Andhra Pradesh: ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వితే బయటపడ్డ వింత జీవి.. ఏంటో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
రైతు పొలంలో ఇంటి నిర్మాణం కోసం తవ్విన గోతిలోకి దిగి చూసిన కుటుంబం ఒక్కసారిగా షాక్ అయ్యింది. ముంగిసలా కనిపిస్తున్నా ఒళ్లంతా గట్టి పొలుసులతో వింతగా ఉన్న ఓ జీవి అక్కడ దాక్కుని ఉంది. దాన్ని చూడగానే ఊరంతా గుమిగూడింది. అసలు ఆ గోతిలో దొరికిన ఆ వింత జంతువు ఏంటి? అంతరించిపోతున్న ఆ అరుదైన వన్యప్రాణిని చూసి అటవీ అధికారులు ఎందుకు అంతగా అప్రమత్తమయ్యారు? అనే విషయాలు తెలుసుకుదాం..

అనకాపల్లి జిల్లాలోని ఓ గ్రామం.. ఓ రైతు కుటుంబం తమ పొలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించింది.. నిర్మాణ పనుల్లో భాగంగా వాష్ రూమ్ కోసం ఒక గోతిని తీశారు కార్మికులు. సాయంత్రం అయింది.. పనులు ముగించుకొని ఎవరికి వారు వెళ్లిపోయారు. అయితే మొదటి రోజు.. అక్కడికి వచ్చి చూసిన ఆ కుటుంబానికి నిర్మాణం కోసం తీసిన గోతిలో ఓ జంతువు కనిపించింది. చూసేందుకు ముంగిసలా అనిపిస్తున్నా.. దాని శరీర నిర్మాణం చూసి భయపడ్డారు. విషయం ఆ నోట ఈనోటా పాకడంతో జనం చూసినందుకు తరలివచ్చారు. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన అడవి జంతువు గుర్తించి.. అటవీ అధికారులకు సమాచారం అందించారు. అలుగుగా గుర్తించి సేఫ్ గా రెస్క్యూ చేసి సంరక్షించారు. అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం గొల్లలపాలెం గ్రామంలో వెంప సుబ్బరాజు అనే రైతు పొలంలో ఈ దృశ్యం కనిపించింది. సుబ్బరాజు.. పొలంలో ఇంటి నిర్మాణం కోసం బాత్రూం గొయ్యి తీసారు. తీసారు. అందులో ఈ అరుదైన ఆల్చిప్ప గా పిలిచే అలుగు కనిపించింది. తొలుత చూసి భయపడి ఆ తర్వాత.. దాన్ని సంరక్షించాలని భావించారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వన్యప్రాణులను పట్టే నేర్పరి అయిన వెంకటేష్‌కు అటవీ అధికారులు విషయాన్ని చెప్పారు. రంగంలోకి దిగిన వెంకటేష్.. అక్కడకు చేరుకుని.. చాకచక్యంగా ఆ అలుగును రెస్క్యూ చేశాడు. అటవీ అధికారుల సమక్షంలో సమీపంలోని అడవుల్లో దాన్ని విడిచి పెట్టారు.
అంతరించిపోతున్న అలుగు..
అలుగు అనేది పొలుసులు కలిగిన ఒక అరుదైన నిశాచర క్షీరద జంతువు. రాత్రిపూట మాత్రమే సంచరిస్తూ ఉంటుంది. చీమలు చెదపురుగులే దీని ఆహారం. అడవుల్లో చీమలు పురుగుల నియంత్రించి జీవవైవిద్యంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. అలుగు శరీరం మొత్తం కెరాటిన్‌తో తయారైన గట్టి రక్షణ పొలుసులతో కప్పబడి ఉంటుంది. శత్రువులు దాడికి వస్తే బంతిలా చుట్టుకునే స్వభావం కలది. వీటికి దంతాలు ఉండవు. పొడవైన, జిగటైన నాలుక సహాయంతో చీమలను, చెదపురుగులను తింటాయి.
పిరికి జీవి
అలుగు చాలా పిరికి స్వభావం గల జీవి. పగటిపూట భూమిలో బొరియలు చేసుకుని పడుకుని, రాత్రి పూట ఆహారం కోసం వెతుకుతాయి. ఈ పంగోలిన్ ప్రస్తుతం అక్రమ వేట, అక్రమ రవాణా కారణంగా తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. సంప్రదాయ వైద్యం, మందుల తయారీలో వీటి పొలుసులకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో వేటగాళ్లు వీటిని వేటాడుతున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం అలుగును వేటాడటం, రవాణా చేయడం లేదా విక్రయించడం తీవ్రమైన నేరం. అయితే మాంసం, పొలుసుల కోసం అక్రమ వేట సాగుతుండటంతో వీటి సంఖ్య తగ్గుతోంది. ఈ జంతువు కనిపించినప్పుడు దానిని పట్టుకోవడం, గాయపరచడం లేదా ఇంట్లో ఉంచడం చేయకుండా సమాచారం ఇవ్వాలని అడవి శాఖ అధికారులు.
