AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పూజలు చేస్తే డబ్బులు డబుల్ అవుతాయన్నారు.. 10 రోజుల తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే..

కష్టపడకుండా డబ్బులు రెట్టింపు చేసుకోవాలన్న అత్యాశ అమాయకుల కొంపముంచుతోంది. పూజలు, మంత్రాలతో అదృష్టం మారుతుందని నమ్మించి.. చేతిలో చిల్డ్రన్ బ్యాంక్ నోట్లు పెట్టి లక్షలు దోచేస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఉట్నూరు పోలీసులు రట్టు చేశారు. ఇప్పటికే 40 మందికి పైగా బాధితులు ఈ గ్యాంగ్ వలలో చిక్కినట్లు తెలుస్తోంది. అసలు వీరు ఎలా మోసం చేస్తారో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Telangana: పూజలు చేస్తే డబ్బులు డబుల్ అవుతాయన్నారు.. 10 రోజుల తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే..
Adilabad Fake Currency Gang Busted
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 24, 2026 | 2:58 PM

Share

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రతంత్రాలు, పూజల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ముఠాల వ్యవహారం కలకలం రేపుతోంది. నిన్నటికి నిన్న పూజల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి మోసాల గుట్టు రట్టు చేశారు. ఈ ఘటన మరువకముందే.. తాజాగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను అసలైన కరెన్సీగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న మరో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు అరెస్టు కాగా.. ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే మరో కేసులో పోలీసుల అదుపులో ఉన్నారు. వరుస ఘటనలతో మంత్రాల ముసుగులో సాగుతున్న మోసాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

రూ.6.50 లక్షలు ఇస్తే.. రూ.13 లక్షలు ఇస్తామంటూ నమ్మకం

మంచిర్యాల జిల్లాకు చెందిన పత్తి రాములుకు 2023లో అత్రం పరశురామ్ పరిచయమయ్యాడు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న పరశురామ్.. పూజలు, మంత్రతంత్రాలతో డబ్బులు రెట్టింపు చేయవచ్చంటూ నమ్మించాడు. రూ.6.50 లక్షలు ఇస్తే పూజలు చేసి రూ.13 లక్షలు తిరిగి ఇస్తానని ఆశ చూపించాడు. దీంతో బాధితుడు షాంపూర్ శివారులో అతడికి డబ్బులు అందించాడు. అనంతరం పొలం వద్దకు తీసుకెళ్లి పూజలు చేసినట్లు నటించి.. డబ్బులు రెట్టింపు అయ్యాయని చెబుతూ ఓ బ్యాగు చేతిలో పెట్టాడు. పది రోజుల తర్వాత తెరవాలని చెప్పాడు. తీరా బ్యాగు తెరిచి చూస్తే అందులో కనిపించింది అసలు కరెన్సీ కాదు.. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లు, తెల్ల కాగితాలు. మోసపోయానని గుర్తించిన బాధితుడిని మరోసారి పూజల పేరుతో నమ్మించి మరిన్ని డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇలా మొత్తం రూ.8 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదు అందింది.

అసలు నోట్ల మధ్యలో నకిలీ కట్టలు.. ఇదీ మోసం చేసే స్టైల్

ఈ ముఠా మోసాల తీరు కూడా ఆసక్తికరంగా ఉంది. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను ఇతరుల నుంచి కొనుగోలు చేసి.. వాటిని అసలైన కరెన్సీ కట్టల మాదిరిగా తయారు చేస్తున్నారు. కట్టకు పైన, కింద అసలైన కరెన్సీ నోట్లను ఉంచి.. మధ్యలో నకిలీ నోట్లను అమర్చి అమాయకులకు చూపిస్తున్నారు. కట్ట మొత్తం అసలైన డబ్బేనని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులైన అత్రం పరశురామ్, మండలి బక్కన్నలకు మరో నలుగురు సహకరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

99 కట్టలు.. 100 నకిలీ బంగారు నాణేలు స్వాధీనం

ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన ఉట్నూరు పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.500 ముఖ విలువతో ముద్రించిన 34 కట్టలు, రూ.100 ముఖ విలువతో 55 కట్టలు, రూ.2 వేల ముఖ విలువతో 10 కట్టలు.. మొత్తంగా 99 కట్టల చిల్డ్రన్ బ్యాంక్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. వీటితో పాటు 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులపై ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లోనూ పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

ఒకే ముఠా.. అనేక మోసాలు.. బాధితులు 40 మంది వరకు!

ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులైన అత్రం పరశురామ్, మండలి బక్కన్నలు ఇప్పటికే ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులో అరెస్టయ్యారు. తాజాగా మరో నలుగురు పోలీసులకు చిక్కారు. ఈ ముఠా చేతిలో సుమారు 40 మంది వరకు బాధితులు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి మోసాలకు గురైన వారు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.

మొత్తానికి డబ్బులు రెట్టింపు చేస్తామనే ఆశ.. అమాయకులకు కష్టాలను మిగులుస్తోంది. మంత్రతంత్రాల పేరుతో ఒకవైపు.. నకిలీ కరెన్సీ కట్టల పేరుతో మరోవైపు.. ప్రజల ఆశలను పెట్టుబడిగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. డబ్బులు ఊరికే రెట్టింపు కావు.. పూజలతో అదృష్టం మారదు.. అనే వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అత్యాశకు పోయి సంపాదించిన సొమ్మును పోగొట్టుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Follow Us
పూజలు చేస్తే డబ్బులు డబుల్ అవుతాయన్నారు.. 10 రోజుల తర్వాత..
పూజలు చేస్తే డబ్బులు డబుల్ అవుతాయన్నారు.. 10 రోజుల తర్వాత..
పాము విషానికి ప్రతీక.. మరి వైద్యానికి చిహ్నంగా ఎలా మారింది?
పాము విషానికి ప్రతీక.. మరి వైద్యానికి చిహ్నంగా ఎలా మారింది?
సెంచరీతో టీమిండియా బౌలర్ల తాట తీసిన యూఏఈ బ్యాటర్
సెంచరీతో టీమిండియా బౌలర్ల తాట తీసిన యూఏఈ బ్యాటర్
హీరోయిన్‌కు కథ చెప్తూ చనిపోయిన టాలీవుడ్ దర్శకుడు..
హీరోయిన్‌కు కథ చెప్తూ చనిపోయిన టాలీవుడ్ దర్శకుడు..
ఉయ్యాల ఊగితే ఇన్ని లాభాలా.. పెద్దలు కూడా తప్పక ప్రయత్నించాల్సిందే
ఉయ్యాల ఊగితే ఇన్ని లాభాలా.. పెద్దలు కూడా తప్పక ప్రయత్నించాల్సిందే
చలికాలంలో బద్దకంలేకుండా చురుగ్గా ఉండాలా.. ఇంట్లోనే ఇలా చేయండి
చలికాలంలో బద్దకంలేకుండా చురుగ్గా ఉండాలా.. ఇంట్లోనే ఇలా చేయండి
రక్తంతో లేఖలు.. హీరోయిన్ బికినీతో ఇంటికే వచ్చిన వ్యక్తి..
రక్తంతో లేఖలు.. హీరోయిన్ బికినీతో ఇంటికే వచ్చిన వ్యక్తి..
జియో న్యూ ఇయర్ బొనాంజా.. రూ.399కే అన్‌లిమిటెడ్ డేటా, ఫ్రీ OTTలు !
జియో న్యూ ఇయర్ బొనాంజా.. రూ.399కే అన్‌లిమిటెడ్ డేటా, ఫ్రీ OTTలు !
ఏపీకి వర్ష సూచన.. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి
ఏపీకి వర్ష సూచన.. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి
కేవలం 1 రూపాయి కోసం కోర్టుకెక్కిన మహిళ.. అసలేం జరిగిందంటే..!
కేవలం 1 రూపాయి కోసం కోర్టుకెక్కిన మహిళ.. అసలేం జరిగిందంటే..!