Andhra Pradesh: మహిళలకు ఇది కదా కావాల్సింది.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం మహిళల కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించనుంది. ఆడబిడ్డల పెళ్లిళ్లకు, పిల్లల ఉన్నత చదువులకు ఆసరాగా నిలుస్తూ పావలా వడ్డీకే రూ.లక్ష వరకు రుణ సదుపాయం కల్పించి, మహిళా లోకానికి కొండంత అండగా నిలవనుంది. ఈ పథకాలతో పాటు మరికొన్ని వరాలను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 8న బహిరంగ సభ వేదికగా ఈ వరాల జల్లు కురిపించనున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వంటి ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. కేవలం పావలా వడ్డీకే రూ.10 వేల నుండి రూ.లక్ష వరకు రుణ సదుపాయం కల్పిస్తూ, అటు ఆడబిడ్డల పెళ్లిళ్లకు, ఇటు ఉన్నత చదువులకు ప్రభుత్వం భరోసాగా నిలవనుంది.
ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి
డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రూ.10 వేల నుండి ప్రారంభించి అవసరాన్ని బట్టి లక్ష రూపాయల వరకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. బయట మార్కెట్లో అధిక వడ్డీల భారం లేకుండా కేవలం పావలా వడ్డీతోనే ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి
మహిళల లేదా వారి పిల్లల ఉన్నత విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదనే లక్ష్యం. ప్రొఫెషనల్ కోర్సులు, పైచదువుల కోసం లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం. దీనివల్ల మధ్యతరగతి, పేద డ్వాక్రా కుటుంబాల్లోని విద్యార్థినులకు గొప్ప ఊరట లభిస్తుంది. అంతేకాకుండా మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, NECC, అమృత యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలతో సెర్ప్, మెప్మా కీలక ఒప్పందాలు చేసుకోనున్నాయి.
మరికొన్ని చోట్ల వన్‌స్టాప్ సెంటర్లు
మహిళల భద్రతే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న కేంద్రాలకు అదనంగా మరో 10 కొత్త వన్‌స్టాప్ సెంటర్లను సీఎం ప్రారంభించనున్నారు. టెక్కలి, రంపచోడవరం, తిరువూరు, తణుకు, తుళ్లూరు, మాచర్ల, మార్కాపురం, కుప్పం, మదనపల్లె, ఆదోనిలో వీటిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి వీటిని అద్దె భవనాల్లో ప్రారంభించి, కేంద్రం అందించిన రూ.6 కోట్ల గ్రాంటుతో శాశ్వత భవనాలను నిర్మించనున్నారు.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ – డిజిటల్ యాప్
ఉద్యోగినుల వసతి సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 23 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌లో వసతి, సౌకర్యాల వివరాలు తెలుసుకునేందుకు, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొత్త యాప్‌ను సీఎం ఆవిష్కరిస్తారు.భవిష్యత్తులో మరో 30 అదనపు హాస్టల్స్‌ను నిర్మించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఉపాధి – శిక్షణ
రంపచోడవరంలో రూ.65 లక్షలతో వెదురు ప్రాసెసింగ్ ప్లాంట్, చిత్తూరులో రూ. 70 లక్షలతో మునగ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. విజయవాడ, విశాఖపట్నంలో ప్రాంతీయ శిక్షణ కేంద్రాల నిర్మాణానికి పునాది రాయి పడనుంది. మహిళల ఆధ్వర్యంలో నడిచే మరో 5 తృప్తి క్యాంటీన్లను కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది.
