AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృత్యు కూపంగా మారిన సెప్టిక్ ట్యాంక్.. ఊపిరాడక ముగ్గురు యువకుల దుర్మరణం!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న దీపక్ హారీక్ అపార్ట్‌మెంట్‌లోని డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ అందులో పడి ముగ్గురు యువ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించారు.

మృత్యు కూపంగా మారిన సెప్టిక్ ట్యాంక్.. ఊపిరాడక ముగ్గురు యువకుల దుర్మరణం!
Septic Tank
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 24, 2026 | 4:31 PM

Share

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న దీపక్ హారీక్ అపార్ట్‌మెంట్‌లోని డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ అందులో పడి ముగ్గురు యువ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కంపెనీలో పనిచేస్తున్న సుమన్ (24), సురేష్ (25), పవన్ (25)లుగా గుర్తించారు. ఎప్పటిలాగే అపార్ట్‌మెంట్‌లో పారిశుద్ధ్య పనుల నిమిత్తం వచ్చిన వీరు, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ప్రక్రియలో భాగంగా లోపలికి దిగడంతో ఈ ఊహించని దుర్ఘటన జరిగింది.

ట్యాంక్ లోపల పేరుకుపోయిన విష వాయువుల కారణంగా ఊపిరాడక ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు లోపలికి దిగడం వల్లే ఈ ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. తోటి సిబ్బంది మరియు అపార్ట్మెంట్ వాసులు గమనించి వారిని బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే విష వాయువుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు యువ కార్మికులు ఇలా అకాల మరణం చెందడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.

సమాచారం అందుకున్న వెంటనే బాచుపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సంబంధిత క్లీనింగ్ కంపెనీ మరియు అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us