పళ్ల మధ్య గ్యాప్ ఉంటే అదృష్టమా.. జ్యోతిష్యశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా..?
Gap in Teeth: నవ్వినప్పుడు పళ్ల మధ్య ఖాళీ కనిపిస్తుందని చాలామంది మొహమాటపడతారు. ఆ ఖాళీని పూడ్చుకోవడానికి డెంటిస్టుల దగ్గర వేల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆ ఖాళీ మీ అందాన్ని తగ్గించే లోపం కాదు, మీ అదృష్టాన్ని పెంచే వరం. అవును నిజం.. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా చాలా మంది తమ పళ్ల మధ్య ఖాళీలు ఉండటం వల్ల నవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. అది తమ అందాన్ని తగ్గిస్తుందని భావించి, డెంటిస్టుల చుట్టూ తిరుగుతూ క్లిప్పులు పెట్టించుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం, సాముద్రిక శాస్త్రం ప్రకారం.. దంతాల మధ్య ఖాళీ ఉండటం అనేది లోపం కాదు.. అదొక గొప్ప వరం అని మీకు తెలుసా? ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణం ఉంటే వారు చాలా అదృష్టవంతులని శాస్త్రాలు చెబుతున్నాయి.
అత్యంత తెలివైన వారు
జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ముందు దంతాల మధ్య అంతరం ఉన్న అమ్మాయిలు చాలా తెలివైన వారు. వీరికి గ్రహణ శక్తి చాలా ఎక్కువ. ఎంతటి సంక్లిష్టమైన సమస్యనైనా చాలా చాకచక్యంగా పరిష్కరించగలరు. వీరి తెలివితేటలే సమాజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడతాయి. వృత్తిపరంగా వీరు తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. ఏదైనా పనిని చేపడితే అది పూర్తయ్యే వరకు వదలని పట్టుదల వీరి సొంతం. అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా, లక్ష్యం వైపు దూసుకుపోతారు. కార్యాలయాల్లో ఉన్నత పదవులు పొందే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది.
అడుగు పెట్టిన చోట సంపద వర్షం
ఆర్థిక పరంగా చూస్తే పళ్ల మధ్య ఖాళీని సంపదకు సంకేతంగా భావిస్తారు. పెళ్లికి ముందు పుట్టింట్లో సంతోషాన్ని నింపుతారు. పెళ్లి తర్వాత అత్తమామల ఇంట్లో అడుగుపెట్టగానే అక్కడ ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. వీరిని మహాలక్ష్మి అవతారంగా భావించవచ్చు.
మాటకారితనం వీరి ఆయుధం
వీరి వాక్చాతుర్యం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది. తమ స్పష్టమైన ఆలోచనలను, అభిప్రాయాలను ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడంలో వీరు దిట్ట. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు వీరి విజయానికి ప్రధాన కారణం అవుతాయి.
సుఖమయమైన కుటుంబ జీవితం
కుటుంబం, ఆరోగ్యం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. తన భర్తను అర్థం చేసుకోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. దీనివల్ల కుటుంబంలో శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. వీరు మితాహారాన్ని తీసుకుంటారని, తమ ఫిట్‌నెస్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారని సాముద్రిక శాస్త్రం చెబుతోంది.
మీ దంతాల మధ్య ఖాళీ ఉంటే అభద్రతా భావానికి గురికావాల్సిన అవసరం లేదు. శాస్త్రాల ప్రకారం.. అది మీ ఉన్నత వ్యక్తిత్వానికి, ఉజ్వల భవిష్యత్తుకు ఒక సంకేతం. కాబట్టి ఆ ఖాళీని చూసి గర్వపడండి.. మనస్ఫూర్తిగా నవ్వండి!
(గమనిక: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య, సాముద్రిక శాస్త్ర నిపుణుల అభిప్రాయాలు, నమ్మకాలపై ఆధారపడి ఇవ్వబడింది. దీనిని కేవలం సమాచారం కోసమే చదవగలరు. దీనిని TV9 ధృవీకరించడం లేదు.)




