జెన్‌జీస్ మతి పోగొడుతున్న స్పైడర్ మ్యాన్.. కలెక్షన్ల సునామీతో రికార్డుల మోత..
హాలీవుడ్‌లో సూపర్‌హీరోల శకం ముగిసిపోయిందనుకున్న వేళ.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తూ రీఎంట్రీ ఇచ్చాడు స్పైడర్ మాన్. సోనీ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్పైడర్ మాన్ - బ్రాండ్ న్యూ డే చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సరికొత్త చరిత్రను తిరగరాస్తోంది. జెన్ జీ యూత్‌ను కట్టిపడేసిన కథాంశంతో ఈ చిత్రం తొలి వీకెండ్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ ఆస్కార్ రేసు వైపు అడుగులు వేస్తుంది.

ఈ మధ్య కాలంలో హాలీవుడ్‌లో సూపర్‌హీరో సినిమాల హవా తగ్గిందనే ప్రచారానికి చెక్ పెడుతూ స్పైడర్ మాన్ – బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. సోనీ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ఉత్తర అమెరికాలో 325 మిలియన్ డాలర్లు వసూలు చేసే దిశగా దూసుకెళ్తుంది. హాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఇది రెండో స్థానంలో నిలవనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో దాదాపు 550 మిలియన్ డాలర్లు రాబట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలి వీకెండ్‌లోనే సుమారు 875 మిలియన్ డాలర్లు వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా నిర్మాణానికి సోనీ సంస్థ 225 మిలియన్ సంస్థ ఖర్చు చేసింది.
జెన్ జీ యూత్‌ను ఆకట్టుకున్న వైనం
1997-2012 మధ్య జన్మించిన జెన్ జీ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. టామ్ హాలాండ్, జెండయా, సేడీ సింక్ వంటి యంగ్ స్టార్స్ ఉండటమే కాకుండా, పీటర్ పార్కర్ భావోద్వేగాలు, అతను పడే మానసిక సంఘర్షణను సినిమాలో ప్రధానంగా చూపించడం యువతను విశేషంగా ఆకట్టుకుంది. రొట్టెన్ టొమాటోస్‌లో ఈ సినిమాకు ఏకంగా 98శాతం ఆడియన్స్ స్కోర్ లభించింది. మూసధోరణి సూపర్‌హీరో కథలకు భిన్నంగా, పీటర్ పార్కర్ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిస్తూ నిర్మాత అమీ పాస్కల్ తీర్చిదిద్దిన విధానంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రం ఆస్కార్ రేసులో నిలిచినా ఆశ్చర్యం లేదని హాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
విజయం వెనుక అసలు రహస్యం
2023లో ది మార్వెల్స్, ది ఫ్లాష్, ఆక్వామాన్ 2 వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ప్రేక్షకులు సూపర్‌హీరో సినిమాలకు దూరమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ప్రేక్షకులు సూపర్‌హీరోలకు దూరం కాలేదని, ఒకే రకమైన కథలకే విసిగెత్తిపోయారని స్పైడర్ మాన్ నిరూపించింది. గత 20 ఏళ్లలో సోనీ నుంచి వచ్చిన 11వ స్పైడర్ మాన్ సినిమా అయినప్పటికీ, పాత కథల వరుసగా కాకుండా ఒక కొత్త ప్రారంభంలా దీనిని ప్రమోట్ చేశారు. ట్రైలర్లలో కథను అసలు లీక్ చేయకుండా ఫ్యాన్స్ మధ్య ఉత్కంఠను పెంచడం కలిసివచ్చింది. ఈ సినిమా చూడటానికి పాత సినిమాలు చూసి ఉండాల్సిన అవసరం లేకపోవడం సామాన్య ప్రేక్షకులకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
