- Telugu News Photo Gallery Spiritual photos Diwali 2025: celebration at graveyard for the sake of ancestors in karimnagar
Diwali 2025: స్మశానంలో దీపావళి వేడుకలు.. పూర్వీకులను స్మరించుకుంటూ వేడుకలు.. ఎక్కడంటే
సాధారణంగా దీపావళి పండుగ రోజున అందరూ దేవుళ్ళను పూజిస్తారు. కానీ కొన్ని సామాజికవర్గాల కుటుంబాలు మాత్రం సమాధుల వద్ద పూజలు నిర్వహించి.. చనిపోయిన తమ పూర్వికులను గుర్తుచేసుకుంటారు. దీపావళి పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే.. వీళ్లు మాత్రం స్మశాన వాటికల వద్దకు వెళ్లి సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్నారు కరీంనగర్ జిల్లాలోనే ఓ సామాజిక వర్గం.
Updated on: Oct 21, 2025 | 10:19 AM

స్మశానంలోకి అడుగు పెట్టాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ కరీంనగర్ లో ఆరు దశబ్దాలకు పైగా స్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కోనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటు.. తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. వినడానికి కోంత వింతగా అనిపించిన చాలా కుటుంబాలు ఈ తంతును ఆచరిస్తున్నాయి

కరీంనగర్ లోని కార్ఖన గడ్డలో ఉన్న హిందు స్మశాన వాటిక లో ప్రతి యేటా దళిత కుటుంబాలు స్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటారు. పండగకు వారం రోజుల ముందే స్మశాన వాటిక వద్ద అంత శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంత శుభ్రం చేసిన తరువాత పూలతో సమాధులను అలంకరిస్తారు. దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి.. పండగ రోజును సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుని అక్కడే గడుపుతారు

సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెప్తుంటారు. అందుకోసమే చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు కూడా వండి సమాధుల వద్ద నైవేధ్యంగా పెడతారు. పితృ దేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. ఇదీ కాస్త వింత గానే ఉన్నప్పటికీ చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటు పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు.

ఉపాధి కోసం వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిర పడిన వారంత దీపావళి పండగకు మాత్రం ఖచ్చితంగా కరీంనగర్ కు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకొని పిల్ల పాపలతో సాయంత్రం ఆరుగంటలకు సమాధుల వద్దకు వచ్చి అక్కడే రెండు గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళుతుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వికులను స్మరించుకోవడమే తమకు నిజమైన దీపావళి అని చెబుతుంటారు.

దీపావళి పండుగ రోజున చనిపోయిన వారి సమాధుల వద్దనే ఇంటిల్లి పాది దీపావళి వేడుకలు చేసుకుంటారు. అక్కడే పిల్లాపాపలతో టపాసులు కాలుస్తారు ఇలా జరుపుకోవడం కరీంనగర్‌లోని కొంత మందికి సంప్రదాయంగా వస్తుంది.

ఏది ఏమైనా గాని దీపావళి పండుగ రోజున తమని కానీ పెంచి ఇంతవారిని చేసిన తమ కుటుంబ సభ్యుల మధ్య దీపావళి పండుగ జరుపుకోవడం తమకి ఆనందం గా ఉందని ఇదే తమకి నిజమైన దీపావళి పండుగ అని అంటున్నారు.
