కాకుండా, నిందితులు తమ సొంత రియల్ ఎస్టేట్, జువెల్లరీ కంపెనీల ఖాతాలకు మళ్లించారు. నమ్మిన స్నేహితుడే గొంతు కోశాడని గుర్తించిన బాధితుడు, చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులపై IPC 406 (నమ్మకద్రోహం), 34 (సామూహిక ఉద్దేశ్యం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆ ఐదు ఆభరణాల పెట్టెలు. ఆ పెట్టెలలో అసలు ఏ రకమైన నగలు ఉన్నాయి? వాటి విలువ వందల కోట్లా లేక వేల కోట్లా? అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ పెట్టెలు ప్రభుత్వ పర్యవేక్షణలో ఒక బ్యాంకు లాకర్‌లో భద్రంగా ఉన్నట్లు సమాచారం. గతంలో ప్రభుత్వం వీటిని విడుదల చేయాలని ఆదేశించినప్పుడు, నిందితులు మోసపూరితంగా తమ పేర్లపై యాజమాన్య హక్కులు పొందేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ గుప్తాకు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో MMTC లిమిటెడ్‌ను రూ. 504.34 కోట్ల మేర మోసం చేసిన భారీ కుంభకోణంలో ఈయన ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. తక్కువ మార్జిన్ మనీతో బంగారు కడ్డీలను పొంది, ఆ సొమ్మును వివిధ మార్గాల్లో మళ్లించినందుకు గతంలోనే ఈడీ (ED) ఆయన నివాసాలపై దాడులు చేసి భారీగా ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. అదనపు 5% మార్జిన్ మనీ చెల్లించకుండా ఫారెక్స్ పొజిషన్‌ను తెరిచి ఉంచడం ద్వారా, సుకేష్ గుప్తా తన కంపెనీల ద్వారా MMTC లిమిటెడ్ నుండి బయ్యర్ క్రెడిట్ లోన్ పద్ధతిలో బంగారు కడ్డీలను పొందినట్లు ఈడి గుర్తించింది. దీనివల్ల MMTC లిమిటెడ్ రూ. 549.06 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

MMTCని మోసం చేసి, దానికి భారీ నష్టాలను కలిగించడానికి ఇతరులతో కుట్ర పన్నిన సుకేష్ గుప్తాను ఈ కుంభకోణానికి సూత్రధారిగా పేర్కొన్నారు. MMTCకి గణనీయమైన మొత్తంలో చెల్లింపులు ఉన్నప్పటికీ, MBS గ్రూప్ తన లాభదాయకమైన వ్యాపారాల కోసం బంగారాన్ని ఉపయోగించుకుంటూ నిరాటంకంగా తన కార్యకలాపాలను కొనసాగించింది. సుకేష్ గుప్తా బంగారు కడ్డీలను, ఆభరణాలను వివిధ వినియోగదారులకు విక్రయించి, ఆ సొమ్మును వివిధ MBS గ్రూప్ సంస్థల ద్వారా మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇదే వ్యవహారంలో గతంలో సుకేష్ గుప్తా నివాసం, వ్యాపార కార్యాలయాల్లో ఈడీ జరిపిన సోదాల్లో రూ. విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ..

ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు రెండు ప్రధాన కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొదట బాధితుడి నుండి తీసుకున్న రూ. 50.8 కోట్లు ఏ ఏ కంపెనీల ఖాతాలకు వెళ్లాయి? ఆ డబ్బును ఎలా వినియోగించారు? రెండోవది నిజాం నగలపై నిందితులకు హక్కులు ఎలా వచ్చాయి? ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఏదైనా ఉందా? అనే కోణంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, నిజాం వారసత్వ సంపదను అడ్డుపెట్టుకుని సాగిన ఈ భారీ మోసం, హైదరాబాద్ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ పెట్టెలు తెరుచుకుంటే గానీ, ఈ కుంభకోణం లోతు ఎంత అన్నది ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us