Andhra Farmers: ఏపీలోని రైతులకు తీపికబురు.. వారందరికీ రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ..
రాజధాని అమరావతి గ్రామాల్లో బుధవారం మంత్రి నారాయణ పర్యటించారు. రెండో విడత భూసేకరణ ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా రైతుల నుంచి అంగీకార పత్రాలు అందుకున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయిస్తామని, వాటిని అభివృద్ది చేసి ఇస్తామని అన్నారు. అలాగే..

ఏపీలో రాజధాని అమరావతి ప్రాంత రైతులకు మంత్రి నారాయణ శుభవార్త అందించారు. రాజధాని రైతుల బ్యాంక్ రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 6 వరకు తీసుకున్నట్లు రుణాలను మాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.1.50 లక్షల వరకు బ్యాంక్ లోన్లను మాఫీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం వడ్డమానులో బుధవారం మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా రెండో విడత రాజధాని భూసమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల బ్యాంక్ రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు.
గతంలో కూడా భూసమీకరణకు భూములిచ్చిన రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణాలను మాఫీ చేశామని, ఇప్పుడు కూడా అదే పద్దతి పాటిస్తున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, ఆయన కూడా అంగీకరించారని అన్నారు. జనవరి 6లోపు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందన్నారు. రెండో విడత భూసమీకరణలో భాగంగా రైతుల నుంచి అంగీకార పత్రాలను బుధవారం నారాయణ అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల నుంచి తీసుకున్న భూములను ఎయిర్‌పోర్ట్, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటు కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు. రైతులకు కేటాయించే స్థలాలను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. వీటిల్లో రోడ్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు నిర్వహించి రైతులకు అందిస్తామని నారాయణ స్పష్టం చేశారు.
అటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చంద్రబాబు నిధులు తెచ్చారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు చంద్రబాబు నిరంతరం కృష్టి చేస్తున్నారని, కేంద్రం నుంచి నిధులు వచ్చేలా చొరవ తీసుకుంటున్నారని అన్నారు. రాజధాని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయలను అభివృద్ది చేస్తామని, లాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన గ్రామాల్లో త్వరలో అభివృద్ది పనులు చేపట్టాలని నారాయణను ఎమ్మెల్యే కోరారు. అలాగే అమరావతి రాజధానిగా చట్టబద్దత తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు.
