Persimmons: ఇండియాస్ సూపర్ ఫుడ్.. గుండె ఆరోగ్యం టు షుగర్ కంట్రోల్ అన్నింటికీ ఇదే పరిష్కారం!
కరోనా తర్వాత నుంచి ప్రపంచంలోని అందరి దృష్టి ఆరోగ్యంవైపునకు మళ్లింది. ఫుడ్, లైఫ్‌స్టైల్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యానికి మంచిది అని తెలిస్తేనే దానిని తినడానికి ఇష్టపడుతున్నారు. అదే సమయంలో విటమిన్, క్వాలిటీ ఫుడ్‌పై ఎక్కువ ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు ..

ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక పండు పేరు విపరీతంగా వినిపిస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ప్రతి ఇన్ ఫ్లుయెన్సర్ ఈ పండుతో రకరకాల రెసిపీలు చేస్తూ, దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఊదరగొడుతున్నారు. మొదట్లో ఇది కేవలం ఒక ట్రెండ్ అని అందరూ అనుకున్నారు. కానీ వైద్య నిపుణులు మాత్రం దీనిని తక్కువగా అంచనా వేయలేమని చెబుతున్నారు. భారతదేశపు తదుపరి ‘సూపర్ ఫ్రూట్’ గా ఇది ఎదగబోతోందని అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో ‘టెండూ’ పండుగా పిలుస్తున్న ఈ పర్సిమన్స్ లో ఉన్న ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
పోషకాల గని – పర్సిమన్స్..
పర్సిమన్స్ పండులో కేవలం ఒక రకమైన విటమిన్ మాత్రమే కాదు.. విటమిన్ ఏ, సి, ఇ, మరియు కె వంటి కీలకమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. డాక్టర్ వత్స తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, ఈ పండులో కరిగే మరియు కరగని పీచు పదార్థం (ఫైబర్) అరుదైన కలయికలో ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలను అందిస్తూనే, జీవక్రియను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అనవసరమైన హంగామా ఏమీ లేకుండానే అత్యున్నతమైన పోషకాలను అందించే శక్తి ఈ పండుకు ఉంది.
గుండెకు రక్షణ కవచం..
ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, పర్సిమన్స్ ఒక వరప్రసాదంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ మన రక్తనాళాలను రక్షిస్తాయి. ఇవి శరీరంలోని ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకునే వారు ఈ పండును తమ డైట్ లో భాగం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం.
షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు..
మధుమేహంతో బాధపడేవారు పండ్లు తినడానికి భయపడుతుంటారు. అయితే పర్సిమన్స్ పండులోని ఫైబర్ కంటెంట్ గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటుంది. ఇది మెటబాలిక్ ఫ్రెండ్లీ పండుగా గుర్తింపు పొందింది. అలాగే ఇందులో ఉండే టానిన్లు, పాలీఫెనాల్స్ శరీరంలో కలిగే స్వల్ప వాపులను తగ్గిస్తాయి. అయితే ఈ పండును అతిగా తీసుకుంటే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది, కాబట్టి పరిమితంగా తీసుకోవడమే మంచిది.
మన చుట్టూనే ఉన్నా చాలామంది గుర్తించని అద్భుతమైన సూపర్ ఫుడ్ ఈ పర్సిమన్స్. ఇది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన మందు కూడా. ఆధునిక పోషకాహార అవసరాలకు తగ్గట్టుగా అన్ని రకాల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.
