పరీక్షలకు డుమ్మా కొట్టడానికి.. ఏకంగా ప్రిన్సిపల్‌నే చంపేసిన స్టూడెంట్స్!
ఒకప్పుడు పరీక్షలకు డుమ్మా కొట్టడానికి కడుపు నొప్పి, దొంగ జ్వరం, ఇంట్లో తాత- బామ్మలు చచ్చిపోయారని కుంటి సాకులు చెప్పేవారు. చివరకు ఢిల్లీలోని స్కూళ్ల మాదిరి పరీక్షలు ఎగ్గొట్టడానికి స్వయంగా తమ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపే గడుగ్గాయిలను కూడా చూసేశాం. అయితే ఓ కాలేజీ స్టూడెంట్స్ మాత్రం..

భోపాల్, అక్టోబర్ 17: చదువుకునే వయసులో మనలో చాలా మంది నానారకాల అల్లరి పనులు చేసి ఉంటాం. ఇక పరీక్షలకు డుమ్మా కొట్టడానికి చెప్పే అబద్దాలకు అడ్డూ అదుపు ఉండదు. అయితే ఒకప్పుడు కడుపు నొప్పి, దొంగ జ్వరం, ఇంట్లో తాత– బామ్మలు చచ్చిపోయారని కుంటి సాకులు చెప్పేవారు. చివరకు ఢిల్లీలోని స్కూళ్ల మాదిరి పరీక్షలు ఎగ్గొట్టడానికి స్వయంగా తమ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపే గడుగ్గాయిలను కూడా చూసేశాం. అయితే ఓ కాలేజీ స్టూడెంట్స్ మాత్రం ఇందుకు అంతకుమించి.. అన్నట్లు ఏకంగా కాలేజీ ప్రిన్సిపల్నే చంపేశారు (అంటే నిజంగా కాదనుకోండి). ‘పాపం.. మా కాలేజీ ప్రిన్సిపల్ చచ్చిపోయాడు. మా పరీక్షలను వాయిదా వేయండి సర్..’ అంటూ ఇద్దరు విద్యార్ధులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నానాయాగి చేశయడంతో స్థానికంగా ఈ యవ్వారం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న బతికున్న ప్రిన్సిపల్ కోపం కట్టలు తెంచుకుంది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో అక్టోబర్ 15, 16 తేదీల్లో సమగ్ర మూల్యాంకన పరీక్షలు జరుగనున్నాయి. అయితే ఇద్దరు బీసీఏ మూడో సెమిస్టర్ విద్యార్థులు ఎలాగైనా ఈ పరీక్షలు వాయిదా పడితే బాగుండు అనుకున్నారు. ఇందుకోసం ఓ ప్లాన్ వేశారు. కాలేజీ అధికారిక లెటర్‌హెడ్ ఫార్మాట్‌తో ఓ నకిలీ లేఖ రాశారు. అందులో ముఖ్యమైన సమాచారం. ప్రిన్సిపాల్ డాక్టర్ అనామిక జైన్ మంగళవారం (అక్టోబర్ 14) రాత్రి 10.15 గంటలకు ఆకస్మికంగా మరణించారు. అందువల్ల అక్టోబర్ 15, 16 తేదీల్లో జరగాల్సిన కాలేజీ ఆన్‌లైన్ పరీక్షలు, తరగతులు వాయిదా పడ్డాయి’ అని లేఖలో రాశారు. అనంతరం ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రిన్సిపల్ నిజంగానే మరణించారేమోనని సంతాపం తెలుపుతూ వరుస మెసేజ్లు రాసాగాయి. ఇంతలో ఆందోళన చెందిన కొందరు ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్రిన్సిపాల్ అనామిక జైన్‌కు ఫోన్ చేసి మీరెలా ఉన్నారంటూ పరామర్శించసాగారు. మరికొందరు హడావుడిగా ఆమె ఇంటికి చేరుకుని.. ప్రిన్సిపాల్ మరణించడం వల్ల కాలేజీ పరీక్షలు, తరగతులు వాయిదా పడినట్లు ఓ లెటర్ ఆన్లైన్లో వైరల్ అవుతున్నట్లు ప్రిన్సిపల్ అనామిక జైన్‌కు చెప్పడంతో ఆమె షాక్కు గురైంది. వెంటనే ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో ఇద్దరు బీసీఏ విద్యార్థుల పనిగా నిర్ధారించారు. మయాంక్ కచ్వాల్, హిమాన్షు జైస్వాల్ అనే ఇద్దరు విద్యార్ధులు ఈ ఫేక్ లెటర్ను సృష్టించి ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు పట్టుబడటానికి ముందు తన ఫోన్లో వాట్సాప్ డేటాను తొలగించినట్లు సమాచారం.
తీవ్రంగా కలత చెందిన ప్రిన్సిపల్ అనామిక జైన్ మాట్లాడుతూ.. ఈ సంఘటన తనను, తన కుటుంబాన్ని తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని అన్నారు. నేను చనిపోయానని నా ఇంటికి సంతాపం తెలియజేయడానికి చాలా మంది వచ్చారు. ఇది ఒక జోక్ కాదు. మానసిక గాయాన్ని కలిగించిన నేరపూరిత చర్య. ఇలాంటి సంఘటనలు మళ్లీ ఎప్పుడూ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను అభ్యర్ధించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




