AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇందుపల్లి కాదది.. ‘విందుపల్లి’.. పెద్ద ఉద్యోగాలు వదిలేసి మరీ వంటల వైపు..

ఆ ఊరు నిండా నలభీములే.. అవును.. ఇందుపల్లి కాదది.. విందుపల్లి. ఊరు ఊరంతా నలభీములే. అక్కడి వంటలకు, వాటి రుచులకు ఫ్లాటవనివాళ్లే లేరంటే నమ్మండి.

Andhra Pradesh: ఇందుపల్లి కాదది.. 'విందుపల్లి'.. పెద్ద ఉద్యోగాలు వదిలేసి మరీ వంటల వైపు..
Indupalle
Shiva Prajapati
|

Updated on: Oct 31, 2022 | 11:02 PM

Share

ఆ ఊరు నిండా నలభీములే.. అవును.. ఇందుపల్లి కాదది.. విందుపల్లి. ఊరు ఊరంతా నలభీములే. అక్కడి వంటలకు, వాటి రుచులకు ఫ్లాటవనివాళ్లే లేరంటే నమ్మండి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిన ఇందుపల్లి వంటలన్నలు ఏ విధంగా ఇంత ఫేమస్సయ్యారు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్ని కూడా వదిలిపెట్టి.. ఇందుపల్లి వంటగదుల్లో సెటిలైన యువకుల మనోభావాలేంటి? తెలుసుకోవాలంటే.. విందుపల్లి స్టోరీ తెలుసుకోవాల్సిందే..

సాధారణంగా ఎక్కడికైనా టూర్‌కి వెళుతుంటే.. మనం ముందుగా అడిగే మాట.. అక్కడ స్పెషల్‌ ఏంటని.. ఎందుకంటే.. ఎవ్వరైనా సరే అక్కడ స్పెషల్‌ రుచి చూడాలి.. నలుగురికి చెప్పాలని…!! తాపేశ్వరం కాజా.. ఆత్రేయపురం పూతరేకులు, తాటితాండ్ర.. కాకినాడ కాజా, బెల్లం పాకం గారెలు.. మాడుగుల హల్వా.. బందరు లడ్డూ, రాయలసీమ ఉగ్గాణి.. రాజమండ్రి సోంపాపిడి ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రుచులెన్నో.. కానీ కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో వంటలన్నలు చేసే ప్రతీ ఐటమ్ ఫేమస్సే. ఇందుపల్లి వంటగాళ్ళు భలే భలే వంటకాలు చేస్తారు. లక్షమందికి సైతం క్షణాల్లో వండి వార్చగల నలభీములు ఉన్నారు ఈ ఊళ్లో. 410 గడపల్లో 2,500 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1400మంది వంట చేసే వాళ్లే. అంటే.. ప్రతీ ముగ్గురిలో ఒకరు గరిటె తిప్పేవాళ్లన్న మాట. ఉన్నత చదువులు మానేసి.. ఉన్నత ఉద్యోగాలు వదిలేసి.. ఎంతోమంది వంటల వైపు వచ్చారు.

ప్రముఖుల ఇళ్లలో వంటకాలు..

ఇందుపల్లి.. విందుపల్లిగా మారిందంటే అది వడ్డాణపు కోటేశ్వరరావు ఘనతే. మొదట్లో ఓ ఇంట్లో అనుకోకుండా వంటమనిషిగా చేరాడు. టేస్టీ టేస్టీ వంటకాలు చేయడంతో అందరి నోళ్లలో నానాడు. అదే క్రమంలో ఎన్టీఆర్‌ ఓ ఫంక్షన్‌కి వంటకాలకు సంబంధించి ఆరాతీస్తుండగా.. కోటేశ్వరరావు పేరును రిఫర్ చేశారు కొంతమంది. కోటేశ్వరరావు చేసిన వంటల రుచి చూసి ఫుల్ ఫిదా అయ్యారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత పర్మినెంట్‌గా ఎన్టీఆర్‌ ఇంట్లో కోటేశ్వరరావు కుక్‌గా మారిపోయారు. అంతేకాదూ అప్పట్లో సీపీఐ జాతీయ సభలకు కూడా కోటేశ్వరరావు ఒంటి చేత్తో వంటలు చేసేవారు.

ఇవి కూడా చదవండి

మారిపోయిన బడుగు బలహీన వర్గాల జీవితం..

కులవృత్తిని నమ్ముకుని కష్టమైనా ఇష్టపడుతూ పనిచేసేవారిని ఎంతోమందిని చూస్తుంటాం. కానీ వంట చేయడమే ప్రధాన వృత్తిగా మలచుకున్నారు ఈ ఊళ్లో చాలామంది. కోటేశ్వరరావును స్ఫూర్తిగా తీసుకుని వంటలవైపు మళ్లారు. ఇప్పుడు వాళ్ల జీవితమే మారిపోయింది. ఒకప్పుడు పూరిగుడిసెలో ఉండే వాళ్లు ఇప్పుడు బంగ్లాల్లో ఉంటున్నారు. కార్లలో తిరుగుతున్నారు. గరిటె విప్లవంతో బడుగు బలహీన వర్గాలు ఉన్నతంగా జీవిస్తున్నారు.

ఇందుపల్లి వంటకాల సువాసన 13 రాష్ట్రాలకు పాకింది. అన్నప్రాసన దగ్గర్నుంచి రాజకీయ పార్టీల ప్లినరీల వరకు తమ వంటతో అద్భుతః అనిపిస్తున్నారు ఇక్కడి వంట మేస్త్రీలు. వెజ్‌, నాన్‌వెజ్‌లో అద్భుత పాక ప్రావీణ్యంతో అదరగొట్టేస్తున్నారు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన యువకులు కూడా వంటల వైపు వచ్చారు. వెరైటీ వంటకాలు చేస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

ఇందుపల్లి అంటే ఒకప్పుడు ఎవరూ గుర్తుపట్టే వారు కాదు. కానీ ఇప్పుడు నలభీములకి కేరాఫ్‌గా మారిపోయింది. ఇందుపల్లి పేరెత్తితే చాలూ ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసే పరిస్థితి. ఫంక్షన్‌ చిన్నదైనా పెద్దదైనా టెస్టీ ఫుడ్‌ కావాలంటే ఇందుపల్లిని ప్రిఫర్‌ చేయడం కామన్‌గా మారిపోయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..