Cyclone Montha: తుపాన్ ఎఫెక్ట్.. వారికి సెలవులు రద్దు చేసిన సర్కార్!
Cyclone Montha latest updates: నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఈ రోజు కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో..

అమరావతి, అక్టోబర్ 27: నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేడు మొంథా తుపాన్‌గా మారింది. ప్రస్తుతానికి చెన్నైకి 600కి.మీ, విశాఖపట్నంకి 710 కి.మీ, కాకినాడకి 680 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఈ రోజు కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సెలవులు రద్దు
మొంథా తుపాన్ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేసింది. అత్యవసర విధుల నేపధ్యంలో అక్టోబర్ 29 వరకు ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు రోజుల పాటు విద్యుత్ ఉద్యోగుల సెలవులు సైతం రద్దు
మొంథా తుఫాను ప్రభావం దృష్ట్యా విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29 వరకు విద్యుత్ ఉద్యోగులందరి సెలవులు రద్దు చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవి ప్రకటించారు. తుఫాను సమయంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. అలాగే పవర్ సప్లై సమస్యలు ఎదురైతే ప్రజలు 1912 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయాలని అన్నారు. గాలివానకు కిందపడిన విద్యుత్ స్తంభాలు, వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సమీపంలో ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








