ఏది పడితే అది వద్దు మావ.. ఉదయాన్నే ఇది తింటే బరువు తగ్గడం ఖాయం
బరువు తగ్గాలనుకునేవారికి ప్రోటీన్ ఇడ్లీ మంచి అల్పాహార ఎంపికగా మారుతోంది. సాధారణ ఇడ్లీ పిండిలో పన్నీర్, మొలకెత్తిన మెంతులు, క్యారెట్ వంటి పోషక పదార్థాలు కలిపి తయారుచేసే ఈ ఇడ్లీలు ప్రోటీన్, ఫైబర్‌ను అందిస్తాయి. దీంతో ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండి, అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో పాటు ఈ ప్రోటీన్ ఇడ్లీని డైట్‌లో చేర్చుకోవచ్చు.

చాలా మంది ఊబకాయం అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునేవారికి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి డైటీషియన్లు ఒక వినూత్నమైన, పోషకమైన ఇడ్లీ రెసిపీని పరిచయం చేశారు. ఇది కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుందని పేర్కొంటున్నారు.
ప్రోటీన్ ఇడ్లీ తయారీ:
ఈ ప్రత్యేక ఇడ్లీని తయారు చేయడానికి, సాధారణ ఇడ్లీ పిండికి కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను కలుపుతారు. ఒక్కో ఇడ్లీ గరిటెకు ఒక స్పూన్ తురిమిన పన్నీర్, కొద్దిగా మొలకెత్తిన మెంతులు, ఐచ్ఛికంగా కొంచెం తురిమిన క్యారెట్ జోడిస్తారు. పన్నీర్ అధిక ప్రోటీన్‌ను అందిస్తుంది.. ఇది కండరాల నిర్మాణానికి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది. మొలకెత్తిన మెంతులు కొవ్వును కరిగించే లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి ఆవిరి చేసినప్పుడు చేదుగా ఉండవు. క్యారెట్ ఫైబర్‌ను అందించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి, ఆవిరిలో ఉడికించాలి. ఈ విధంగా తయారుచేసిన ఇడ్లీలు రంగురంగులుగా ఉండటమే కాకుండా, పిల్లలు కూడా ఇష్టపడేలా ఉంటాయి.
ప్రత్యేక ప్రోటీన్ చట్నీ:
ఈ ఇడ్లీకి తగ్గట్టుగా ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ చట్నీని కూడా సూచించారు. దీని తయారీకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనెలో తక్కువ పచ్చిమిర్చి, ఎక్కువ అల్లం, మిరియాలు వేయాలి. దీనికి కొద్దిగా జీలకర్ర, మెంతులు, ఒక స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలు, కొద్దిగా జీడిపప్పు కలుపుతారు. పుట్నాలపప్పుకు బదులు వేయించిన శనగపప్పును ఉపయోగించడం ద్వారా రుచి, పోషక విలువలు పెరుగుతాయి. కొబ్బరిని కూడా కొద్దిగా వేయించి వేయాలి. చింతపండు, కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా ఈ చట్నీలో ముఖ్యమైన పదార్థాలు. ఈ పదార్థాలన్నీ వేయించిన తర్వాత, పూర్తిగా చల్లార్చి మిక్సీలో గ్రైండ్ చేయాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేయడం వల్ల చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ చట్నీని కారం తక్కువ తినేవారు తమకు తగినట్లుగా పచ్చిమిర్చిని తగ్గించుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
ఈ ప్రోటీన్ ఇడ్లీ, చట్నీ కలయిక అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
బరువు తగ్గడం: అధిక ప్రోటీన్, ఫైబర్, కొవ్వు కరిగించే పదార్థాల కారణంగా ఇది పొట్ట కొవ్వును తగ్గించి, బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
సంపూర్ణత్వం: ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచి, అనవసరమైన చిరుతిళ్లను నివారిస్తుంది.
జీవక్రియ పెంపు: శరీర జీవక్రియను పెంచి, శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.
పోషకాలు: పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఒమేగా-3, మెగ్నీషియంను అందిస్తాయి. పన్నీర్, మినప్పప్పు ప్రోటీన్‌ను ఇస్తాయి. ఉల్లిపాయ ఐరన్ అందిస్తుంది. ఈ అన్ని పదార్థాల వల్ల మెదడు, గుండె, ఇతర శరీర భాగాలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.
జీర్ణక్రియ – రక్తంలో చక్కెర నియంత్రణ: ఈ చట్నీలో వాడే పదార్థాలు గట్ ఆరోగ్యానికి మంచివి, ఇన్సులిన్ స్పైక్‌లను నివారిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా చూస్తాయి.
సాధారణ ఇడ్లీ పిండితో కూడా ఈ మార్పులు చేసుకుంటే, ఈ చట్నీతో ఎన్ని ఇడ్లీలనైనా తినవచ్చు. ఇది అల్పాహారంగా లేదా రాత్రి భోజనంగా చాలా మంచి ఎంపిక. మీ రెగ్యులర్ ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఇన్ని ప్రయోజనాలు పొందవచ్చని ప్రముఖ డైటీషియన్ చెప్పారు. దీనిని తప్పకుండా ప్రయత్నించి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి.
అయితే.. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
