AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరణశిక్ష విధించినా తగ్గేదేలే.. ఢాకాకు తిరిగొస్తా..!

Sheik Hasina: అరెస్ట్‌ ఆ పై మరణశిక్ష తప్పదంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు.. భారత్ ఆమెను అప్పగించాలంటూ ఒత్తిడి! ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 16న ఢాకాకు చేరుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్ విమానాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. మరణశిక్ష ఎదుర్కొంటున్న నాయకురాలు స్వయంగా స్వదేశానికి వస్తానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

మరణశిక్ష విధించినా తగ్గేదేలే.. ఢాకాకు తిరిగొస్తా..!
Sheikh Hasina Defies Death Sentence Announces Return To Bangladesh
Sharada V
|

Updated on: Nov 24, 2026 | 9:39 PM

Share

Sheik Hasina:  బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నాయకురాలిగా కొనసాగిన షేక్ హసీనా 2024లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఆందోళనలు చెలరేగడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్న ఆమె అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. రెండేళ్లకు పైగా సమయం గడిచిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లాలని హసీనా నిర్ణయించారు. ఆగస్టు 5, 2024న బంగ్లాదేశ్ విమానంలోనే హసీనా భారత్‌కు వచ్చారని, ఇప్పుడు అదే విధంగా ఢిల్లీ నుంచి ఢాకాకు వెళ్లేందుకు బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఏర్పాటు చేయాలని ఆమె అధికార ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ కోరారు.

డిసెంబర్ 16నే ఎందుకు ఎంచుకున్నారు?

హసీనా తన స్వదేశానికి తిరిగి వచ్చేందుకు డిసెంబర్ 16 తేదీని ఎంచుకోవడం వెనక ఆ రోజు బంగ్లాదేశ్ విజయ దినోత్సవం కావడం కారణం. 1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందిన సందర్భంగా ప్రతి ఏడాది డిసెంబర్ 16న అక్కడ విజయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఆమె ప్రయాణానికి పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారత్‌కు వచ్చిన తర్వాత అక్కడి ప్రభుత్వం ఆమె పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డును రద్దు చేసింది. దీంతో తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ పత్రాల సమస్య ఏర్పడింది.

ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు హసీనా తరఫున లండన్‌కు చెందిన న్యాయ సంస్థ మ్యాట్రిక్స్ ఛాంబర్స్ రంగంలోకి దిగింది. నవంబర్ 9న న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను సంప్రదించి కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరింది. హసీనాకు కొత్త ప్రయాణ పత్రాలు జారీ చేయడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం సుముఖంగా లేదని తెలిసింది.

అప్పగింత ఒప్పందం ప్రకారమే రావాలంటున్న ఢాకా!

హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే భారత్‌ను అధికారికంగా కోరింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారమే ఆమె స్వదేశానికి రావాలని ఢాకా ప్రభుత్వం చెబుతోంది. ఈ అభ్యర్థనను భారత అధికారులు తగిన న్యాయ ప్రక్రియ ప్రకారం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మరణశిక్ష తీర్పు.. బంగ్లాదేశ్‌ తిరిగొస్తే అరెస్టు తప్పదా?

హసీనా స్వదేశానికి రావాలనుకుంటున్న సమయంలో ఆమె ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు మరణశిక్ష తీర్పు. 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. 2024లో విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు జరిగిన హింసాత్మక చర్యల్లో ఆమె పాత్ర ఉందని, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని పేర్కొంటూ ఈ తీర్పు ఇచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలను హసీనా ఖండించారు. ఈ విచారణ రాజకీయ కక్షతో సాగిందని, తీర్పు కూడా రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. హసీనా దేశంలో అడుగుపెడితే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని అక్కడి మంత్రి స్పష్టం చేశారు.

1,400 మంది మరణం

2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థుల ఉద్యమం, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం హింసలో 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరణశిక్ష తీర్పు ఎదుర్కొంటున్న ఆమె స్వయంగా స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించడం బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త ఉత్కంఠకు తెరలేపింది. డిసెంబర్ 16న ఆమె ఢాకాకు చేరుకుంటారా? బంగ్లాదేశ్ ప్రభుత్వం విమాన ఏర్పాట్లకు అంగీకరిస్తుందా? ఒకవేళ తిరిగొస్తే అరెస్టు చేస్తారా? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. హసీనా ప్రకటనతో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అప్పగింత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Follow Us