దీపావళి
హిందువులు జరుపుకునే పండగలు భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి అద్దం పట్టేవిగా ఉంటాయి. అంతేకాదు ఆయా కాలానికి అనుగుణంగా పూజా విధానం, నైవేద్యంగా సమర్పించే ఆహారాలు ఉంటాయి. హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగలలో ఒకటి దీపావళి. ఆశ్వీయుజ మాస బహుళ చతుర్దశి తిధి రోజున నరక చతుర్దశిగా, బహుళ అమావాస్య రోజున దీపావళిగా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఉత్తరభారతంలోని ఈ దీపావళిని పండగను ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. లోక కంటకుడైనా నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ప్రజలకు, దేవతలకు విముక్తి ఇచ్చారు శ్రీకృష్ణుడు, సత్యభామ. దీంతో నరకాసురుడు మరణించిన ఆనందంలో ప్రజలు మర్నాడు అమావాస్య రోజున దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి వైభవంగా పండగను జరుపుకున్నారని పురాణాల కథనం. అంతేకాదు లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన ఆనందంలో ప్రజలు దీపావళిని జరుపుకున్నారని రామాయణంలో ఉంది. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులు తీసుకొచ్చే ఈ దీపావళి పండగను హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్తులు వైభవంగా జరుపుకుంటారు. ఆబాల గోపాలం కొత్త దుస్తులు ధరించి అమావాస్య చీకట్లు పారద్రోలే విధంగా తమ ఇంటిని దీపాల వెలిగించి సంతోషంగా జరుపుకునే ఈ పండగ ఈ ఏడాది నవంబర్ 1 వ తేదీన వచ్చింది.