AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాగి పాత్రలో నీళ్లు అమృతమా? విషమా? గ్లాస్ బాటిల్స్‌లోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయా? అసలు నిజాలు ఇవే!

ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో మనం తాగే నీటి కంటే, ఆ నీటిని దేనిలో నిల్వ చేస్తున్నాం అనే అంశంపైనే అందరూ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పటి నుండి, అందరి చూపు రాగి మరియు గాజు బాటిల్స్ వైపు మళ్లింది.

రాగి పాత్రలో నీళ్లు అమృతమా? విషమా? గ్లాస్ బాటిల్స్‌లోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయా? అసలు నిజాలు ఇవే!
Copper And Glass Bottles
Nikhil
|

Updated on: Jan 06, 2026 | 11:44 PM

Share

కొందరు రాగి పాత్రల్లో నీళ్లు తాగితే సర్వరోగ నివారిణి అని నమ్ముతుంటే, మరికొందరు గాజు బాటిల్స్ అత్యంత సురక్షితమని భావిస్తారు. అయితే, ఈ రెండింటిలోనూ మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. రాగి బాటిల్స్ బ్యాక్టీరియాను చంపగలవు కానీ అవి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. అలాగే గాజు బాటిల్స్ రసాయన రహితమని అనుకుంటాం కానీ, వాటి మూతల్లో మైక్రో ప్లాస్టిక్స్ దాగి ఉండవచ్చు.

రాగి బాటిల్స్- ప్రకృతి సిద్ధమైన ప్యూరిఫైయర్

రాగి పాత్రలకు బ్యాక్టీరియాను, వైరస్‌లను చంపే శక్తి ఉందని సైన్స్ నిరూపించింది. రాగి అయాన్లు సూక్ష్మజీవుల కణ త్వచాలను ఛేదించడం ద్వారా వాటిని అంతం చేస్తాయి. దాదాపు 16 గంటల పాటు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిలో ఈ-కోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకర వ్యాధికారక క్రిములు నశిస్తాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో కలుషిత నీటిని శుద్ధి చేయడానికి రాగి బాటిల్స్ ఒక సులభమైన మార్గం.

ఆరోగ్య ప్రయోజనాలు

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం రాగి నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఎంజైమ్ల పనితీరుకు, కొల్లాజెన్ ఉత్పత్తికి రాగి ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత వంటివి రాకుండా కాపాడుతుంది. అయితే, రాగి నీరు తాగితే త్వరగా బరువు తగ్గుతారని లేదా గుండె జబ్బులు నయమవుతాయని చెప్పడానికి పూర్తిస్థాయి ఆధారాలు లేవని పరిశోధకులు చెబుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదాలు..

రాగి పాత్రలను సరిగ్గా వాడకపోతే అది విషపూరితంగా మారుతుంది. ముఖ్యంగా నిమ్మరసం, పండ్ల రసాలు లేదా వేడి పానీయాలను రాగి బాటిల్స్ లో అస్సలు పోయకూడదు. దీనివల్ల రాగి అధికంగా నీటిలో కలిసిపోయి వికారం, కడుపు తిమ్మిర్లు, వాంతులు, విరేచనాలకు దారి తీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన 2 మి.గ్రా/లి పరిమితి కంటే ఎక్కువ రాగి శరీరంలోకి చేరితే కాలేయం, కిడ్నీలపై ప్రభావం పడుతుంది. అందుకే రోజుకు 200-300 మి.లీ కంటే ఎక్కువ రాగి నీరు తాగకపోవడం మంచిది.

గాజు బాటిల్స్- స్వచ్ఛతకు మారుపేరు

గాజు బాటిల్స్ నీటితో ఎలాంటి చర్య జరపవు, కాబట్టి నీటి సహజ రుచి మారదు. ఇందులో BPA లేదా థాలెట్స్ వంటి హానికర రసాయనాలు ఉండవు. వేడి టీ లేదా చల్లని పానీయాలకైనా గాజు పాత్రలు అత్యంత సురక్షితం. వీటిని సులభంగా స్టెరిలైజ్ చేయవచ్చు. అయితే, గాజు బాటిల్స్ మూతలకు వాడే ప్లాస్టిక్ వల్ల మైక్రో ప్లాస్టిక్స్ నీటిలోకి చేరే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని నివారించడానికి మెటల్ లేదా సిలికాన్ మూతలు ఉన్న బాటిల్స్ ఎంచుకోవాలి.

సరైన బాటిల్ ఎంపిక ఎలా?

మీరు అడవుల్లోకి ట్రెకింగ్‌కు వెళ్తున్నప్పుడు లేదా నీటి శుద్ధతపై అనుమానం ఉన్నప్పుడు రాగి బాటిల్ వాడటం ఉత్తమం. కానీ ఇంట్లో రోజువారీ అవసరాలకు గాజు బాటిల్స్ శ్రేయస్కరం. రాగి బాటిల్ కొనేటప్పుడు అది 99.9% స్వచ్ఛమైనదో కాదో చూసుకోవాలి. అలాగే ఏ బాటిల్ వాడినా దానిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ముఖ్యం. రాగి మరియు గాజు.. ఈ రెండూ ప్లాస్టిక్ కంటే ఎంతో మేలైనవి. అయితే మీ జీవనశైలికి ఏది అవసరమో చూసుకుని ఎంచుకోవాలి.