AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్‌షాపుల్లో స్టీమ్ రైస్ పంపిణీ.. దేశంలోనే తొలిసారి ఏపీలోని ఈ జిల్లాలో అమలు

AP PDS Rice: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కాకినాడ జిల్లాలో తొలిసారిగా రేషన్ దుకాణాల ద్వారా స్టీమ్ రైస్ పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అలాగే ఆగస్టు 1 నుంచి రైతు బజార్లు, ప్రత్యేక అవుట్‌లెట్లలో తక్కువ ధరకే బీపీటీ స్టీమ్ రైస్, గ్రేడ్-1 రా రైస్ విక్రయించనున్నట్లు వెల్లడించారు.

రేషన్‌షాపుల్లో స్టీమ్ రైస్ పంపిణీ.. దేశంలోనే తొలిసారి ఏపీలోని ఈ జిల్లాలో అమలు
Kakinada Pilot Project
Rajashekher G
|

Updated on: Jul 28, 2026 | 8:55 PM

Share

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా అందిస్తున్న బియ్యాన్ని ప్రజలు పూర్తిగా వినియోగించకపోవడానికి గల కారణాలపై పౌర సరఫరాల శాఖ సమగ్ర అధ్యయనం నిర్వహించింది. ప్రతి కిలోపై రూ.56 వరకు రాయితీ ఇస్తున్నప్పటికీ వినియోగం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతేనని గుర్తించినట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలు ఎక్కువగా ఇష్టపడే స్టీమ్ రైస్ అందిస్తే వినియోగం పెరగడంతో పాటు బియ్యం పక్కదారి పట్టకుండా ఉంటుందని చెప్పారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసిన సందర్భంగా ఆంధ్ర భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇప్పటికే రాష్ట్రంలోని 42 వేల పాఠశాలలు, 4 వేల వసతి గృహాల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద స్టీమ్ రైస్‌ను విజయవంతంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ విధానాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ అమలు చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ప్రతిపాదించగా సానుకూల స్పందన లభించిందన్నారు.

కాకినాడ జిల్లాతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం

దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో పిడిఎస్ ద్వారా స్టీమ్ రైస్ పంపిణీకి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాలో రేషన్ కార్డుదారులు, పాఠశాలలు, హాస్టళ్ల అవసరాల కోసం నెలకు సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుందని అంచనా వేశారు. పైలట్ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. అలాగే కేంద్రం అదనంగా 20 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ధాన్యం సేకరణకు అంగీకరించిందని, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని చెప్పారు.

‘మీ మార్ట్’లు, తక్కువ ధరకు బియ్యం

ఈ త్రైమాసికంలో రాష్ట్రవ్యాప్తంగా 1,000 ‘మీ మార్ట్’లను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్‌సీసీఎఫ్‌తో ఒప్పందం కుదిరిందని, ఈ మార్టుల్లో సుమారు 70 రకాల నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయని చెప్పారు. ఆగస్టు 1 నుంచి 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక అవుట్‌లెట్లలో బీపీటీ స్టీమ్ రైస్‌ను కిలో రూ.52కు, గ్రేడ్-1 రా రైస్‌ను రూ.50కు విక్రయించనున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో స్వర్ణ రకం బియ్యాన్ని కూడా రైతు బజార్ల ద్వారా రూ.40కే అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ప్రతి రేషన్ కార్డుదారుడికి 500 గ్రాముల కందిపప్పు అందించే ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు.

ఆర్‌ఎఫ్‌ఐడీ, డిజిటల్ వాలెట్ పైలట్లు

బియ్యం ప్యాకింగ్ నుంచి వినియోగదారుడి వరకు పూర్తి ట్రాకింగ్ కోసం క్యూఆర్ కోడ్‌కు బదులుగా ఆర్‌ఎఫ్‌ఐడీ విధానాన్ని కాకినాడ జిల్లాలో పైలట్‌గా అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే సీబీడీసీ ఆధారిత డిజిటల్ వాలెట్ విధానాన్ని ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ విధానం వల్ల ప్రజలకు రాయితీ నేరుగా అందడంతో పాటు రేషన్ డీలర్ల కమిషన్‌కు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు పాల్గొన్నారు.

Follow Us