మామిడి రైతులకు బీమా భరోసా.. ఎకరాకు రూ.35 వేల రక్షణ! ఎలా అప్లై చేయాలంటే..?
మామిడి రైతులకు ప్రభుత్వం బీమా భరోసా కల్పిస్తోంది. 2026-27 సంవత్సరానికి పంటల బీమా పథకం కింద ఎకరాకు రూ.35 వేల వరకు రక్షణ పొందే అవకాశం కల్పించింది. రైతులు రూ.1,650 నుంచి రూ.2,250 వరకు ప్రీమియం చెల్లించి బీమా పొందవచ్చు. ..

మామిడి సాగులో పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయంలో వాతావరణం దెబ్బకు నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. అకాల వర్షాలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు, బలమైన గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మామిడి తోటలను కాపాడేందుకు 2026-27 సంవత్సరానికి పంటల బీమా పథకాలను అమల్లోకి తెచ్చింది. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పరిధిలో మామిడి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తక్కువ ప్రీమియం.. ఎక్కువ భరోసా
ఈ పథకం కింద మామిడి రైతులు ఎకరాకు గరిష్ఠంగా రూ.35,000 వరకు బీమా రక్షణ పొందవచ్చు. ఇందుకోసం రైతులు తమ వాటాగా ఎకరాకు రూ.1,650 నుంచి రూ.2,250 వరకు ప్రీమియం చెల్లించాలి. సగటున రూ.1,750 ప్రీమియంతో పంటకు బీమా రక్షణ పొందే అవకాశం ఉంది. బీమా నిబంధనలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితుల వల్ల పంటకు నష్టం వాటిల్లినప్పుడు అర్హులైన రైతులకు పరిహారం అందుతుంది.
ఏ సమయంలో ఎలాంటి నష్టాలకు బీమా రక్షణ?
మామిడి పంటకు సంబంధించి వేర్వేరు వాతావరణ పరిస్థితులకు ప్రత్యేక కాలపరిమితులను నిర్ణయించారు. అకాల వర్షాలు, అధిక వర్షపాతం వల్ల కలిగే నష్టాలకు 2026 డిసెంబర్ 15 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు బీమా వర్తిస్తుంది. ఇదే సమయంలో తెగుళ్లు, చీడపీడలు వ్యాప్తి చెందడానికి అనుకూలించే వాతావరణ పరిస్థితులనూ బీమా పరిధిలోకి తీసుకొచ్చారు.
ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక హెచ్చుతగ్గుల కారణంగా మామిడి పంటకు కలిగే నష్టాలకు 2027 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు బీమా రక్షణ ఉంటుంది. ఇక అధిక వేగంతో వీచే గాలుల వల్ల తోటలకు నష్టం వాటిల్లితే మార్చి 1 నుంచి మే 31, 2027 వరకు నిర్ణయించిన కాలపరిమితిలో బీమా వర్తిస్తుంది.
బీమా పథకంలో చేరాలనుకునే రైతులు డిసెంబర్ 31, 2026లోగా నమోదు చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత అవకాశం ఉండకపోవచ్చని, అర్హులైన మామిడి సాగుదారులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ఉద్యాన శాఖ సూచిస్తోంది.
మూడు మార్గాల్లో నమోదు
రైతులు తమకు అనుకూలమైన మార్గంలో బీమా నమోదు చేసుకోవచ్చు.
– మొబైల్ యాప్: ‘PMFBY Crop Insurance Farmer’ యాప్ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
– సేవా కేంద్రాలు: కామన్ సర్వీస్ సెంటర్లు (CSC), సంబంధిత బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అధీకృత బీమా ప్రతినిధుల ద్వారా నమోదు చేసుకోవచ్చు.
– ప్రభుత్వ సేవలు: గ్రామ, మండల ఉద్యాన శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సహాయకులను సంప్రదించి దరఖాస్తు చేయవచ్చు.
ఈ పత్రాలు సిద్ధం చేసుకోండి
దరఖాస్తు సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి:
1. ఆధార్ కార్డు ప్రతితో పాటు
2. బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన పాస్‌బుక్ జిరాక్స్
3. భూమి పాస్‌బుక్ లేదా 1-బీ నకలు
4. మామిడి పంట సాగు చేస్తున్నట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం
5. కౌలు రైతులైతే కౌలు గుర్తింపు పత్రం
6. మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో
పంట నష్టం జరిగిన తర్వాత ఇబ్బందులు పడే బదులు, ముందుగానే బీమా పరిధిలోకి వెళ్తే రైతులకు మేలు చేకూరుతుంది..
