AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. పైలట్ల సాహసం!

ఒక్కసారి ఊహించుకోండి.. మీరు విమానంలో ప్రయాణిస్తున్నారు. అంతా సవ్యంగా సాగిపోతోంది. ఇంతలో ఒక్కసారిగా విమానంలోని ఇంజిన్లు ఆగిపోతే? ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. కానీ 1983లో కెనడాలో నిజంగానే భయానక ఘటన జరిగింది. 41 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ భారీ బోయింగ్ 767 విమానంలో ఇంధనం పూర్తిగా అయిపోయింది. రెండు ఇంజిన్లు ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. కాక్‌పిట్‌లోని ప్రధాన డిస్‌ప్లేలు కూడా పనిచేయడం మానేశాయి. ఇక విమానం కూలిపోవడమే తరువాయి అనుకున్న సమయంలో ఇద్దరు పైలట్లు అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించారు.

41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. పైలట్ల సాహసం!
In 1983 Air Canada Boeing Ran Out Of Fuel As Fuel Was Calculated In Pounds Instead Of Kilograms
Sharada V
|

Updated on: Nov 07, 2026 | 12:36 AM

Share

132 టన్నుల బరువున్న విమానాన్ని ఇంజిన్లు లేకుండానే గ్లైడర్‌లా నడిపించి.. కార్ల రేసింగ్ జరుగుతున్న పాత రన్‌వేపై దించారు. ఈ ప్రమాదంలో 61 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది.. మొత్తం 69 మంది ప్రాణాలతో బయటపడ్డారు. విమానయాన చరిత్రలో ‘గిమ్లీ గ్లైడర్’గా ప్రసిద్ధి చెందిన ఈ ఘటన కథ ఏంటో తెలుసుకుందాం.

లెక్క తప్పింది.. 69 మంది ప్రాణాలు ప్రమాదంలో

1983 జులై 23. ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ 767 విమానం మాంట్రియల్ నుంచి ఎడ్మంటన్‌కు బయలుదేరేందుకు సిద్ధమైంది. మధ్యలో ఒట్టావాలో ఆగాల్సి ఉంది.  అయితే విమానం టేకాఫ్ కాకముందే ఓ పెద్ద పొరపాటు జరిగింది.

విమానంలో ఎంత ఇంధనం ఉందో చూపించే డిజిటల్ ఫ్యూయల్ క్వాంటిటీ ఇండికేటర్ సిస్టమ్ (FQIS)లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఇంధనాన్ని మాన్యువల్‌గా లెక్కించాల్సి వచ్చింది. ఇందుకోసం డ్రిప్‌ స్టిక్ అనే పరికరంతో ట్యాంకులోని ఇంధన పరిమాణాన్ని లీటర్లలో కొలిచారు.

అప్పట్లో ఎయిర్ కెనడా తన విమానాల్లో పాత ఇంపీరియల్ కొలతల విధానం నుంచి మెట్రిక్ విధానానికి మారుతోంది. కొత్తగా కొనుగోలు చేసిన బోయింగ్ 767లో ఇంధనాన్ని కిలోగ్రాముల్లో లెక్కించాలి. కానీ సిబ్బంది లెక్కల్లో పొరపాటు చేశారు. లీటర్లను కిలోగ్రాముల్లోకి మార్చాల్సిన చోట పౌండ్లకు సంబంధించిన మార్పిడి సంఖ్యను ఉపయోగించారు.

సాధారణంగా ఒక లీటర్ ఇంధనం బరువును కిలోగ్రాముల్లో లెక్కించేందుకు 0.8తో గుణించాలి. కానీ పొరపాటున 1.77తో గుణించారు. ఫలితంగా విమానంలో అవసరమైన దానికంటే చాలా తక్కువ ఇంధనం నింపారు. విమానం బయలుదేరే సమయానికి అందులో కేవలం 10,100 కిలోగ్రాముల ఇంధనం మాత్రమే ఉంది. కానీ ప్రయాణం పూర్తి చేయడానికి సుమారు 22,300 కిలోగ్రాములు అవసరం. అంటే సగం కంటే తక్కువ ఇంధనంతోనే విమానం గాల్లోకి ఎగిరింది!

