స్టీల్ vs ప్లాస్టిక్ vs గ్లాస్.. ఏ టిఫిన్ బాక్స్ ఆరోగ్యానికి మంచిది..?
మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి సరైన టిఫిన్ బాక్స్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ప్లాస్టిక్ బాక్స్‌లు హానికరమైన రసాయనాలను విడుదల చేసి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. కాబట్టి మంచి టిఫిన్ బాక్సులు ఎంచుకోవడం బెటర్. స్టీల్, గాజు, ఇత్తడి బాక్స్‌లలో ఏది మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలని పోషకాలున్న ఆహారాన్ని వండుకుంటాం. కానీ ఆ ఆహారాన్ని దేనిలో తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని మాత్రం పట్టించుకోం. మార్కెట్‌లో దొరికే రంగురంగుల డిజైన్లు, తక్కువ ధర చూసి మనం ఎంచుకునే టిఫిన్ బాక్స్‌లు మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాజు, ఇత్తడి, స్టీల్, ప్లాస్టిక్.. వీటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
స్టీల్ టిఫిన్
సాధారణంగా భారతీయ ఇళ్లలో ఎక్కువగా కనిపించే స్టీల్ టిఫిన్లే అత్యంత సురక్షితమైనవి. ఇవి రసాయన రహితం, మన్నికైనవి, తేలికగా ఉంటాయి. ఆహారం రుచిని, పోషకాలను ఇవి మార్చవు. వీటిని మైక్రోవేవ్‌లో పెట్టలేము. ద్రవ పదార్థాల కోసం లీక్-ప్రూఫ్ మూతలు ఉన్న వాటినే ఎంచుకోవాలి. స్కూలుకు వెళ్లే పిల్లలకు, ఆఫీసులకు వెళ్లే వారికి ఇది అత్యంత ఉత్తమమైన ఎంపిక.
గ్లాస్ టిఫిన్
ఆధునిక జీవనశైలిలో గాజు టిఫిన్ల వినియోగం పెరుగుతోంది. గాజు రసాయన రహితమైనది. ఆహారం వాసన రాకుండా ఉంటుంది. ఆఫీసుల్లో నేరుగా మైక్రోవేవ్‌లో వేడి చేసుకోవడానికి ఇది వీలుగా ఉంటుంది. ఇవి బరువుగా ఉంటాయి. కింద పడితే విరిగిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా వాడగలిగే పెద్దలకు, ఆఫీసు ఉద్యోగులకు ఇది మంచిది.
ఇత్తడి టిఫిన్
పాత కాలంలో ఇత్తడి పాత్రలనే వాడేవారు. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఇత్తడిలో ఆహారం ఉంచడం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాలు అందుతాయి. ఇది బాక్టీరియా పెరగకుండా చూస్తుంది. నిమ్మకాయ, టమోటా వంటి ఆమ్ల ఆహారాలతో ఇత్తడి ప్రతిచర్య జరుపుతుంది. అలాగే వీటిని శుభ్రం చేయడం, మెరిసేలా చూసుకోవడం కాస్త కష్టమైన పని. ఇంట్లో ఉండేవారికి, చిన్న ప్రయాణాలు చేసే వారికి ఇది అనుకూలం.
ప్లాస్టిక్ టిఫిన్
చౌకగా దొరుకుతాయని ప్లాస్టిక్ బాక్సుల వైపు వెళ్లడం ఆరోగ్యానికి చేటు. బరువు తక్కువ, రంగురంగుల డిజైన్లలో లభిస్తాయి. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్‌లో ఉంచినప్పుడు అది హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. అత్యవసరమైతే తప్ప ప్లాస్టిక్ వాడకపోవడమే మంచిది.
నిపుణుల సూచనలు
ప్లాస్టిక్ తప్పనిసరి అయితే అది BPA-రహిత, ఫుడ్ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగి ఉందో లేదో చూడండి. ద్రవ పదార్థాలు కారిపోకుండా ఉండేలా నాణ్యమైన సీలింగ్ ఉన్న బాక్సులను ఎంచుకోండి. ప్రతిరోజూ బాక్స్‌ను, దాని రబ్బర్ గ్రిప్పులను పూర్తిగా శుభ్రం చేయాలి. మన ఆరోగ్యం మనం తినే ఆహారం మీదే కాదు, ఆ ఆహారాన్ని ఉంచే పాత్ర మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ప్లాస్టిక్‌కు దూరంగా ఉండి స్టీల్ లేదా గాజు పాత్రలను ఎంచుకోవడమే తెలివైన పని.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




