AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయట అన్నపూర్ణలా పేరు తెచ్చుకున్న సూర్యకాంతంను చివరి చూపు చూడాలని ఎవరికీ అనిపించలేదా..?

తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న మహానటి సూర్యకాంతం జీవితం కేవలం గయ్యాళి పాత్రలకే పరిమితం కాదు. ఆమె వ్యక్తిత్వం, దానగుణం, కళాభిమానం ఎందరికో ఆదర్శం. మా అమ్మ తర్వాత అమ్మలాంటిది అని జయలలిత ఆప్యాయంగా చెప్పుకున్నారు. షూటింగ్ ప్రదేశాల్లో సహనటులందరికీ స్వయంగా వండిన రుచికరమైన వంటకాలు వడ్డించేవారు. వంటల్లో ఆమె నైపుణ్యం ఎంతగా ఉండేదంటే ఒక వంటల పుస్తకం కూడా రాశారు.

బయట అన్నపూర్ణలా పేరు తెచ్చుకున్న సూర్యకాంతంను చివరి చూపు చూడాలని ఎవరికీ అనిపించలేదా..?
Suryakaantam
Ram Naramaneni
|

Updated on: Mar 12, 2026 | 1:01 PM

Share

తెలుగు చిత్రసీమలో గయ్యాళి అత్త పాత్రకు జీవం పోసిన మహానటి సూర్యకాంతం జీవితం, తెరపై కనిపించే ఆమె పాత్రలకు పూర్తి భిన్నంగా అనేక ఆసక్తికర, అనూహ్య కోణాలతో నిండి ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్వయంగా “మా అమ్మ తర్వాత అమ్మలాంటిది” అని చెప్పిన మాటలు సూర్యకాంతం వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ కంటతడి పెట్టని జయలలిత.. సూర్యకాంతమ్మ గురించి చెబుతూ కన్నీరు పెట్టుకోవడం ఆమె పట్ల జయలలితకు ఉన్న అపారమైన ప్రేమను, గౌరవాన్ని తెలియజేస్తుంది. సూర్యకాంతం షూటింగ్ ప్రదేశానికి ఇంట్లో రకరకాల వంటలు స్వయంగా వండి తెచ్చి, తోటి నటీనటులందరికీ కొసరికొసరి వడ్డించే మహాతల్లి. జయలలితకు ఆమె పులిహోర, మసాలా వడలు అంటే చాలా ఇష్టమని, ఆమె షూటింగ్ ఉందని తెలిస్తే లంచ్ టైంకి అక్కడికి వెళ్ళేదాన్నని చిన్నపిల్లలా చెప్పేవారు.

వందలాది చిత్రాలలో ఒకే రకం గయ్యాళి పాత్రలను పోషించి, అయినా సరే ప్రేక్షకులను మెప్పించిన ఏకైక నటి ఆమె. తమకు గిట్టని వాళ్లకు “అమ్మో ఆవిడ సూర్యకాంతం రా బాబు” అని పేరు పెట్టే విధంగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు. ఆమె తెరమీద కనిపిస్తే చాలు, ఆమెది గయ్యాళి వేషమని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యేవారు. అందుకే విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి “సూర్యకాంతం అని పెట్టుకున్న తర్వాత ఆమె గయ్యాళిది అని ప్రేక్షకులకు అర్థం అవుతుంది. మళ్లీ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకయ్యా ఫిల్మ్ దండగ” అనేవారట. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ఆమెను ఆల్సేషన్ డాగ్ అని ఆప్యాయంగా పిలవగా, దానికి ఆమె “ఏదో లేండి ఆ కుక్కలాగే మీలాగే ఎంతో విశ్వాసంతో ఉంటున్నాను” అని సమాధానమిచ్చేవారు. ప్రతి ఏటా తొలి రోజు ఉదయాన్నే దుక్కిపాటి ఇంటికి వెళ్లి దబాయించి 101 రూపాయలు అడిగి తీసుకునే సెంటిమెంట్ ఆమెది. దుక్కిపాటి, చక్రపాణి వంటి పెద్ద సంస్థల నిర్మించిన ప్రతి సినిమాలోనూ ఆమెకు తప్పకుండా వేషం ఉండేది. అలాగే భానుమతి, బాపు-రమణలు వంటి ప్రముఖులు సూర్యకాంతంను అమితంగా అభిమానించేవారు. ముళ్ళపూడి వెంకటరమణ, బాపులను ఆమె “అన్నదాతలు” అని పిలిచేవారు. కొన్ని సందర్భాల్లో పెద్ద సంస్థలతో పాటు బాపు రమణలకు కూడా సూర్యకాంతం ఆర్థికంగా సహాయం చేసేవారు. డబ్బు చేతికి వస్తే “రమణయ్యగారు తోటలో మామిడి పళ్ళు వచ్చాయి” అని చెప్పి వారిని పిలిపించుకొని డబ్బు ఇచ్చేవారట.

