చుట్టూ ఆకుపచ్చ అందాలు.. భూగర్భాన బడబాగ్ని.. రహస్య తవ్వకాల మర్మమేంటి?
ఓఎన్జీసీ ఆస్తుల విలువ అక్షరాలా 7 లక్షల 80వేల కోట్ల రూపాయలు. అంత పెద్ద కంపెనీ, వేల కోట్ల బడ్జెట్ ఉన్న కంపెనీ.. ప్రమాదాలు జరక్కుండా శాశ్వత చర్యలు తీసుకోలేకపోతోందా? పాశర్లపూడి బ్లో ఔట్ జరిగి 30 ఏళ్లైంది. ఇప్పటికి కూడా బ్లో ఔట్స్ జరక్కుండా టెక్నాలజీని తీసుకురాలేకపోయింది. ఇరుసుమండ ప్రమాదం మనుషులు లేని ప్రాంతంలో జరిగింది కాబట్టి సరిపోయింది. లేదంటే.. ఊహించని ప్రమాదమే జరిగేదిగా..! ప్రాణనష్టం జరిగి ఉంటే ఎవరిది రెస్పాన్సిబులిటీ..?

బ్లో ఔట్.. కోనసీమ వాసులకు ఇప్పుడు బాగా అలవాటైన పదం. అలాగని ఎప్పుడూ జరిగేదే కదా అనే తేలిగ్గా తీసుకోవడమేం ఉండదు. పాశర్లపూడి బ్లో ఔట్ ఒక పెను ప్రమాదమే కావొచ్చు. కాని, మూడు నెలల పాటు అదో టూరిస్ట్ స్పాట్‌గా మారింది. 2014లో నగరం ఘటన జరిగేంత వరకు బ్లో ఔట్ ఓ పీడకలగా మారుతుందనే సంగతే తెలీదు. ఆనాడు ఇళ్లల్లో ఉన్నవాళ్లు సైతం.. ఒంటి మీద బట్టలు కాలిపోయి, రాలుతున్న చర్మంతో వీధుల్లో హాహాకారాలు పెడుతూ పరిగెత్తిన భయానక దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఆ సమయంలో ఒళ్లంతా కాలిపోయిన చంటి బిడ్డను ఎక్కడ పట్టుకోవాలో, ఎలా ముట్టుకోవాలో కూడా తెలియలేదు. గుక్కపట్టి ఏడుస్తుంటే కన్నీటిని తుడుద్దామన్నా చర్మం ఊడి వస్తుందేమోననిపించింది. బిడ్డలను ఒడిలో పెట్టుకుని పడుతున్న తల్లులు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు. అంతటి ఘోరకలిని మిగిల్చింది బ్లో బౌట్. అప్పటి నుంచి బ్లో ఔట్ కాదు గ్యాస్ లీక్ అని వినిపించినా సరే.. గుండె జారిపోతోంది ఒక్కొక్కరికి. ఈ బ్లో ఔట్స్, గ్యాస్ లీక్స్ తరచుగా జరగడానికి మరో కారణం ఏంటో తెలుసా..? సీక్రసీ. ఆయిల్ అండ్ గ్యాస్ తవ్వకాల వెనక పాటిస్తున్న రహస్యాలు కూడా ప్రమాదానికి కారణమవుతున్నాయి. అంతేకాదు.. ఏదో ఒకనాడు కోనసీమ మొత్తం భూమిలోకి కుంగిపోవడానికి కూడా ఈ తవ్వకాలే కారణం కాబోతున్నాయి. ‘ఏముందిలే.. భూమిలోని గ్యాస్, ఆయిల్‌ను పైపులు పెట్టి తీసుకెళ్తున్నారు’ అనే...
