అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 3,258 మంది భారతీయులను అమెరికా (యూఎస్) బహిష్కరించినట్లు కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 2009 నుంచి ఇప్పటి వరకూ మొత్తం..

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 3,258 మంది భారతీయులను అమెరికా (యూఎస్) బహిష్కరించినట్లు కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 2009 నుంచి ఇప్పటి వరకూ 18,822 మంది భారతీయుల్ని అమెరికా బహిష్కరించిందన్నారు. 2023లో 617 మందిని, 2024లో 1,368 మందిని, 2025లో 3,258 మంది భారతీయులను అమెరికా బహిష్కరించినట్లు వివరించారు. ‘జనవరి 2025 నుంచి ఇప్పటి వరకూ 3,258 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపింది. వీరిలో 2,032 మంది అంటే సుమారు 62.3 శాతం మందిని సాధారణ వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి పంపింది. మిగిలిన 1,226 మందిని (37.6 శాతం) యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించే చార్డర్ విమానాల్లో భారత్‌కు తరలించిందిని జైశంకర్ వెల్లడించారు.
ఐదేళ్లలో 62 మంది విద్యార్థుల అమెరికా వెళ్లకుండా నిరాకరణ
గత ఐదేండ్లలో విదేశీ ఇమ్మిగ్రేషన్ అధికారులు 62 మంది భారతీయ విద్యార్థులకు అమెరికాకు వెళ్లకుండా నిరాకరించారని కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో ఒక ఎంపీ ప్రశ్నకు విదేశాంగ సహా మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే 11 మంది విద్యార్థులను కిర్గిజ్‌స్తాన్‌కు వెళ్లకుండా నిరాకరించారు. అయితే గత ఐదేండ్లలో యూకే 170 మంది, ఆస్ట్రేలియా 114 మంది, రష్యా 82 మంది, అమెరికా 45 మంది, ఉక్రెయిన్ 13 మంది, ఫిన్‌లాండ్ ఐదుగురు ఇండియా విద్యార్థులను బహిష్కరించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








