AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బు జమ.. మంత్రి కీలక ప్రకటన

ఏపీలో ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఆయన ధాన్యం సేకరణ పురోగతిని, గత ప్రభుత్వ బకాయిల చెల్లింపులను వివరించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త సంస్కరణల గురించి కీలక విషయాలు చెప్పారు.

Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బు జమ.. మంత్రి కీలక ప్రకటన
Paddy Procurement Payments Within 24 Hours
Krishna S
|

Updated on: Jan 05, 2026 | 9:55 PM

Share

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన పలు ధాన్యం సేకరణ కేంద్రాలు, గోదాములు మరియు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సుమారు 6 లక్షల మంది రైతులకు రూ. 9,300 కోట్లు కేవలం 24 గంటల వ్యవధిలోనే చెల్లించామని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రూ. 1,674 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పూర్తిగా చెల్లించిందని మంత్రి నాదేండ్ల గుర్తుచేశారు. గార మండలం రామచంద్రాపురంలో రైతులతో ముఖాముఖి మాట్లాడగా, కొందరికి కేవలం 4 గంటల్లోనే డబ్బులు జమ అయ్యాయని రైతులు తెలపడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తరుగు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని మిల్లర్లను ఆదేశించారు.

కొత్త పథకాలు – సంస్కరణలు:

  • రైతులకు ఉచితంగా తార్పాలిన్ల పంపిణీ.
  • పట్టణాల్లో ప్రయోగాత్మకంగా రూ. 20కే కిలో గోధుమపిండి సరఫరా
  • 34 వేల పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ.
  • రేషన్ తీసుకునేందుకు 15 రోజుల పాటు ఎప్పుడైనా వెసులుబాటు కల్పించడం.

శ్రీకాకుళం జిల్లాలో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గానూ ఇప్పటికే 5 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయిందని, రైతులకు రూ. 1,200 కోట్లు అందజేశామని మంత్రి నాదేండ్ల వివరించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 34 వేల పాఠశాలలు, 4వేల సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్ కృషితో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతున్నాయని కొనియాడారు.

ఇవి కూడా చదవండి