Andhra: పేకాట ఆడేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్.. హైకోర్టు సంచలన ఆదేశాలు..
పేకాట ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్లు వేసిన మూడు క్లబ్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. డబ్బులకు పేకాట ఆడటానికి వీల్లేదని, అలా ఆడితే కేసులు నమోదు చేయాల్సిందే అని తెలిపింది. ఇంతకూ పిటిషన్ వేసిన క్లబ్‌ల వాదన ఏంటి..? హైకోర్టు ఇచ్చిన స్పష్టత ఏంటి..? అనేది కథనంలో తెలుసుకోండి..

ఏపీలోని పలు జిల్లాల్లో మూడు ముక్కలు ఆరు ఆటలు అన్నట్టుగా సాగిపోతుంటుంది పేకాట వ్యవహారం.. స్థానిక నేతల నుండి కూడా అండదండలు ఉండడంతో ఈ వ్యవహారంపై చూసిచూడనట్టు వ్యవహారిస్తుంటారు పోలీసులు. అయితే పేకాట క్లబ్బులపై ఇటీవల విమర్శలు పెరగడంతో యాక్షన్‌లోకి దిగిన పోలీసులు..పలుక్లబ్‌లతో పాటు పేకాట రాయుళ్లపై కూడా కేసులు నమోదు చేశారు. దీంతో 13 కార్డ్స్‌కు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్ క్లబ్, నర్సాపురం యూత్ క్లబ్. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. డబ్బులు పందెంగా పెట్టి కార్డ్స్ ఆడటం చట్ట విరుద్ధమని స్పష్టం చేసిన న్యాయస్థానం..క్లబ్‌ల విజ్ఞప్తిని తిరస్కరించింది. క్లబ్‌ల తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా 13 కార్డ్స్ రమ్మీకి అనుమతి ఇవ్వాలని వాదనలు వినిపించారు.
అయితే, విచారణ అనంతరం హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డబ్బులకు పేకాట ఆడటానికి వీల్లేదని, అలా ఆడితే అది గాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద చట్టవిరుద్ధ చర్యగా పరిగణించి కేసులు నమోదు చేయాల్సిందే అని తెలిపింది. ఇటీవల కూడా ఇలాంటి కేసుల్లో ఇదే తరహా ఆదేశాలు ఇచ్చాం అని బెంచ్ గుర్తుచేసింది.
ఇప్పటికే నూజివీడు మాంగో బే క్లబ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు గతంలో స్పష్టత ఇచ్చింది. 13 కార్డ్స్ రమ్మీని డబ్బులకు ఆడొద్దు, ఆడితే గాంబ్లింగ్ యాక్ట్ 3, 4 కింద చర్యలు తీసుకోవాలి అని జిల్లా పోలీస్, యంత్రాంగానికి అప్పుడే ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టు పేర్కొంది.
లేటెస్ట్ విచారణలోనూ ఈ మూడు క్లబ్‌ల పిటిషన్ల విషయంలో కూడా అదే చట్టపరమైన నియమాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. పేకాటను డబ్బులకు ఆడేందుకు చట్టబద్ధత ఇవ్వాలని చూసిన ప్రయత్నానికి కోర్టు తీర్పుతో బ్రేక్ పడింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