బాలరాజు కథ, అందాల రాముడు, బుద్ధిమంతుడు, ముత్యాల ముగ్గు చిత్రాల్లో బాపు రమణలు ఆమె కోసం ప్రత్యేకంగా సృష్టించిన విభిన్నమైన పాత్రలు పోషించారు. సూర్యకాంతంకు కార్లు, కళ్ళజోళ్లంటే విపరీతమైన ఇష్టం. ఆ రోజుల్లో మద్రాసులో కేవలం రెండు మే ఫ్లవర్ కార్లు ఉండగా, అందులో ఒకటి ఆమె సొంతం. ఒక సినిమాలో మోడరన్ వేషం అని చెప్పగానే 150 రకాల కళ్ళజోళ్లను తెప్పించుకున్నారంటే ఆమె అభిరుచి అర్థమవుతుంది. సెట్‌లో ఉంటే పులిహోర, బూరెలు, అరిసెలు, అప్పాలు, తాపేశ్వరం కాజా, కాల్చిన మోరి జీడిపప్పులు, ఆత్రేయపురం పూతరేకులు వంటి పిండివంటలతో కూడిన పెద్ద క్యారేజీలు తెప్పించి అందరికీ వడ్డించేవారు. వంటల్లో ఆమె సిద్ధహస్తురాలై, దినుసుల పాళ్లతో ఒక పుస్తకం కూడా రాశారు. ఇంటి పని, వంట పని చూసుకునే నలుగురైదుగురు మహిళలను తన కుటుంబ సభ్యుల్లానే చూసుకునేవారు. డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉన్నప్పటికీ, దానధర్మాల విషయంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. సినిమాల వ్యామోహంతో ఇల్లు విడిచి వచ్చి డబ్బు పోగొట్టుకున్న అనేకమంది ఆడవాళ్ళను ఆదుకుని, ధన సహాయం చేసి ఊళ్లకు పంపించారు. పేద బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన చాలామందికి ఉపనయనాలు చేయించారు.

సూర్యకాంతం భర్త పెద్దిభొట్ల వెంకట చలపతిరావు. సంతానం లేకపోవడంతో తన చెల్లెలు సత్యవతి కొడుకు అనంత పద్మనాభమూర్తిని దత్తత తీసుకున్నారు. పద్మనాభమూర్తి బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయన పిల్లలు సూర్య సత్య వెంకట బాలసుబ్రహ్మణ్యం చార్టర్డ్ అకౌంటెంట్, జయలక్ష్మి ఎంబీబీఎస్ చదివారు. 1994 డిసెంబర్ 17న సూర్యకాంతం మరణించినప్పుడు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వచ్చి నివాళులర్పించారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవ్వరూ అక్కడికి రాకపోవడం విషాదకరం. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ మరణించినప్పుడు హాజరైన వారిలో పదో వంతు మంది కూడా సూర్యకాంతం ఇంటికి రాకపోవడం విచారకరం. రాత్రి మరణం సంభవించినందున తెల్లారి ఎవరైనా వస్తారేమోనని కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 12 గంటల వరకు ఎదురుచూశారు. ఎవరూ రాకపోవడంతో సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. తెరపై గయ్యాళిగా కనిపించినా, తెరవెనుక ఆమె నిస్వార్థ ప్రేమ, దానగుణం, మానవత్వంతో నిండిన మహానటిగా చరిత్రలో నిలిచిపోయారు.

(ఈ కథనం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టుల ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటర్నెట్‌లో అందుబాటులో సమాచారం అనుగుణంగా ఇవ్వబడింది)

Follow Us