AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూసీ నుంచి మెట్రో వరకు.. భాగ్యనగరానికి మహార్ధశ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు !

హైదరాబాద్:మహానగర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, మిరాలం చెరువు అభివృద్ధి, ఆధునిక గోశాల, PRTS వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

మూసీ నుంచి మెట్రో వరకు.. భాగ్యనగరానికి మహార్ధశ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు !
Cm Revanth Reddy
Balaraju Goud
|

Updated on: Nov 24, 2026 | 10:37 PM

Share

హైదరాబాద్: మహానగర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, మిరాలం చెరువు అభివృద్ధి, ఆధునిక గోశాల, PRTS వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జనవరి 2027లో మూసీ పనులు ప్రారంభం

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఫేజ్-1 పనులను 2027 జనవరిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1ఏగా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల ప్రాంతాన్ని జోన్-1బీగా విభజించి పనులు చేపట్టనున్నారు. పనుల విషయంలో వేగం పెంచి నిర్ణీత సమయంలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు.

మిరాలం చెరువుకు కొత్త రూపు

మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనులపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టును 2028 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. చెరువు అభివృద్ధితో పాటు ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు.

హైదరాబాద్‌లో PRTSకు ప్రణాళికలు సిద్ధం!

నగరంలో పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ఫేజ్-1కు సంబంధించిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. కూకట్‌పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయోడైవర్సిటీ వరకు ఒక అలైన్‌మెంట్‌ను, బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సచివాలయం, బషీర్‌బాగ్ మీదుగా రాణీగంజ్ వరకు మరో అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించారు. నెక్లెస్‌రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో డిపోల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించి సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. డిపోల వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనులపైనా సమీక్ష

గండిపేటలో నిర్మిస్తున్న ఆధునిక గోశాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. మార్కెట్‌కు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు సమాంతర రహదారుల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలన్నారు.

సైబరాబాద్ పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి డిజైన్లను పరిశీలించిన సీఎం, అక్కడ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్యూర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ఎస్టీపీల నిర్మాణం, మెట్ల బావుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్‌ఎండీఏ, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఇతర పట్టణాభివృద్ధి సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తంగా హైదరాబాద్‌ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడంతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us