Telangana: అటెండర్ దుర్మరణం.. తీవ్ర భావోద్వేగానికి గురైన మాజీ సీఎం కేసీఆర్..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ సీఎం కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్‌రెడ్డి అలియాస్ మణికుమార్‌రెడ్డితో పాటు మరో యువకుడు మృతి చెందారు. ఈ విషాద ఘటనపై కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణికుమార్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్‌రెడ్డి అలియాస్ మణికుమార్‌రెడ్డితో పాటు మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తన వద్ద పనిచేసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న విషయం తెలుసుకున్న కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మణికుమార్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వెంకయ్యకుంట సమీపంలో రాత్రి సమయంలో ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న మణికుమార్‌రెడ్డి తీవ్ర గాయాలతో స్పాట్‌లో ప్రాణాలు విడిచారు. మరో యువకుడు భరత్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో భరత్ కూడా మృతి చెందాడు. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో కొన్నేళ్లుగా అటెండర్‌గా పనిచేస్తున్న మణికుమార్‌రెడ్డి మరణవార్త మాజీ ముఖ్యమంత్రిని కలచివేసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే కేసీఆర్ ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావుకు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మణికుమార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మణికుమార్ తమ కుటుంబంలో ఒకరిగా మెలిగేవారని కేసీఆర్, ఆయన సతీమణి శోభ పేర్కొన్నారు. ఆయన అకాల మరణం తమను తీవ్రంగా బాధించిందని విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా మణికుమార్ మృతికి సంతాపం తెలిపారు. మణికుమార్ అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించాలని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ జనగామ శరత్‌రావులకు కేసీఆర్ సూచించారు.
మరోవైపు, ప్రమాదంలో మృతిచెందిన మణికుమార్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఒకే ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించడంతో బంధనకల్ పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