41 వేల అడుగుల ఎత్తులో హెచ్చరికలు

విమానం ప్రయాణం మొదలైనప్పుడు ఎలాంటి సమస్య కనిపించలేదు. కానీ అంటారియోలోని రెడ్ లేక్ ప్రాంతం మీదుగా 41 వేల అడుగుల ఎత్తులో వెళ్తుండగా కాక్‌పిట్‌లో ఇంధన పీడనం తగ్గుతోందంటూ హెచ్చరికలు మొదలయ్యాయి.

కెప్టెన్ రాబర్ట్ పియర్సన్, ఫస్ట్ ఆఫీసర్ మారిస్ క్వింటల్ తొలుత ఇంధన పంపుల్లో సమస్య వచ్చిందని భావించారు. వెంటనే విమానాన్ని విన్నిపెగ్ వైపు మళ్లించాలని నిర్ణయించారు. కానీ వారికి ఊహించని పరిణామం ఎదురైంది. కొద్ది నిమిషాల్లోనే విమానంలోని రెండు ఇంజిన్లు పూర్తిగా ఆగిపోయాయి.

ఇంజిన్లు ఆగిపోవడంతో ప్రధాన విద్యుత్ జనరేటర్లు పనిచేయడం మానేశాయి. కాక్‌పిట్‌లోని ప్రధాన డిస్‌ప్లేలు ఒక్కసారిగా ఆగిపోయాయి. విమానాన్ని నడిపేందుకు అవసరమైన కీలక సమాచారం అందించే వ్యవస్థలు అందుబాటులో లేకుండా పోయాయి. బ్యాటరీలతో పనిచేసే అత్యవసర పరికరాలు మాత్రమే మిగిలాయి. వాటిలో విమానం ఎంత వేగంగా కిందకు దిగుతోందో తెలిపే వర్టికల్ స్పీడ్ ఇండికేటర్ కూడా లేదు.

ఒకవైపు ఇంజిన్లు లేవు.. మరోవైపు కీలక పరికరాలు పనిచేయడం లేదు. కిందకు దిగుతున్న విమానాన్ని ఎంత వేగంగా నియంత్రించాలో కూడా సరిగ్గా తెలియని పరిస్థితి. అయినప్పటికీ పైలట్లు భయపడకుండా విమానాన్ని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించారు.

ఆదుకున్న చిన్న టర్బైన్!

ఇంజిన్లు ఆగిపోవడంతో మరో సమస్య ఎదురైంది. విమానాన్ని మలచడానికి, దాని దిశను నియంత్రించడానికి ఉపయోగించే హైడ్రాలిక్ వ్యవస్థకు అవసరమైన శక్తి కూడా తగ్గిపోయింది. సాధారణంగా ఈ వ్యవస్థకు ఇంజిన్ల ద్వారా శక్తి అందుతుంది. ఇప్పుడు రెండు ఇంజిన్లు ఆగిపోవడంతో విమానాన్ని నియంత్రించడం మరింత కష్టమైంది.

అయితే బోయింగ్ 767లో ఉన్న అత్యవసర వ్యవస్థ వెంటనే పనిచేసింది. విమానం కింద నుంచి రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) అనే చిన్న ప్రొపెల్లర్ బయటకు వచ్చింది. విమానం ముందుకు కదులుతున్నప్పుడు దానికి తగిలే గాలి ద్వారా ఈ టర్బైన్ తిరిగి కొంత హైడ్రాలిక్ శక్తిని అందిస్తుంది. దీంతో పైలట్లు విమానాన్ని కొంతవరకు నియంత్రించగలిగారు.

ఇప్పుడు అసలు ప్రశ్న. విమానాన్ని ఎక్కడ దించాలి? విన్నిపెగ్ చేరుకునే అవకాశం లేకపోవడంతో పైలట్‌కు తనకు గతంలో శిక్షణ ఇచ్చిన ఓ పాత సైనిక విమానాశ్రయం గుర్తొచ్చింది. అదే జిమ్లీ ఎయిర్ బేస్. వెంటనే అక్కడికి వెళ్లి అత్యవసర ల్యాండింగ్ చేయాలని సూచించారు.

