Andhra Pradesh: ఏపీలో పల్లె పోరుకు రంగం సిద్ధం.. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు ముగిసిన ప్రచారం..
ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మైకులు మూగబోవడంతో, అధికారులు నవంబర్ 26న జరగనున్న పోలింగ్, కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే సమయంలో పలు పట్టణ సంస్థల్లో జరిగిన డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

ఓవైపు పంచాయతీతో పాటు మున్సిపాలిటీ ఎన్నికలకు ఏర్పాట్లు.. మరోవైపు నామినేషన్ల స్క్రూటినీలు.. ఇంకోవైపు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎన్నికలతో ఏపీలో ఎటు చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. పట్టణాలు, పల్లెల్లో ఎలక్షన్ల గురించే చర్చ నడుస్తోంది. భారీగా నామినేషన్లు పడటంతో పల్లె పోరు మరింత రసవత్తరంగా మారబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నవంబర్ 26న పోలింగ్ జరగనుండటంతో… ఎన్నికల నిబంధనల ప్రకారం మైకులు మూగబోయాయి. తొలి విడతలో రాష్ట్రంలోని 201 మండలాల పరిధిలోని 3 వేల 949 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ రాగా.. అందులో 758 సర్పంచ్ స్థానాలు, 14వేల 727 వార్డు సభ్యుల స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3వేల 191 సర్పంచ్ స్థానాలకు, 25వేల 61 వార్డు స్థానాలకు ఈ నెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు వాయిదా పడిన పట్టణ సంస్థల్లో డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త పాలకవర్గంతో ప్రమాణస్వీకార కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అయితే.. కొన్ని చోట్ల కొంత గందరగోళ పరిస్థితులు కనిపించాయి. కడప జిల్లా రాజంపేటలో నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎన్నిక జరిగింది. టీడీపీ పరిశీలకులుగా వచ్చిన దీపక్ రెడ్డి, ప్రసాద్ బాబు, ప్రవీణ్ రెడ్డి విప్ జారీ చేసే క్రమంలో కౌన్సిలర్లు వాదనకు దిగారు. ప్రవీణ్ రెడ్డిని టీడీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. వైస్ చైర్మన్‌గా దొంతం శివప్రసాద్ కావాలంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపు గందరగోళం తర్వాత వివాదం సద్దుమణిగింది. వైస్ చైర్‌పర్స్‌న్‌గా శబ్రీన్‌కు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు కూటమి నేతలు.
అటు అనంతపురంలో బీజేపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. అనంత మేయర్ రమేష్‌గౌడ్, నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ ఓటర్ స్లిప్‌లు తయారు చేశారనీ, దాదాపు 12 వేల ఓట్లు దొంగ ఓట్లు తయారు చేశారనీ బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ ఆరోపించారు. వైసీపీ అక్రమాలపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామన్నారు.
