Suryakumar Yadav : సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే.. వారసుడు వస్తున్నాడోచ్
Suryakumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య దేవిషా శెట్టి సీమంతం వేడుక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న సూర్యకు ఇది రెట్టింపు ఉత్సాహాన్నిస్తోంది.

Suryakumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్, మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఇంట్లో త్వరలో చిన్నారి అడుగుపెట్టబోతోంది. సూర్య త్వరలోనే తండ్రి కాబోతున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్య భార్య దేవిషా శెట్టి గర్భవతి అని, దానికి సంబంధించిన సీమంతం వేడుక వీడియోలు బయటకు రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2026 సమయంలోనే ఈ వార్తలు వినిపించినప్పటికీ, ఇప్పుడు ఈ వీడియోలు రావడంతో అధికారికంగా స్పష్టత వచ్చింది.
సూర్యకుమార్, దేవిషాలది పదేళ్ల అనుబంధం. వీరిద్దరూ జూలై 7, 2016న ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో సూర్య కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడేవాడు. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత కానీ ఆయనకు టీమిండియాలో చోటు దక్కలేదు. కష్టకాలంలోనూ సూర్య వెంటే ఉంటూ దేవిషా ఆయనను ఎంతగానో ప్రోత్సహించింది. ఇప్పుడు ఈ దంపతులు తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో సూర్య తన భార్య దేవిషా చేయి పట్టుకుని వేడుక జరుగుతున్న హాల్‌లోకి ఎంతో ప్రేమగా తీసుకురావడం అందరినీ ఆకట్టుకుంటోంది.
నిజానికి సూర్యకు ఇది డబుల్ ధమాకా అని చెప్పాలి. ఆయన కెప్టెన్సీలోనే భారత్ ఇటీవల న్యూజీలాండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకుంది. సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ నెగ్గిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన రికార్డు కూడా టీమిండియా సొంతమైంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాతే సూర్య ఇంట్లో ఈ శుభవార్త తెలియడం విశేషం.
Baby shower of Suryakumar Yadav and Devika 😍❤️ pic.twitter.com/rYudGduOPE
— Jeet (@JeetN25) March 14, 2026
సీమంతం వేడుకకు ఒకరోజు ముందే సూర్యకుమార్ యాదవ్ తన భార్యతో కలిసి ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ఐసీసీ అధ్యక్షుడు జై షా, కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వారితో ఉన్నారు. చేతిలో ప్రపంచకప్ ట్రోఫీని పట్టుకుని సూర్య బప్పా ఆశీస్సులు తీసుకున్నారు. అటు కెరీర్ పరంగా ప్రపంచ విజేతగా నిలవడమే కాకుండా, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ తండ్రి కాబోతుండటంతో సూర్య ఆనందానికి అవధులు లేవు.
ఇక సూర్య క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని రారాజు. ఇప్పటివరకు 113 టీ20లు ఆడిన సూర్య 3272 పరుగులు చేశారు. ఇందులో 4 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిగా ఉన్న ఆయన 166 మ్యాచ్‌ల్లో 4311 పరుగులు సాధించారు. త్వరలో జరగబోయే ఐపీఎల్ 2026లో సూర్య మళ్ళీ మైదానంలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ లోపు ఈ శుభవార్త ఆయన ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ అనే చెప్పాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