విమానం దిగాల్సిన రన్‌వేపై కార్ల రేసింగ్

పైలట్లు విమానాన్ని జిమ్లీ వైపు మళ్లించారు. కానీ ఆ రోజు అక్కడ స్పోర్ట్స్ కార్ల రేసింగ్ కార్యక్రమం జరుగుతోంది. ప్రేక్షకులు, రేసింగ్ కార్లు రన్‌వే పరిసరాల్లో ఉన్నాయి. ఈ విషయం పైలట్లకు తెలియదు. ఇంజిన్లు పనిచేయని భారీ విమానం నిశ్శబ్దంగా తమవైపు దూసుకొస్తుండటంతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

విమానం రన్‌వేకు చేరువయ్యే సమయానికి అది చాలా ఎత్తులో, అధిక వేగంతో ఉందని కెప్టెన్ పియర్సన్ గుర్తించారు. సాధారణంగా ల్యాండింగ్ సమయంలో వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే ఫ్లాప్స్, స్లాట్స్‌ను ఇంజిన్ల శక్తి లేకుండా సాధారణంగా ఉపయోగించడం సాధ్యం కాలేదు. విమానాన్ని సురక్షితంగా దించాలంటే ఏదో ఒక అసాధారణ పద్ధతిని ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గ్లైడర్ నడిపిన అనుభవం.. భారీ విమానాన్ని కాపాడిన పైలట్!

కెప్టెన్ రాబర్ట్ పియర్సన్‌కు గ్లైడర్ విమానాలు నడిపిన అనుభవం ఉంది. విమానం వేగాన్ని నియంత్రిస్తూ ఎత్తును తగ్గించేందుకు ‘ఫార్వర్డ్ స్లిప్’ అనే ప్రత్యేక పద్ధతిని ఉపయోగించారు. ఈ పద్ధతిలో విమానం రెక్కల నియంత్రణ, రడర్‌ను వ్యతిరేక దిశల్లో ఉపయోగించి విమానాన్ని కొద్దిగా పక్కకు ఒంపుతారు. దీనివల్ల గాలి నిరోధం పెరిగి విమానం వేగాన్ని ఎక్కువగా పెంచకుండా ఎత్తును తగ్గించుకోవచ్చు.

అయితే ఈ ప్రయత్నంలో రామ్ ఎయిర్ టర్బైన్‌కు అందే గాలి ప్రవాహం కొద్దిసేపు తగ్గింది. దీంతో విమాన నియంత్రణ మరింత కష్టమైంది. అయినప్పటికీ పియర్సన్ సమయానికి విమానాన్ని మళ్లీ సరిచేసి ల్యాండింగ్‌కు సిద్ధం చేశారు. ఆ సమయంలో ఆయన చూపిన నైపుణ్యం, అనుభవం విమాన ప్రయాణికుల ప్రాణాలను కాపాడాయి.

ముందు చక్రం లాక్ కాలేదు.. రన్‌వేపై రాసుకుపోయిన విమానం!

ల్యాండింగ్‌కు ముందు విమానం చక్రాలను బయటకు తీసేందుకు సాధారణ వ్యవస్థ పనిచేయలేదు. దీంతో పైలట్లు అత్యవసర మాన్యువల్ గ్రావిటీ రిలీజ్ పద్ధతిని ఉపయోగించారు. ప్రధాన చక్రాలు బయటకు వచ్చినప్పటికీ ముందు భాగంలోని నోస్ గేర్ మాత్రం సరిగ్గా లాక్ కాలేదు.

చివరకు బోయింగ్ 767 రన్‌వేపై దిగింది. కానీ ముందు చక్రం సరిగా లాక్ కాకపోవడంతో విమానం ముక్కు భాగం కిందకు వాలిపోయింది. పైలట్ బ్రేకులు వేయడంతో రెండు టైర్లు పేలిపోయాయి. విమానం ముందు భాగం కాంక్రీట్ రన్‌వేపై రాసుకుంటూ ముందుకు కదిలింది. ఈ రాపిడి వల్ల విమానం వేగం క్రమంగా తగ్గింది.

