AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ 14 నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. అదనపు బలగాలతో పహారా

ఏపీలో మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అల్లరులు జరగకుండా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పోలింగ్ తేది దగ్గర పడుతూ ఉండటంతో అన్ని జిల్లాల్లో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్‎లను, స్ట్రాంగ్ రూములను స్వయంగా పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆ 14 నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. అదనపు బలగాలతో పహారా
State Chief Electoral Officer (ceo) Mukesh Kumar Meena
pullarao.mandapaka
| Edited By: |

Updated on: May 05, 2024 | 6:02 PM

Share

ఏపీలో మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అల్లరులు జరగకుండా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పోలింగ్ తేది దగ్గర పడుతూ ఉండటంతో అన్ని జిల్లాల్లో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్‎లను, స్ట్రాంగ్ రూములను స్వయంగా పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పరిశీలించేలా ఏర్పాటు చేయడంతో పాటు అదనపు భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై మరింత నిఘా ఉంచారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మొదటి నాలుగైదు రోజుల్లోనే రాష్ట్రంలో పలు జిల్లాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని సీరియస్‎గా తీసుకున్న ఎన్నికల కమిషన్.. కొంతమంది ఎస్పీలను కూడా బదిలీ చేసింది. ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరిని సమాన దృష్టితో చూడాలని అధికారులకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‎కు ప్రత్యేక పోలీస్ పరిశీలకులను కూడా ఎక్కువ స్థాయిలో నియమించింది. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల పరిశీలకులతో పాటు జిల్లా స్థాయిలోనూ అలాగే కొన్ని నియోజకవర్గాల స్థాయిల్లో కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన ఎన్నికల పరిశీలకులు గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉన్న పలు స్థానాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. దీంతో రాష్ట్రంలోని 14 నియోజకవర్గాలపై ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ సెంటర్లలో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తుండగా ఈ 14 నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

వంద శాతం వెబ్ కాస్టింగ్, అదనపు కేంద్ర బలగాలతో పహారా..

రాష్ట్రంలో సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తించింది. దీనికి తోడు కేంద్రం నియమించిన ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సమయంలో మరికొన్ని సమస్యత్మగా పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తం ఓటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 12,438 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యత్మకమైనవిగా గుర్తించారు. మొత్తం 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తం ప్రక్రియను పరిశీలించనున్నారు. అయితే కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికల ప్రకారం మొత్తం 14 నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‎ను ఏర్పాటు చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని కేంద్రాల వద్ద అదనపు కేంద్ర బలగాలను మోహరించనున్నారు. రాష్ట్రంలో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లిలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.