AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ విద్యార్థుల ఘనత.. సైనికుల కోసం అద్భుత ఆవిష్కరణ..

ఒకవైపు ఇంజినీరింగ్ క్లాసులు, పరీక్షల హడావుడి.. మరోవైపు దేశ రక్షణ రంగానికి అండగా నిలిచే అద్భుత ఆవిష్కరణ.. హైదరాబాద్ బిట్స్ పిలానీలో చదువుతున్న నలుగురు థర్డ్ ఇయర్ విద్యార్థులు క్రాత్‌వీల్ పేరుతో డిఫెన్స్ టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. సెల్ టవర్లు, శాటిలైట్ సిగ్నల్స్ అస్సలు లేని మారుమూల సరిహద్దుల్లోనూ సైనికులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా టరికొత్త పరికరాన్ని రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Hyderabad: హైదరాబాద్ విద్యార్థుల ఘనత.. సైనికుల కోసం అద్భుత ఆవిష్కరణ..
Bits Hyderabad Students Build Off Grid Army Comms Gear
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Nov 24, 2026 | 7:39 PM

Share

కాలేజ్ చదువులు, హాస్టల్ లైఫ్‌తో గడిపే వయసులో దేశ రక్షణ రంగానికి ఉపయోగపడే ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు హైదరాబాద్ బిట్స్ పిలానీ విద్యార్థులు. థర్డ్ ఇయర్ చదువుతున్న సమర్థ్ అలోక్ శ్రీవాస్తవ తన స్నేహితులతో కలిసి క్రాత్‌వీల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డిఫెన్స్ టెక్నాలజీ స్టార్టప్‌ను ప్రారంభించాడు. సైనికులు నెట్‌వర్క్ సదుపాయాలు లేని ప్రాంతాల్లోనూ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకునేలా సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. డ్రోన్ల కమ్యూనికేషన్ వ్యవస్థలపై పనిచేస్తున్న సమయంలో సైనికులు ఎదుర్కొంటున్న కమ్యూనికేషన్ సమస్యను సమర్థ్ గుర్తించాడు. మొబైల్ టవర్లు, శాటిలైట్ కనెక్షన్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో సైనికులు సమాచారాన్ని ఎలా పంచుకుంటారనే ఆలోచనతో ఈ ప్రాజెక్టును ప్రారంభించాడు. ఇందుకోసం సైనికులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నాడు. ఈ క్రమంలో క్రాత్ కంట్రోల్ అనే చిన్న రేడియో పరికరాన్ని రూపొందించారు. 180 గ్రాముల కంటే తక్కువ బరువుండే ఈ పరికరాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించుకోవచ్చు. ఇది ఇతర పరికరాలతో కలిసి ఎన్‌క్రిప్టెడ్ మెష్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. తద్వారా వాయిస్, డేటా, లొకేషన్ వివరాలను పరస్పరం పంచుకోవచ్చు. టీమ్ సభ్యులు ఎక్కడ ఉన్నారు? శత్రువులు ఏ ప్రాంతంలో ఉన్నారు? వంటి సమాచారాన్ని మ్యాప్‌లో గుర్తించే సదుపాయం కూడా ఇందులో ఉంది.

ఈ టెక్నాలజీలో ప్రత్యేకత సెల్ఫ్ హీలింగ్ మెష్ నెట్‌వర్క్. ఒక పరికరం పనిచేయకపోయినా మిగిలిన పరికరాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమాచారాన్ని చేరవేయగలవు. దీంతో ఒక కనెక్షన్ దెబ్బతిన్నా మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోదు. అయితే దీని సామర్థ్యం, పరిధిని నిర్ధారించేందుకు మరిన్ని ఫీల్డ్ టెస్టులు నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి విదేశీ పరికరాల ధర ఒక్కొక్కటి సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని సమర్థ్ తెలిపాడు. తమ పరికరాన్ని అన్ని పరీక్షలు, అవసరమైన ప్రమాణాల తర్వాత రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్య అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించాడు. తొలి ప్రోటోటైప్ తయారీకి రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం మూడు హ్యాండ్‌హెల్డ్ యూనిట్లతో పాటు డ్రోన్‌కు అమర్చే మరో రిలే యూనిట్‌ను కూడా సిద్ధం చేశారు.

తమ టెక్నాలజీని ఇప్పటికే రెండు భారత ఆర్మీ యూనిట్లు, ఆర్మీ డిఫెన్స్ కాలేజీలో ప్రదర్శించారు. అక్కడి నుంచి సానుకూల స్పందనతో పాటు కొన్ని సూచనలు కూడా వచ్చాయి. పరికరం అవుట్‌పుట్ పవర్‌ను ఒక వాట్‌కు పెంచాలని, యాంటెన్నాలను మెరుగుపరచాలని సూచించారు. ఈ మార్పులతో మరో రెండు మూడు నెలల్లో కొత్త వెర్షన్‌ను సిద్ధం చేయాలని టీమ్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ పరికరం ప్రోటోటైప్ దశలోనే ఉంది. అధికారిక సర్టిఫికేషన్ ఇంకా పొందాల్సి ఉంది. ఈ స్టార్టప్‌లో సమర్థ్‌తో పాటు అతడి బ్యాచ్‌మేట్ శ్రేష్ఠ్ ప్రకాశ్ సింగ్ కో-ఫౌండర్‌గా ఉన్నాడు. దర్శన్ భండారీ, సారిక రేవిత్సర్ కూడా టీమ్‌లో పనిచేస్తున్నారు. ఈ నలుగురూ బిట్స్ హైదరాబాద్‌లో మూడో సంవత్సరం విద్యార్థులే. హాస్టల్ గదుల నుంచే ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ పనులు కొనసాగిస్తున్నారు.

ఒకవైపు ఇంజినీరింగ్ క్లాసులు, మరోవైపు స్టార్టప్ పనులతో సమయం సరిపోవడం లేదని సమర్థ్ చెబుతున్నాడు. కొన్నిసార్లు రోజుకు 12 నుంచి 16 గంటల పాటు పనిచేయాల్సి వస్తోందని వెల్లడించాడు. ప్రారంభ పెట్టుబడులను తన పొదుపు నుంచి సమకూర్చుకోగా, స్నేహితులు, తల్లిదండ్రులు కూడా సహకరించారు.

రాబోయే పదేళ్లలో తమ టెక్నాలజీ భారత సైనికుల చేతుల్లో ఉండాలని, దేశ రక్షణ రంగ కమ్యూనికేషన్ వ్యవస్థలో కీలక భాగం కావాలని సమర్థ్ ఆశిస్తున్నాడు. కాలేజ్ హాస్టల్‌లో మొదలైన ఓ ఆలోచన.. దేశ రక్షణ రంగానికి ఉపయోగపడే ఆవిష్కరణగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. చదువుతో పాటు కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టాలనుకునే యువతకు ఈ నలుగురి ప్రయత్నం మంచి ఉదాహరణగా నిలుస్తోంది.

Follow Us