అంతేకాదు.. రేసింగ్ ట్రాక్ మధ్యలో ఏర్పాటు చేసిన స్టీల్ గార్డ్‌రైల్‌ను విమానం ముందు భాగం ఢీకొట్టింది. ఈ అడ్డంకి విమానం పక్కకు మళ్లకుండా నేరుగా ముందుకు వెళ్లి ఆగడానికి దోహదపడింది. అదే సమయంలో రన్‌వేపై సైకిళ్లు తొక్కుతున్న ఇద్దరు బాలురు కూడా విమానం దూసుకొస్తుండటాన్ని గమనించి పక్కకు తప్పించుకున్నారు. తృటిలో మరో ప్రమాదం తప్పింది.

విమానం ముక్కు భాగం దగ్గర చిన్న మంటలు చెలరేగాయి. అయితే రేసింగ్ ట్రాక్ సిబ్బంది వెంటనే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లతో వాటిని ఆర్పేశారు. టచ్‌డౌన్ అయిన ప్రదేశం నుంచి సుమారు 3,000 అడుగుల దూరంలో విమానం పూర్తిగా ఆగిపోయింది.

69 మందికి పునర్జన్మ.. మళ్లీ ప్రయాణికులకు సేవలందించిన విమానం!

విమానం ఆగిన వెంటనే అత్యవసర స్లైడ్ల ద్వారా ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. అయితే ముందు భాగం కిందకు వాలిపోవడంతో స్లైడ్లు ఎక్కువ వాలుతో వేలాడాయి. దీంతో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ భయంకర ప్రమాదంలో ఒక్క ప్రాణం కూడా పోలేదు. విమానంలోని మొత్తం 69 మంది సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ఘటనపై కెనడా ఏవియేషన్ సేఫ్టీ బోర్డు విచారణ జరిపింది. ఇంధన లెక్కల్లో జరిగిన పొరపాటు, సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడం, మెట్రిక్, ఇంపీరియల్ కొలతల విధానాలను ఒకేసారి ఉపయోగించడం వల్ల ఏర్పడిన గందరగోళం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలని గుర్తించింది.

ఇక ప్రమాదానికి గురైన బోయింగ్ 767 విమానాన్ని జిమ్లీ వద్దే మరమ్మత్తు చేశారు. అనంతరం అది మళ్లీ ఎయిర్ కెనడా సేవల్లోకి వచ్చింది. మరో 25 ఏళ్లపాటు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన ఈ విమానాన్ని 2008లో రిటైర్ చేశారు.

ఒక చిన్న లెక్క తప్పిదం.. వేల అడుగుల ఎత్తులో ఇంజిన్లు ఆగిపోవడం.. రేసింగ్ ట్రాక్‌గా మారిన రన్‌వేపై అత్యవసర ల్యాండింగ్.. 69 మంది క్షేమంగా బయటపడటం! పైలట్ల అనుభవం, ధైర్యం, సమయస్ఫూర్తి ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలవని నిరూపించిన ఈ ఘటన చరిత్రలో నిలిచిపోయింది.

Follow Us
41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. పైలట్ల సాహసం!
41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. పైలట్ల సాహసం!
బషీర్ బలూచ్‌ పై విష ప్రయోగం? మిస్టరీగా BLA చీఫ్ ఆచూకీ
బషీర్ బలూచ్‌ పై విష ప్రయోగం? మిస్టరీగా BLA చీఫ్ ఆచూకీ
పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!
పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!
గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!
గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు ఛార్జింగ్‌ను ఎలా బదిలీ చేయాలో తెలుసా?
ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు ఛార్జింగ్‌ను ఎలా బదిలీ చేయాలో తెలుసా?
ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. 
ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. 
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..
భోజనాల్లో 2కేజీల మటన్ కూర ఇలా వండితే 10 మందికి మంచిగా పెట్టొచ్చు
భోజనాల్లో 2కేజీల మటన్ కూర ఇలా వండితే 10 మందికి మంచిగా పెట్టొచ్చు