Andhra Pradesh: ఛీ నీచుడా.. నువ్వేం తండ్రివిరా.. కన్న కూతురిపైనే దారుణంగా..
చిత్తూరు జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణం జరిగింది. పెద్దపంజాణి మండలంలో కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడో కసాయి తండ్రి. నూతన సంవత్సరం వేళ జరిగిన ఈ అమానుష ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే..?

రక్షించాల్సిన తండ్రే భక్షకుడయ్యాడు. నూతన సంవత్సర వేడుకల వేళ కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడి మృగంగా మారాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపంజాణి మండలం పెద్ద బూరుగుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పెద్దబ్బ అనే వ్యక్తికి 12 ఏళ్ల కూతురు ఉంది. భార్య వదిలేసి వెళ్లిపోవడంతో పెద్దబ్బ రెండో పెళ్లి చేసుకుని అదే గ్రామంలో వేరుగా ఉంటున్నాడు. మైనర్ బాలిక తన నానమ్మ వద్ద ఉంటూ పెరుగుతోంది.
జనవరి 1న న్యూఇయర్ సందర్భంగా కూతురిని చూసేందుకు పెద్దబ్బ నానమ్మ ఇంటికి వచ్చాడు. తండ్రి వచ్చాడన్న సంతోషంతో ఆ బాలిక దగ్గరకు వెళ్లగా, మద్యం మత్తులో ఉన్నాడో లేక కీచక బుద్ధి పుట్టిందో గానీ ఆ కసాయి తండ్రి బాలికను బలవంతంగా ఇంటి వెనుక ఉన్న మామిడి తోటలోకి లాక్కెళ్లాడు. అడ్డువచ్చిన తన కన్న తల్లిని విచక్షణారహితంగా కొట్టి, మామిడి తోటలోని ఒక బండరాయి వద్ద బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
పోలీసుల రంగప్రవేశం
బాలిక కేకలు విని నానమ్మ అక్కడికి చేరుకునేలోపే నిందితుడు పారిపోయాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పెద్దపంజాణి పోలీసులు రంగంలోకి దిగారు. పలమనేరు రూరల్ సీఐ పరశురాముడు నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు పెద్దబ్బను రాయలపేట – పలమనేరు రోడ్డులోని గుత్తివారిపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు
నిందితుడిపై సెక్సువల్ అఫెండర్ షీట్ కూడా ఓపెన్ చేసినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. సమాజంలో ఇటువంటి నేరస్థులకు భయం కలగాలనే ఉద్దేశంతో పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరపరిచారు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్‌లో ఉన్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




