మద్యం మత్తు ఎంత పని చేసిందయ్యా.. మొత్తం కుటుంబాన్ని చిదిమేసింది..!
మద్యం మహమ్మారి ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తాగి వచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భార్య హత్యచేసేలా పురిగొల్పింది. తల్లి పడుతున్న హింసలను చూసి తట్టుకోలేక తండ్రి హత్యలో కూతురు కూడా పాలుపంచుకోవడం అత్యంత విషాదకర సన్నివేశం. మార్కాపురం జిల్లా దంతరపల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దంతరపల్లె గ్రామంలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త హరిని భార్య లక్ష్మి, వారి కూతురు జోత్స్నతో కలిసి హతమార్చింది. రాత్రి మద్యం సేవించి వచ్చిన హరి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. మాటామాట పెరిగి ఈ గొడవ ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో భర్త తమను చంపేస్తాడన్న భయంతో కత్తి, రాడుతో హతమార్చి తల్లీకూతుళ్ళు పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
30 సంవత్సరాల క్రితం దంతరపల్లె గ్రామానికి చెందిన లక్ష్మికి, హరికి వివాహం అయింది. వీరికి కుమార్తె జోత్స్న, కొడుకు హరీష్ ఉన్నారు. మద్యానికి బానిసగా మారిన హరి తరచూ భార్యతో గొడవలు పడుతున్నాడు. భార్యాభర్తలకు తరచూ గొడవలు అవుతుండడంతో భర్త హరి 10 సంవత్సరాల క్రితం నెల్లూరు వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన హరి, రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి వచ్చి, మరోసారి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..